ఉపాధి బకాయిలు రూ.100కోట్లు
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:14 AM
ఉపాధి హామీ పథకం పనులు చేసిన వారు బిల్లుల కోసం గగ్గోలు పెడుతున్నారు. మెటీరియల్ నిధులతో పనులు చేసి తొమ్మిది నెలలైనా ఒక్క రూపాయి కూడా విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం అటుంచితే పెట్టుబడులకు వడ్డీలు కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. నెలల తరబడి బిల్లులు రాక.. తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కన్పించక ఆందోళన చెందుతున్నారు.
తొమ్మిది నెలలు దాటినా అందని బిల్లులు
గ్రామస్థాయి నేతల గగ్గోలు
ఉత్సాహంగా పనులు చేసి ఉసూరుమంటున్న వైనం
వడ్డీలు కూడా రావని ఆందోళన
ఉపాధి హామీ పథకం పనులు చేసిన వారు బిల్లుల కోసం గగ్గోలు పెడుతున్నారు. మెటీరియల్ నిధులతో పనులు చేసి తొమ్మిది నెలలైనా ఒక్క రూపాయి కూడా విడుదల కాక ఇబ్బందులు పడుతున్నారు. ఆదాయం అటుంచితే పెట్టుబడులకు వడ్డీలు కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. నెలల తరబడి బిల్లులు రాక.. తెచ్చిన అప్పులు తీర్చే మార్గం కన్పించక ఆందోళన చెందుతున్నారు. ఈ పనులు చేసిన వారంతా గత ఎన్నికల్లో గ్రామాల్లో టీడీపీ గెలుపు కోసం శ్రమించిన వారే కావడంతో కీలక నేతలు కూడా ఇరకాటంలో పడ్డారు. అటు ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించలేక, ఇటు కిందిస్థాయి నేతల ఒత్తిడి భరించలేక సతమతమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాక ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఒంగోలు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కోటా నిధుల కింద పనులు చేసిన వారు ఆ బిల్లులు రాక గగ్గోలు పెడుతున్నారు. తొమ్మిది నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. జిల్లాలో సుమారు రూ.100 కోట్లకుపైగానే ఈ పథకం కింద చేసిన పనులకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నూటికి 90శాతం నిధులను కేంద్రం ఇస్తుండటంతో రాష్ట్రంలో పెద్దఎత్తున కూలీలకు ఉపాధి పనులు, తద్వారా వచ్చే మెటీరియల్ కోటా నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు చేశారు.
అధికారంలోకి రాగానే భారీగా పనులు
గతంలో 2014-19 మధ్య కాలంలో జిల్లాలో వెయ్యికోట్లతో మెటీరియల్ కోటా పనులు జరిగాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిపై అంత శ్రద్ధ చూపించకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు పెద్దగా జరగలేదు. అదే సమయంలో అప్పట్లో మెటీరియల్ కోటా కింద అందుబాటులోకి వచ్చిన నిధులలో అధిక భాగం జగనన్న కాలనీల్లో లెవలింగ్ పనులు పేరుతో వైసీపీ నేతలు దోచేశారు. తిరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డాక మళ్లీ ఉపాధి మెటీరియల్ కోటా నిధుల ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టారు. అలా జిల్లాలో గత ఏడాది అక్టోబరులో ఒక్కో నియోజకవర్గానికి సగటున రూ.15 కోట్ల వంతున రూ.120 కోట్లు.. ఎస్సీ జనాభా అధికంగా ఉన్న గ్రామాల్లోని దళితవాడల్లో పనులకు రూ.35 కోట్లు, పశువుల షెడ్లు (గోకులాలు), ఇతర మరికొన్ని పనులకు కలిపి సుమారు రూ.180 కోట్ల విలువైన పనులను ఈ కోటా కింద మంజూరు చేశారు.
మూడు నెలలకే ఆగిన గ్రీన్‌చానల్ చెల్లింపులు
తొలుత గ్రీన్‌చానల్ పేరిట ప్రతి గురువారం చెల్లింపులు చేశారు. దీంతో అధికారులు ఒత్తిడి చేసి మరీ పనులు చేయించారు. మరో వైపు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో వచ్చిన పనులు కావడంతో ఎన్నికల సమ యంలో క్రియాశీలకంగా పనిచేసిన గ్రామ స్థాయి నేతలు పోటీ పడి మరీ పనులు దక్కించుకుని చేశారు. అయితే రెండు, మూడు నెలలకే గ్రీన్‌చానల్ పేరుతో వారం వారం చేస్తున్న చెల్లింపులు నిలిచిపోయాయి. భారీగా బిల్లులు పేరుకుపోయాయి. మొత్తం మీద 2024-25 సంవత్సరంలో జిల్లాలో ఉపాధి పథకం కింద రూ.431.62 కోట్లు ఖర్చు చేశారు. అందులో కూలీలకు వేతన రూపంలో రూ.273.39 కోట్లు లభించాయి. మెటీరియల్ పనుల కింద రూ.158.20 కోట్లు ఖర్చయ్యింది. అంటే ఆ ఏడాది మెటీరియల్ కోటా కింద మంజూరు చేసిన రూ.180 కోట్ల పనుల్లో రూ.158.20 కోట్ల పనులు జరిగాయి. చేసిన పనుల్లో రూ.99.70 కోట్లు మాత్రమే ఇప్పటివరకు చెల్లింపులు జరగ్గా ఇంకా ఆ ఏడాదికి సంబంధించి రూ.58.50 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. ప్రస్తుత ఏడాది 2025-26లో జిల్లాలో రూ.376.05 కోట్లు ఈ పథకం కింద ఖర్చు కాగా అందులో రూ.251.67 కోట్ల మేర వేతనాలు లభించాయి. రూ.124.40 కోట్ల మెటీరియల్ కోటా నిధులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మొత్తంలో రూ.230.38 కోట్ల వేతనాలు కూలీలకు అందాయి. ఇంకా రూ.21.29 కోట్లు రావాల్సి ఉంది.
పెండింగ్ బిల్లుల చెల్లింపులు
మెటీరియల్ కోటా కింద అందుబాటులోకి వచ్చిన రూ.124.40 కోట్లలో రూ.82.26 కోట్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది ఆ కోటా కింద పనులు పెద్దగా ఇవ్వకుండా ఆ నిధులను గతంలో 2014-19 మధ్య కాలంలో చేసిన పెండింగ్ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం ఇచ్చారు. సుమారు రూ.35 కోట్లు అప్పటి బిల్లులు చెల్లింపులు చేయగా గత ఏడాది చేసిన పనులలో జనవరి వరకు ఉన్న మరికొంత బిల్లులు చెల్లించారు. అలా పోగా ఈ ఏడాది మెటీరియల్ కోటా నిధులలో ఇంకా రూ.42.12 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. అంటే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి సుమారు రూ.100.62 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది సంక్రాంతి నుంచి ఇప్పటివరకు ఒక్కరికి ఒక్క రూపాయి కూడా రాక పనులు చేసిన వారు గగ్గోలు పెడుతున్నారు.