Share News

నేడు ఉపాధి పథకం గ్రామసభలు

ABN , Publish Date - Nov 22 , 2025 | 02:37 AM

జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధి హామీ పథకం గ్రామ సభలు జరగనున్నాయి. అన్ని పంచాయతీల్లో ఒకే రోజున వీటిని నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఆదేశాలతో డ్వామా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల కేంద్రం ఆదేశాలతో ఉపాధి కూలీల జాబ్‌ కార్డులన్నింటికీ ఈకేవైసీ చేశారు.

నేడు ఉపాధి పథకం గ్రామసభలు

అన్ని పంచాయతీల్లో ఒకేరోజు నిర్వహణ

ఈకేవైసీ లోపాల సవరణ, కొత్త జాబ్‌ కార్డులు

ఒంగోలు, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా శనివారం ఉపాధి హామీ పథకం గ్రామ సభలు జరగనున్నాయి. అన్ని పంచాయతీల్లో ఒకే రోజున వీటిని నిర్వహిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఆదేశాలతో డ్వామా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇటీవల కేంద్రం ఆదేశాలతో ఉపాధి కూలీల జాబ్‌ కార్డులన్నింటికీ ఈకేవైసీ చేశారు. జాబ్‌ కార్డులు ఉండి అందుబాటులో లేని కూలీలు, వలస వెళ్లిన వారు, మృతులు ఇలా రకరకాల కారణాలతో రాష్ట్రంలో పెద్దఎత్తున జాబ్‌ కార్డులు రద్దయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న జాబ్‌కార్డుల్లో దాదాపు 15 లక్షల కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదని సమాచారం. అలాంటి వారందరికీ ఇక ఉపాధి పథకం పనులు కల్పించే అవకాశం లేకుండా పోయింది. మరికొంత మంది కొత్తగా జాబ్‌ కార్డులు కావాలని వివిధ సందర్భాలలో ప్రజాప్రతినిధులు, అధికారులను అడుగుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు గ్రామసభలు నిర్వహించి ఈకేవైసీ లోటుపాట్ల సవరణ, అర్హులైన వారికి కొత్త జాబ్‌ కార్డుల మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆమేరకు శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఆదేశించారు. తదనుగుణంగా జిల్లాలో 729 పంచాయతీలలో గ్రామసభలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌ తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లాలో దాదాపు లక్ష మంది జాబ్‌ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోలేదు. అంటే జిల్లాలో ఉన్న సుమారు ఆరు లక్షల జాబ్‌ కార్డులలో ఇంచుమించు 15నుంచి 17శాతం వరకు ఈకేవైసీకి దూరంగా ఉన్నారు. ఈనేపథ్యంలో అర్హతలు ఉండి సకాలంలో ఈకేవైసీ చేయించుకోలేకపోయిన వారికి ఈ గ్రామ సభల్లో వాటిని సరిదిద్దనున్నారు. అర్హులకు కొత్త జాబ్‌ కార్డులను మంజూరు చేయడంతోపాటు కొత్తగా పని అవసరమైన వారి నుంచి వినతి పత్రాలు తీసుకొంటారు. వారికి పనుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు పీడీ జోసఫ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Nov 22 , 2025 | 02:37 AM