Share News

ఇంటి వద్దకే ఈసేవలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:41 AM

కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సేవలు పొందాలంటే ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌, మీసేవ, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ప్రస్తుత ఈ గవర్నెన్స్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

ఇంటి వద్దకే ఈసేవలు
బయోమెట్రిక్‌ పరికాలు అందుకున్న లబ్ధిదారులతో మెప్మా పీడీ శ్రీహరి

పట్టణ ప్రాంతాల్లో డీజీ లక్ష్మి పథకం అమలు

పొదుపు సభ్యులతో కామన్‌ సర్వీస్‌ సెంటర్లు

మహిళల ఆర్థికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు

నిర్వహణ బాధ్యతలపై మెప్మా చర్యలు వేగవంతం

ఒంగోలు కార్పొరేషన్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర, రాష్ట్రప్రభుత్వ సేవలు పొందాలంటే ఇప్పటి వరకూ ఆన్‌లైన్‌, మీసేవ, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. అయితే ప్రస్తుత ఈ గవర్నెన్స్‌ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పట్టణ పొదుపు సభ్యులతో ఇంటి వద్దనే సేవలు పొందే విధంగా ఉపాధి, ఆర్థిక తోడ్పాటు అందించడానికి డీజీ లక్ష్మి (డిజిటల్‌ గవర్నెన్స్‌ లక్ష్మి) పేరుతో పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీంతో ఇకపై పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల వద్దనే ఈ-సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని అమలుకు మెప్మా, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ నిర్వాహకుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు, అవసరమైన చర్యలు వేగవంతం చేశారు. ఆన్‌లైన్‌ ద్వారా లభించే సేవలను మహిళలు ఇంటి వద్దనే నిర్వహించుకుని స్వయం కృషితో ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రభుత్వం డిజిటల్‌ గవర్నెన్స్‌ లక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అందులో భాగంగా ఈ-గవర్నెన్స్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌ తోడ్పాటుతో పట్టణాల్లోని స్లమ్‌ లెవల్‌ సమాఖ్య పరిధిలో ఒక కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (సీఎస్‌సీ)ను నెలకొల్పనున్నారు. వీటి ద్వారా మీసేవా కేంద్రాల్లో అందించే అన్ని రకాల ప్రభుత్వ ఆన్‌లైన్‌, డిజిటల్‌ సేవలను అందించనున్నారు. జిల్లాలో సుమారు326 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

డీజీ లక్ష్మి పథకం అంటే..

డిజిటల్‌ గవర్నెన్స్‌ లక్ష్మి పథకం ద్వారా పట్టణ ప్రాంతాల్లో కామ న్‌ సర్వీస్‌ సెంటర్లు ఏర్పాటు చేయడానికి, నిర్వహించడా నికి స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ కేంద్రాల ద్వారా ప్రజలు 20రకాల డిజిటల్‌ ప్రభుత్వ సేవలను పొందవచ్చు. వీటిలో ఆధార్‌ అప్‌డేట్స్‌, విద్యుత్‌, ఇంటి, నీటి పన్నులు, రేషన్‌ కార్డుల సేవలు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, బస్‌, రైలు టిక్కెట్ల రిజర్వేషన్‌, వివిధ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందించే ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవచ్చు, కియోస్క్‌, కంప్యూటర్‌, ప్రింటర్‌, ఇంటర్నెట్‌సదుపాయంతో కూడిన కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి రూ.2.5 లక్షలను బ్యాంకు ద్వారా రుణ సౌకర్యం కల్పిస్తారు. అవసరమైన ట్యాబ్‌లను ఇస్తారు.

పథకానికి అర్హులు వీరే

పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘంలో సభ్యురాలై ఉండాలి. మూడు సంవత్సరాల నుంచి సభ్యత్వం కలిగి ఉండాలి. వివాహమై అదే ప్రాంతంలో నివాసం కలిగి ఉండాలి. స్మార్ట్‌ఫోన్‌, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండటంతోపాటు, 21 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు, డిగ్రీ అర్హత అవసరం. ఒంగోలు కార్పొరేషన్‌లో 164, మార్కాపురం 64, గిద్దలూరులో 35, కనిగిరి 31, దర్శి 15, చీమకుర్తిలో 20, స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్‌ (ఎస్‌ఎల్‌ఎఫ్‌)లు ఉండగా వాటి పరిధిలోడీజీ లక్ష్మి కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లు ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - Jul 31 , 2025 | 01:41 AM