Share News

సంక్షోభంలోనూ సంక్షేమం ఘనత ప్రజా ప్రభుత్వానిదే

ABN , Publish Date - Dec 01 , 2025 | 10:11 PM

సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌ రెడ్డి చెప్పారు.

సంక్షోభంలోనూ సంక్షేమం ఘనత ప్రజా ప్రభుత్వానిదే
పెన్షన్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి

లింగోజిపల్లిలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి

కంభం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : సంక్షోభంలోనూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్న ఘనత ప్రజా ప్రభుత్వానిదేనని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్‌ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా సోమవారం కంభం మండలం లింగోజిపల్లిలో శాసనసభ్యులు అశోక్‌ రెడ్డి ఇంటింటికీ తిరిగి ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన గత ఐదేళ్లు జగన్‌మోహన్‌ రెడ్డి పెన్షనర్లను దారుణంగా మోసం చేశారన్నారు. ఆయన ఇచ్చిన హామీ వెయ్యి రూపాయల పెన్షన్‌ పెంచేందుకు నాలుగేళ్లు పట్టిందన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో వెయ్యి రూపాయలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో రాష్ట్రంలో 50,763 కోట్లు ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటేనని చెప్పారు. పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యమని, ఇది పేదల ప్రభుత్వమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంభం మండల పార్టీ అధ్యక్షుడు తోట వెంకటశ్రీనివాసరావు, కంభం మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ పూనూరు భూపాల్‌ రెడ్డి, సొసైటీ బ్యాంకు చైర్మన్‌ కేతం శ్రీనివాసులు, రాష్ట్ర నగర కార్పొరేషన్‌ డైరెక్టర్‌ ఆరేపల్లి మల్లికార్జున, లింగోజిపల్లి గ్రామ నాయకులు తాటికొండ వెంకటేశ్వర్లు, కాశయ్య, ఎంపీడీవో వీరభద్రాచారి, తహసీల్దార్‌ కిరణ్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2025 | 10:13 PM