ఎమర్జెన్సీ దోపిడీ
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:59 AM
ఒంగోలులోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) వద్ద ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం నడుస్తోంది. అత్యవసర సేవల కోసం వైద్యశాలకు వచ్చిన వారి అవసరం, ఆందోళనను ఆసరా చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. ఆక్సిజన్, వైద్యపరికరాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలను నడుపుతూ రోగులు, వారి బంధువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.
ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకుల అడ్డగోలు వ్యవహారం
జీజీహెచ్ వద్ద ఇష్టానుసారంగా చార్జీల వసూలు
వాహనాల్లో కనిపించని ఆక్సిజన్, వైద్య పరికరాలు
కాలం చెల్లినవి నడుపుతూ రోగుల ప్రాణాలతో చెలగాటం
ఏజెంట్లుగా ఆసుపత్రి సిబ్బంది.. ప్రైవేటు వైద్యశాలలతో డీల్
ఒంగోలులోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) వద్ద ప్రైవేటు అంబులెన్స్ నిర్వాహకుల ఇష్టారాజ్యం నడుస్తోంది. అత్యవసర సేవల కోసం వైద్యశాలకు వచ్చిన వారి అవసరం, ఆందోళనను ఆసరా చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. ఆక్సిజన్, వైద్యపరికరాలు, ఫిట్‌నెస్ లేని వాహనాలను నడుపుతూ రోగులు, వారి బంధువుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఆసుపత్రిలో చేరిన వారి వద్ద వెంటనే వాలిపోతున్నారు. జీజీహెచ్‌లో సక్రమంగా వైద్యం అందదని భయపెడుతున్నారు. కార్పొరేట్, ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లాలని సూచిస్తూ మానసికంగా వారిని ఆవైపునకు సిద్ధం చేస్తున్నారు. అంతిమంగా రోగిని అక్కడికి తరలించి ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల నుంచి భారీగా కమీషన్‌లు తీసుకుంటున్నారు. అసలు వైద్యశాలలోని కొందరు డాక్టర్‌లు, సిబ్బంది కూడా ‘ప్రైవేటు’ ఏజెంట్లుగా మారారు. అంబులెన్స్ డ్రైవర్లకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. వీరికి కూడా ప్రైవేటు, కార్పొరేట్ వైద్యశాలల నుంచి పెద్దమొత్తంలోనే డబ్బులు ముడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో జీజీహెచ్ అంటేనే ప్రజలు భయపడిపోతున్నారు.
ఒంగోలు కార్పొరేషన్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : అత్యవసర సమయంలో రోగుల ప్రాణాలను కాపాడటంలో వైద్యుడి పాత్రఎంత ముఖ్యమో.. మెరుగైన చికిత్స కోసం సకాలంలో ఆసుపత్రికి తరలించడంలో అంబులెన్స్ సేవలు అంతే ప్రధానం. కొన్ని సందర్భాల్లో రోగులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడుతున్న అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఉన్నారు. కానీ ఒంగోలులోని సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) వద్ద ఎమర్జెన్సీ దోపిడీ నడుస్తోంది. ప్రైవేటు అంబులెన్స్‌ల నిర్వాహకులు రోగి పరిస్థితిని బట్టి వేలకు వేలు గుంజుతున్నారు. జీజీహెచ్ నుంచి ఒంగోలులోని వేరే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు రవాణాతోపాటు, అక్సిజన్, ఇతరత్రా చార్జీలు అంటూ రూ.10వేల వరకూ వసూలు చేస్తున్నారు. ఇక గుంటూరు, విజయవాడ తీసుకెళ్లాల్సి వస్తే రూ.30వేల నుంచి రూ.40వేలు గుంజుతున్నారు. పగలు ఒకరేటు.. రాత్రి వేళ మరో రేటు వసూలు చేస్తూ దందా సాగిస్తున్నారు.
వైద్యులు, సిబ్బంది సహకారం
పేదల పెద్దాసుపత్రి అయిన జీజీహెచ్‌లో కొందరు వైద్యులు, సిబ్బంది అంబులెన్స్ డ్రైవర్లకు సహకారం అందిస్తున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చే రోగులను భయపెడుతున్నారు. ఇక్కడ సరైన వైద్యం అందదని, ప్రాణాలకు గ్యారెంటీ లేదని చెప్తూ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లండని సలహా ఇస్తున్నారు. రోగిని తమ ఆసుపత్రికి సిఫారసు చేస్తే సిబ్బందికి ప్రైవేటు వారు రూ.1000 వరకు కమీషన్ ముట్టచెప్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అంబులెన్స్ డ్రైవర్లకు కేసును బట్టి రూ.3వేల వరకూ ఇస్తున్నట్లు సమాచారం.
కాలం చెల్లిన వాహనాలు.. పట్టించుకోని అధికారులు
ఒంగోలు జీజీహెచ్ కేంద్రంగా కొన్నేళ్లుగా రోగుల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న అంబులెన్స్‌ల నిర్వాహకులపై అధికారులు దృష్టి సారించడం లేదు. దీన్ని ఆసరా చేసుకొని వారు ఒకే నంబరు ప్లేటుతో రెండు, మూడు వాహనాలను నడుపుతున్నారు. కొన్ని అంబులెన్స్‌ల్లో అవసరమైన ఆక్సిజన్, వైద్య పరికరాలు ఏమీ ఉండటం లేదు. కేవలం ఒక స్ర్టెచర్, రోగి తరఫున ఉండే వ్యక్తి కూర్చుకునేందుకు మరో సీటు మాత్రమే ఉంటుంది. జీజీహెచ్ వద్ద సుమారు 35కి పైగా ప్రైవేటు అంబులెన్స్‌లు ఉండగా వాటిలో అనేకం అరిగిపోయిన టైర్లు, కాలం చెల్లిన ఇంజన్‌లతో నడుపుతున్నారు. కనీస ఫిట్‌నెస్ కూడా లేని వాహనాలను అంబులెన్స్‌లుగా మార్చేసి జోరుగా వ్యాపారం చేస్తున్నారు.
108 ఉండీ ఉపయోగం ఏదీ?
ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద రోగులను ఆసుపత్రికి తరలించడం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 108 వాహనాలు ఉండీ ఉయోగం లేకుండాపోతోంది. ఎక్కడైనా ప్రమాదం జరిగినా, వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా 108కి కాల్ చేస్తే రయ్.. రయ్ మంటూ వచ్చే వాహనాలు మొక్కుబడి సేవలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. గత వైసీపీ పాలన నుంచి ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రోగిని ఇంటి దగ్గర నుంచి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రికి తరలించి 108 సిబ్బంది చేతులు దులుపుకుంటున్నారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు, మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కచ్చితంగా ప్రైవేటు అంబులెన్స్ లను ఆశ్రయించక తప్పడం లేదు. అత్యవసర పరిస్థితిని ఆసరా చేసుకొని అంబులెన్స్‌ల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. జీజీహెచ్‌లో వైద్యం కోసం వస్తే ఎమర్జెన్సీ పేరుతో భారీగా దోచేస్తున్నారని బాధితులు బోరుమంటున్నారు.