Share News

కార్పొరేషన్‌ స్థలంపై కబ్జాదారుల కన్ను

ABN , Publish Date - May 19 , 2025 | 11:42 PM

కార్పొరేషన్‌ స్థలాలకు రక్షణ కరువైంది. ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒంగోలులోని వీఐపీ రోడ్‌లోని విలువైన 30 గదుల ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు.

కార్పొరేషన్‌ స్థలంపై  కబ్జాదారుల కన్ను
కార్పొరేషన్‌ సిబ్బందిపై దౌర్జన్యం చేస్తున్న ఆక్రమణదారుడు

వీఐపీ రోడ్‌లోని స్థలాన్ని ఆక్రమించే యత్నం

అడ్డుకున్న అధికారులు, పోలీసులు

పార్కుగా అభివృద్ధి చేయాలని కోరుతున్న స్థానికులు

ఒంగోలు, కార్పొరేషన్‌, మే 19 (ఆంధ్రజ్యోతి) : కార్పొరేషన్‌ స్థలాలకు రక్షణ కరువైంది. ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా ఒంగోలులోని వీఐపీ రోడ్‌లోని విలువైన 30 గదుల ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఆ స్థలంలో ఏకంగా బోర్‌ వేస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆక్రమణను అడ్డుకునే ప్రయత్నం చేయగా, సిబ్బందిపై అతను దురుసుగాప్రవర్తించారు. ఇదేక్రమంలో స్థానికులు సైతం ఆక్రమణదారుడితో వాగ్వాదానికి దిగారు. వివరాల్లోకెళితే... స్థానిక వీఐపీ రోడ్‌లోని కార్పొరేషన్‌కు చెందిన సర్వే నెం.279/1ఆ1లో రిజర్వు స్థలం 30 గదులు ఉంది. దాని విలువ ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం రూ.1.50 కోట్లు ఉంటుంది.

కీలకంగా ఇద్దరు వ్యక్తులు

ఒంగోలుకు చెందినఇద్దరు వ్యక్తులు ఆ స్థలాన్ని కొట్టేసేందుకు తమ పలుకుబడిని ఉపయోగించి అధికార దర్పాన్ని ప్రదర్శించారు. కార్పొరేషన్‌ స్థలంలో బోర్‌ వేస్తుండటంతో అధికారులు అడ్డుకోగా, మా స్థలమంటూ బుకాయించారు. బయటకు పోండంటూ కార్పొరేషన్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను బెదిరించడంతోపాటు పదేపదే ఫోన్‌లో రాజకీయ సిఫార్సులు చేయించారు. వచ్చిన వారు ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. అప్పటికే ఆక్రమణదారులు తమ వద్దడీకే పట్టా ఉందని, 2000లో అప్పటి తహసీల్దారు, కలెక్టర్‌ తమకు పట్టా ఇచ్చారని దౌర్జన్యం చేశారు. అప్పటికీ ఆక్రమణ పనులు జరుగుతుండటంతో కార్పొరేషన్‌ సిబ్బంది విషయాన్ని కమిషనరు కే వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు పోలీసుల సహకారంతో అధికారులు ఆక్రమణను అడ్డుకుని బోర్‌ను తొలగించారు. అప్పటి వరకు బుకాయింపులకు పాల్పడిన ఆక్రమణదారులు కిమ్మనకుండా జారుకున్నారు. ఇదే విషయమై కమిషనరు మాట్లాడుతూ కార్పొరేషన్‌ రికార్డుల ప్రకారం 30 గదుల స్థలం కార్పొరేషన్‌కు చెందినదిగా తెలిపారు. ఇది ఆక్రమణకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆక్రమణలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

చర్యలు తీసుకోవాలి

కార్పొరేషన్‌కు చెందిన స్థలం ఆక్రమణకు గురికాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు దామా శ్రీనివాసరావు కోరారు. ఖాళీ స్థలానికి రక్షణ కంచెలు వేసి, ఆ ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేయాలని కోరారు. అదేవిధంగా స్థానికులు మాట్లాడుతూ తమ ప్రాంతానికి ఎలాంటి పార్కు లేదని, కనీసం కమ్యూనిటీ హాలు కూడా లేనందున కార్పొరేషన్‌ అధికారులు దృష్టి సారించి, అభివృద్ధి చేసి, ఆక్రమణల నుంచి కాపాడాలని కోరారు.


అధికారుల నోరు నొక్కిన ఆ ఫోన్‌ కాల్‌ ఎవరిది ?

వీఐపీ రోడ్‌లో కార్పొరేషన్‌ స్థలం ఆక్రమణ సమయంలో అడ్డుకున్న అధికారులు, స్థానికులపైనా బెదిరింపులకు పాల్పడుతున్న ఆక్రమణదారులు ప్రతిసారీ ఓ ఫోన్‌చేయడం, అటువైపు నుంచి అధికారులకు ఫోన్‌ రావడం, వారు మౌనం వహించడం అక్కడ చర్చనీయాంశమైంది. ఇలా సుమారు ఐదారుసార్లు జరగ్గా ఫోన్‌ వచ్చిన ప్రతిసారీ కార్పొరేషన్‌ అధికారులు వెనక్కి తగ్గడంపై విమర్శలు వచ్చాయి. దీంతో టౌన్‌ ప్లానింగ్‌ అధికారి నారాయణకు కూడా ఇదే తరహా అనుభవం రావడంతో అటు వైపు వ్యక్తికి టౌన్‌ప్లానింగ్‌ అధికారి సరైన సమాధానమిచ్చారు. పంచాయతీగా ఉన్నప్పటి నుంచి ఆ స్థలం గురించి తనకు తెలుసన్నారు. దీనిపై ఎవరికి ఎలాంటి పట్టాలు ఇవ్వలేదని, ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దని సమాధానం చెప్పడంతో చేసేదేమి లేక వారు అక్కడ నుంచి జారుకుకున్నారు.

Updated Date - May 19 , 2025 | 11:42 PM