రూ.కోట్లు వెచ్చించినా.. తప్పని పాట్లు
ABN , Publish Date - May 19 , 2025 | 01:40 AM
ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువు పంట కాలువలు, తూముల మరమ్మతుల్లో మాయ జరుగుతోంది. రూ.కోట్లు వెచ్చించినట్లు చూపుతున్నా ఆయకట్టు రైతులకు మాత్రం పాట్లు తప్పని పరిస్థితి నెలకొంది. ఇరిగేషన్ అధికారుల అవినీతి, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఇందుకు కారణమైంది.
కంభం చెరువు పంట కాలువల్లో పూడికతీత పేరుతో స్వాహా
ఎక్కడి చెత్త అక్కడే
తొలగించని ఆక్రమణలు
కరువైన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఆందోళనలో ఆయకట్టు రైతులు
కంభం, మే 18 (ఆంధ్రజ్యోతి): ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చెరువుగా పేరుగాంచిన కంభం చెరువు పంట కాలువలు, తూముల మరమ్మతుల్లో మాయ జరుగుతోంది. రూ.కోట్లు వెచ్చించినట్లు చూపుతున్నా ఆయకట్టు రైతులకు మాత్రం పాట్లు తప్పని పరిస్థితి నెలకొంది. ఇరిగేషన్ అధికారుల అవినీతి, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం ఇందుకు కారణమైంది. గత 15 సంవత్సరాల్లో కోట్లాది రూపాయల నిధులు మంజూరైనప్పటికీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. పంట కాలువలు దట్టంగా పెరిగిన చిల్లచెట్లు, చెత్తతో నిండి కనిపిస్తున్నాయి. కాలువల్లో చేపట్టిన పూడికతీత పనులు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. కాలువలను ఆక్రమించుకుని నిర్మించుకున్న అక్రమ కట్టడాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించిన అధికారులు నోటీసులతో సరిపెట్టుకుంటున్నారు. పూడిక తీశామని చెప్తున్నా కాలువల్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. ప్రభుత్వం చెరువు, కాలువల మరమ్మతులకు కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నా స్థానిక ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి వాటిని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పదేళ్ల క్రితం జపాన్ ప్రభుత్వం కంభం చెరువు అభివృద్ధి, కాలువల మరమ్మతులకు రూ.9 కోట్లు మంజూరు చేయగా తూతూమంత్రంగా పనులు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బాధ్యులపై చర్యలు కరువయ్యాయి. అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతికి ప్రధాన కారకునిగా ఆరోపణలు ఎదుర్కొన్న అప్పటి డీఈ ఉద్యోగోన్నతిపై బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో మరలా ఇరిగేషన్ పంట కాలువల పూడికతీత, ఆక్రమణల తొలగింపు పేరిట రూ.28లక్షలు మంజూరయ్యాయి. మూడు నెలల క్రితం కాలువల్లో పూడికతీత పనులు ప్రారంభించారు. ఈ పర్యాయం కూడా పనుల తీరు పాతవిధానంలోనే కొనసాగుతుండడంపై రైతులు, ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కంభం చెరువు నీటి సంఘం అధ్యక్షుడు పార్శ ఆదినారాయణ ప్రస్తుతం జరుగుతున్న పనులకు సంబంధించి బహిరంగంగానే ఇరిగేషన్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంట కాలువలపై పాగా
ఇరిగేషన్ పంట కాలువలపై యథేచ్ఛగా ఆక్రమణలు జరిగి అక్రమ కట్టడాలు, చప్టాలు నిర్మించుకున్నా అడిగేవారు లేకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి వలన పొలాలకు నీరు సక్రమంగా వెళ్లేందుకు దారిలేకుండా పోయింది. ఆయకట్టుకు నీరందడం లేదు. కాలువలు ఆక్రమించి కొంతమంది బహుళ అంతస్థులు నిర్మించారు. ఇదేవిధంగా నిర్మాణాలు కొనసాగితే కొంత కాలానికి కాలువలు మాయమవుతాయని రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పం దించి సర్వే చేయించి ఆక్రమణలను తొలగించాలని కోరుతున్నారు.