Share News

గుండె.. గుబిల్లు

ABN , Publish Date - Nov 22 , 2025 | 01:45 AM

పురపాలక సంఘం పరిధిలోని 33వ వార్డు వడ్డే పుల్లయ్య యానాది కాలనీ వాసులు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.

గుండె.. గుబిల్లు

చీరాల, నవంబరు21 (ఆంధ్రజ్యోతి) : పురపాలక సంఘం పరిధిలోని 33వ వార్డు వడ్డే పుల్లయ్య యానాది కాలనీ వాసులు పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కాలనీలో సుమారు 50 కుటుంబాలు ఉన్నాయి. వారంతా ఇళ్లల్లో పాచి పనిచేసుకుని జీవించే యానాది కాలనీ వాసులు. రెక్కాడితేనే డొక్కాడని బడుగు బలహీనులు. ఈక్రమంలోనే వారికి ఇంట్లో ఒక లైటు, ఒక ఫ్యాను. కాలనీ అంతా కలుపుకుని మహా అయితే పది మందికి మాత్రమే టీవీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఎస్సీ, ఎస్టీలకు ఉచిత 200 యూనిట్లు కాలనీ వాసులకు అమలు కావడం లేదు. దాదాపుగా ప్రతీ ఇంటికి బిల్లు చెల్లింపులకు సంబంధించి డిమాండ్‌ నోటీసులు ప్రతినెలా అందుతున్నాయి. ఇదిలా ఉంటే ఒక్కో ఇంటికి రూ.400 నుండి రూ.1500 వరకు బిల్లులు వస్తుండటం శోచనీయం. అసలే పూట గడవడం కష్టం. అటువంటిది బిల్లులు వేలకు వేలు వస్తుండటంతో నిరుపేద కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. సమస్య పరిష్కారం కోసం సంబంధిత శాఖ అధికారులను కలిసిన పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా ఇటీవల విద్యుత్‌ సిబ్బంది చాలాచోట్ల కటింగ్‌లు విధించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల ఒక్కొక్కరు రెండేసి వేలు కూడా బిల్లులు చెల్లించారు. విషయం తెలుసుకున్న ఆ సంఘం రాష్ట్ర నాయకులు బచ్చు రమణయ్య స్థానికులతో కలిసి నిరసన చేపట్టారు. కాలనీ వాసుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ ఇస్తే సరిచేస్తాం

వారు ఎస్టీలు అయినప్పటికీ, వివిధ కారణాలతో ఇంకా కులధ్రువీకరణ పత్రాలు మాకు ఇవ్వలేదు. ఇస్తే 200 యూనిట్లలోపు కరెంటు బిల్లు లేకుండా చూస్తాం.

పట్టణ ఏఈ శంకర్‌

Updated Date - Nov 22 , 2025 | 01:45 AM