Share News

కదం తొక్కిన విద్యుత్‌ ఉద్యోగులు

ABN , Publish Date - Sep 22 , 2025 | 11:58 PM

విద్యుత్‌ శాఖలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పాడి వారం రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలిపారు.

కదం తొక్కిన విద్యుత్‌ ఉద్యోగులు
ర్యాలీ నిర్వహిస్తున్న విద్యుత్‌ ఉద్యోగులు

చర్చి సెంటర్‌లో మానవహరం

దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌కు వినతిపత్రం

ఒంగోలుక్రైం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి) : విద్యుత్‌ శాఖలో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం విద్యుత్‌ ఉద్యోగులు, కార్మికులు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పాడి వారం రోజులుగా వివిధ రూపాలలో నిరసన తెలిపారు. అంతేకాకుండా విద్యుత్తు భవన్‌లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రిలేదీక్షలు చేపట్టారు. సోమవారం జిల్లాలో ఉన్న ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో విద్యుత్తు భవన్‌ నుంచి ర్యాలీగా ప్రకాశం భవన్‌ వరకు వచ్చి మానవహరంగా ఏర్పడారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ పి.రాజాబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్‌ హరిక్రిష్ణ మాట్లాడుతూ విద్యుత్తు శాఖలో ఏళ్ల తరబడి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని అందుకే ఉద్యమ బాట పట్టాల్సి వచ్చిందని చెప్పారు. కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్‌ చేయాలని, ఉద్యోగులందరికీ వైద్యసౌకర్యం కల్పించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయాలని డిమాండ్‌ చేశారు.

అలాగే ఒకే పనికి ఒకే వేతనం విధానం అమలుల చేయలని కోరారు. ఏపీసీపీడీసీఎల్‌ జేఏసీ చైర్మన్‌ రాచగర్ల సంజీవరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో ప్రభుత్వం దాటవేత ధోరణి అవలంబిస్తోందని విమర్శించారు. మరణించిన కార్మికుల కుటుంబాలలో రెగ్యులర్‌ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిస్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో తేళ్ల అంజయ్య, విద్యుత్తు జేఏసీ కన్వీనర్‌ బీ సురేష్‌, జిల్లా కన్వీనర్‌ కేవీ రవి, ఆనందరావు, తేళ్ల జాన్సన్‌, చంద్రశేఖర్‌, బాలజీ పాల్గొన్నారు.

Updated Date - Sep 22 , 2025 | 11:58 PM