Share News

ప్రజలు తిరస్కరించినా వైసీపీ నేతలకు బుద్ధిరాలేదు!

ABN , Publish Date - Sep 11 , 2025 | 10:15 PM

మీ పాలన వద్దని ప్రజలు తిరస్కరించినా వైసీపీ నేతలకు బుద్ధిరాలేదని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు.

ప్రజలు తిరస్కరించినా వైసీపీ నేతలకు బుద్ధిరాలేదు!
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ధ్వజం

కనిగిరి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): మీ పాలన వద్దని ప్రజలు తిరస్కరించినా వైసీపీ నేతలకు బుద్ధిరాలేదని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. యూరియాపై అసత్య ప్రచారం చేస్తుందన్నారు. ఈప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో గురువారం అధికారులు, దుకాణాల యజమానులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులను అందించాలన్నారు. ఇటీవల యూరియాపై జరిగిన అసత్య ప్రచారాలతో రైతులకు అపోహలకు పోయి అవసరానికి మించి కొనేందుకు యత్నిస్తున్నారని ఎరువుల డీలర్లు ఎమెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈసందర్భంగా తమ ఇబ్బందులను వివరించారు. ఎరువుల డీలర్ల ఇబ్బందులను కూడా జడ్పీ సమావేశంలో చర్చించి తగిన న్యాయం చేస్తామని చెప్పారు.

ప్రజాక్షేమం కోసం పరితపించటం అంటే మంత్రి నారా లోకేష్‌ను చూసి జగన్‌ నేర్చుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. నేపాల్‌లో చిక్కుఉన్న తెలుగువారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు సచివాలయంలో ఉండి చర్యలు తీసుకున్నారన్నారు. ఆధునిక పరిఙ్ఞానాన్ని అందిపుచ్చుకుని వారితో వీడియోలో మాట్లాడి ధైర్యం చెప్పారన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో అత్యవసర హెల్ప్‌లైన్‌ ఏర్పాటుచేసి వారితో మాట్లాడుతూ ధైర్యం చెప్పారన్నారు. కేంద్రం అండతో వారిని సమన్వయ పరుచుకుంటూ నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా స్వస్థలాలకు రప్పించే ఏర్పాట్లు చేశారన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి ఎలాంటి ఆపద వచ్చినా నిలబడి పరిష్కరించే చంద్రబాబు తనయుడిగా మంచిపేరు తెచ్చుకుంటున్న లోకేష్‌ను చూసి జగన్‌ నేర్చుకోవాలన్నారు. అసత్య ప్రచారాలు మానుకుని మసులుకుంటే మంచిదన్నారు. సమావేశంలో ఆర్డీవో కేశవర్ధన్‌రెడ్డి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్యామల కాశిరెడ్డి, ఏడీఏ జైనులాబ్దిన్‌, తహసీల్దార్‌ రవిశంకర్‌, టీడీపీ మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి (ఎస్‌టీఆర్‌), కొండా కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2025 | 10:15 PM