Share News

స్వచ్ఛ సమాజం సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Oct 06 , 2025 | 11:33 PM

స్వచ్ఛతను జీవన విధానంగా సమాజం మార్చుకునేందుకు ఉద్యమ స్థాయిలో ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్‌ పి.రాజాబాబు పిలుపునిచ్చారు.

స్వచ్ఛ సమాజం సాధనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు, వేదికపై ఎమ్మెల్యే దామచర్ల, ఒడా చైర్మన్‌ రియాజ్‌, మేయర్‌ సుజాత, కమిషనర్‌ వెంకటేశ్వరరావు

ఘనంగా స్వచ్ఛ పురస్కారాలు ప్రదానోత్సవం

ఒంగోలు కార్పొరేషన్‌, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : స్వచ్ఛతను జీవన విధానంగా సమాజం మార్చుకునేందుకు ఉద్యమ స్థాయిలో ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్‌ పి.రాజాబాబు పిలుపునిచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఒంగోలులోని జీజీహెచ్‌ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను ప్రదానం చేస్తోందన్నారు. అదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా రాష్ట్రస్థాయిలో స్వచ్ఛ అవార్డులను అందజేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో జిల్లాకు రాష్ట్ర స్థాయిలో మూడు, జిల్లా స్థాయిలో 49 అవార్డులు లభించాయన్నారు. సింగపూర్‌ ప్రసిద్ధి చెందడానికి స్వచ్ఛతే ప్రధాన కారణమని కలెక్టర్‌ చెప్పారు.అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వచ్ఛతపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రతి మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛాంధ్ర,స్వర్ణాంద్రలో ఈ వేస్‌లో ఒంగోలు కార్పొరేషన్‌కు ఇటీవల అవార్డు లభించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ స్వచ్ఛత ఆవశ్యకతను తెలియజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్‌ డాక్టర్‌ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ మన ఇంటితోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు కంకణబద్దులు కావాలన్నారు. మేయర్‌ గంగాడ సుజాత మాట్లాడుతూ స్వచ్ఛత, పరిశుభ్రత, మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ స్వచ్ఛతతో పరిసరాల పరిశుభ్రతతోపాటు ఆరోగ్యం, కుటుంబ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందన్నారు. అనంతరం అవార్డులు పొందిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛత, స్వర్ణాంధ్ర ఆవిష్కరణపై నగర కమిషనర్‌ కే వెంకటేశ్వరరావు రచించిన గీతాన్ని గాయకుడు నూకతోటి శరత్‌బాబు స్వర కల్పన చేసి ఆలపించారు. అలాగే రాష్ట్ర స్థాయిలో పురస్కారాల ప్రదానోత్స కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని ఎల్‌ఈడీ స్ర్కీన్‌పై వీక్షించారు. కార్యక్రమంలో ఒడా చైర్మన్‌ షేక్‌ రియాజ్‌, మార్కాపురం సబ్‌ కలెక్టర్‌ సహదిత్‌ వెంకటత్రివినాగ్‌, డీఆర్వో చిన ఓబులేశ్‌, డీఎంహెచ్‌వో టి.వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

అమరావతిపై పాట ఆవిష్కరణ

రాజధాని అమరావతిపై నగర కమిషనర్‌ కే వెంకటేశ్వరరావు రచించిన పాటను కలెక్టర్‌ పి. రాజాబాబు, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌, మేయర్‌ గంగాడ సుజాత ఆవిష్కరించారు. గాయకులు నూకతోటి శరత్‌ ఆలపించగా, కమిషనర్‌ మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర, అమరావతి రాజధానిపై రచించిన గీతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అంకితమిస్తున్నట్లు కమిషనర్‌ తెలిపారు.

Updated Date - Oct 06 , 2025 | 11:33 PM