Share News

పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందాలి

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:56 PM

తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు.

పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందాలి
బూదవాడలో దెబ్బతిన్న మినుము పంటను పరిశీలిస్తున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి

పంగులూరు, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి) : తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందేలా చర్యలు చేపట్టాలని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. గురువారం మండలంలోని బూదవాడ, కోటపాడు, కొండమూరు గ్రామాలలో అధిక వర్షాలకు దెబ్బతిన్న మినుము, మొక్కజొన్న, మిరప, పత్తి పంటలను మంత్రి.. రైతులు, అధికారులతో కలసి పరిశీలించారు. పంట నష్టం ప్రాథమిక నివేదిక, ఈ క్రాప్‌ నమోదు గురించి వ్యవసాయాధికారి సుబ్బారెడ్డి మంత్రికి వివరించారు. దెబ్బతిన్న పంటల పరిశీలన సమయంలో ఆ సమాచారాన్ని సంబంధిత రైతులకు ముందుగా తెలియజేయాలన్నారు. నష్టపోయిన పంటల నమోదు విషయంలో అలసత్వం వహించవద్దని హెచ్చరించారు. ఈ క్రాప్‌ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు. అధిక వర్షంతో మినుము పూర్తిగా దెబ్బతిందని, మిరప ఉరకెత్తే పరిస్థితి ఉందని రైతులు మంత్రి దృష్టికి తెచ్చారు. బూదవాడ గ్రామంలో ధనలక్ష్మీ కాలనీలో నివాసగృహాల మధ్య నిలిచిన నీటిని పరిశీలించారు. కోటపాడు ఉన్నత పాఠశాలలో కూలిన ప్రహరీని పరిశీలించి పునర్నిర్మాణానికి తగిన అంచనాలు వెంటనే తయారు చేయాలని ఏఈ హనుమంతరావును ఆదేశించారు. కొండమూరు గ్రామంలో పంటలను పరిశీలించిన మంత్రి ఆ తర్వాత ఒరిగిఉన్న విద్యుత్‌ స్తంభాలను వెంటనే సరిచేయాలని ఈఈ మస్తానరావును ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి అనంతరాజు, ఎంపీడీవో స్వరూపారాణి, తహసీల్దార్‌ సింగారావు, ఏడీఈ దామోదరం, మండల టీడీపీ అధ్యక్షుడు రావూరి రమేష్‌, కుక్కపల్లి ఏడుకొండలు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రావుల సంగరకొండ, అల్లంనేని బ్రహ్మానందస్వామి, అలవల రామిరెడ్డి, బత్తుల వెంకటరావు, కొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, చింతల సహదేవుడు, సుబ్బారెడ్డి, ఆదిరెడ్డి, గడ్డం నాగేశ్వరరావు, కాటా అంజయ్య, చిలుకూరి వెంకటేశ్వర్లు, మురకొండ సుబ్బారావు, కాజా, ఉన్నం రవి, వినయ్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 10:56 PM