ప్రతిభ పరీక్షలతో విద్యార్థులకు ప్రోత్సాహం
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:34 AM
విద్యార్థు లలో పోటీతత్వాన్ని పెంచడానికి, వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పోటీలు నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ డీఈవో గంగాధర్ అన్నారు.
మేదరమెట్ల, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): విద్యార్థు లలో పోటీతత్వాన్ని పెంచడానికి, వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పోటీలు నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ డీఈవో గంగాధర్ అన్నారు. ఆదివారం మండలంలోని రావినూతల జిల్లా పరిషత్ హైస్కూల్‌లో యలగాల సుబ్బారావు స్మారక ప్రతిభ పరీక్ష పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ యలగాల సుబ్బారావు జ్ఞాప కార్థం ఆయన కుమారుడు డాక్టర్ యలగాల గోపి చంద్ ఏటా పదో తరగతి విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించడం స్ఫూర్తిదాయకమన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఈ పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అద్దంకి జె. పంగులూరు, ఇంకొల్లు, బల్లికురవ, కొరిశపాడు మండలాలలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలలో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరిల వారిగా ప్రథమ బహుమతి రూ.15 వేలు, ద్వితీయ బహుమతి రూ.10వేలు, తృతీయ బహుమతి రూ.5 వేలుగా అందజేయనున్నారు. ఈ పోటీలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థికి రూ.20 వేల రూపాయలు నగదు అందజేయనున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విద్యార్థులే కాకుండా పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులలో ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థికి రూ.3వేల కన్సెలేషన్ బహుమతి ప్రకటించారు.
ఆదివారం జరిగిన పోటీలలో ఓసీ కేటగిరిలో చందలూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన బాచిన మోహన శ్రీనివాస్‌కు ప్రథమ బహుమతి, ద్వితీయస్థానం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన మారం ఈశఽ్వరరెడ్డి, తృతీయ స్థానం కొప్పెరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్.కీర్తనలు నిలిచారు. బీసీ కేటగిరిలో చందలూరు హైస్కూల్‌కు చెందిన కట్టా వంశీకృష్ణ ప్రథమ బహుమతి, అదే పాఠశాలకు చెందిన ఉప్పుమాగులూరి వెంకట గీతాచరణ్ ద్వితీయ బహు మతి, కొప్పెరపాడు హైస్కూల్‌కు చెందిన యలగాల మోహనకృష్ణ తృతీయ బహుమతి సాధించారు. ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో కుకట్లపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌కు చెందిన కె. లోహిత్ ప్రథమ స్థానం, ఇంకొల్లు హైస్కూల్‌కు చెందిన ఏ.నాగచైతన్య ద్వితీయ స్థానం, పంగులూరు హైస్కూల్‌కు చెందిన ఎన్.అల్పిత తృతీయ స్థానం సాధించింది. ఈ పోటీలలో బహుమతులు పొందిన విద్యార్థులకు కనుమ పండుగ రోజు నగదు బహుమతులు అందజేస్తామని డాక్టర్ యలగాల గోపిచంద్ తెలిపారు. ఈ ప్రతిభ పరీక్ష పోటీలను ఉపాధ్యాయులు పూనాటి హరిబాబు, కేమా శ్రీనివాసరావులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావినూతల జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యా యులు రాఘవరెడ్డి, మిగత మండలాల్లోని ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.