Share News

నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకోవాలి

ABN , Publish Date - Nov 12 , 2025 | 12:46 AM

మొంథా తుఫాన్‌ ప్రభావంతో పర్చూరు నియోజకవర్గం తీవ్రమైన వరద విపత్తును ఎదుర్కొందని, వ్యవ సాయం, వాగులు, కాలువలు, రహదారులు సహా అన్నీ రంగాలు భారీగా నష్టాన్ని చవిచూశాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు.

నష్ట పోయిన ప్రతి రైతును ఆదుకోవాలి

పర్చూరు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుఫాన్‌ ప్రభావంతో పర్చూరు నియోజకవర్గం తీవ్రమైన వరద విపత్తును ఎదుర్కొందని, వ్యవ సాయం, వాగులు, కాలువలు, రహదారులు సహా అన్నీ రంగాలు భారీగా నష్టాన్ని చవిచూశాయని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. పర్చూరును తీవ్ర వరద ప్రభావిత ప్రాంతంగా ప్రకటించి నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలన్నారు. కోట్లాది రూపాయల నష్టాన్ని పూడ్చేందుకు భారీగా సాయం అందించాలన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు రాసిన లేఖను కేంద్ర ప్రభుత్వ ఇంటర్‌ మినిస్టీరియల్‌ సెంట్రల్‌ టీం వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పి.పౌసుమి బసు, మహేష్‌ కుమార్‌, శశాంక్‌ శేఖర్‌ రాయ్‌, సాయి భగీరధ్‌లతోపాటు, రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్ధ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌, జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌లకు లేఖను పర్చూరు మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ గుంజి వెంకట్రావు, రాష్ట్ర కార్పోరేషన్‌ డైరెక్టర్లు, నాయకుల సారథ్యంలో అందజేశారు.

వేలాది ఎకరాల్లో పంటల నష్టం

తుఫాను ప్రభావంతో వేలాది ఎకరాల్లో వరి, ప్రత్తి, మినుముల, మిర్చి వంటి ప్రధాన పంటలు తీవ్రంగా నష్టపోయామన్నారు. ఇప్పటికే రైతుల వద్ద ఉన్న నల్లబర్లి కొనుగోలు చేయలేదని తక్షణమే కొనుగోలు చేయాలని కోరారు. వర్షాలకు రైతులు సర్వస్వం కోల్పొయారని, దీని నుంచి బయట పడాలంటే వందశాతం నష్టపరిహారం అందించాలన్నారు.

కల్వర్టులు లేకపోవడంతో మునిగిన గ్రామాలు

ఇటీవల నిర్మించిన పిడుగురాళ్ల- వాడరేవు జాతీయ రహదారి (167ఏ) నిర్మాణంలో సరైన ప్రమాణాలను పాటించకపోవటం, డ్రెయిన్లు ఏర్పాటు చేయక పోవడంతో నీరు నిలిచి పర్చూరు, కారంచేడు పరిధి లోని పలు గ్రామాలు, వరద నీటిలో మునిగిపోయా యన్నారు. దీంతో పంట భూములతోపాటు, ప్రజలకు కూడా తీవ్రనష్టం వాటిల్లిందన్నారు.

కొమ్మమూరుపై వందకు పైగా గండ్లు..

తుఫాన్‌ సమయంలో కృష్ణా వెస్ట్రన్‌ డెల్టా (కొమ్మమూరు) కాలువ ఒత్తిడిని తట్టుకోలేక వందకు పైగా గండ్లు పడ్డాయన్నారు. కొమ్మమూరు కాలువ పునరుద్దరణకు ప్రత్యేక ఆధునికీకరణ ప్యాకేజ్‌ ఇవ్వాలని ఏమ్మెల్యే కేంద్రబృందానికి విజ్ఙప్తి చేశారు. పోతుకట్ల సమీపంలో సాకి వాగు, అలాగే కారంచేడు వద్ద అండర్‌ టన్నెల్లు, బ్రిటీష్‌ కాలం నాటి నిర్మాణాలను ఆధునీకరించాలని కోరారు.

సముద్రాన్ని తలపించిన పంటభూములు

వైసీపీ ఐదేళ్ల పాలనలో వాగులు, కాలువలు, అస్తవ్యస్తంగా మారాయని, కనీసం మరమ్మతులకు కూడా నోచుకోక పోవడంతో ఇంలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రధానంగా సాకివాగు, పర్చూరు వాగు, నక్కల వాగు, కప్పల వాగు, తొండి వాగు, ఆలేరు వాగు, అప్పేనరు, రొంపేరు వంటి కీలక వాగుల్లో పూడికలు, పిచ్చిమొక్కలతో నిండిపోయి ఉన్నాయన్నారు. నీరు ప్రవహించేందుకు అవకాశం కూడా లేకుండా పోయిందన్నారు. పలు చోట్ల కట్టలు తెగిపోవటం, గండ్లు పడటంతో పంటలు పూర్తిగా నీటమునిగి దెబ్బతిన్నాయన్నారు. ఈ వాగుల్లో పూడిక తీసి కట్టలను సరిచేయాలని వారి నివేదికలో ప్రస్తావించారు.

Updated Date - Nov 12 , 2025 | 12:46 AM