Share News

కొండపి పంచాయతీకే ఎన్నికలు

ABN , Publish Date - Jul 29 , 2025 | 01:25 AM

కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలో కొండపితోపాటు సంతనూతలపాడు మండలం మంగమూరు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశించడంతో తదనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.

కొండపి పంచాయతీకే ఎన్నికలు
కొండపి పంచాయతీ కార్యాలయం

షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్నికల కమిషన్‌

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ...10న పోలింగ్‌

మంగమూరు ఎన్నిక తాత్కాలికంగా నిలుపుదల

ఒంగోలు కలెక్టరేట్‌, జూలై 28 (ఆంధ్రజ్యోతి): కొండపి గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. జిల్లాలో కొండపితోపాటు సంతనూతలపాడు మండలం మంగమూరు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీ ఆదేశించడంతో తదనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే సోమవారం కొండపికి మాత్రమే నిర్వహణకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. మంగమూరు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండటంతో దానిపై తర్జన, భర్జనల అనంతరం తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు సమాచారం. హైకోర్టులో కేసు ఉన్నందున పూర్తిస్థాయిలో పరిశీలించిన అనంతరం మంగమూరు ఎన్నికల నిర్వహణపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా కొండపి ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఆ ప్రకారం బుధవారం నోటిఫికేషన్‌ ప్రకటిస్తారు. వచ్చేనెల 10న పోలింగ్‌ నిర్వహించి అదేరోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఎస్‌ఈసీ ఆదేశాలతో కొండపిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకటనాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అందుకు సంబంధించి సంబంధిత అధికారులకు సూచనలు ఇవ్వడంతోపాటు నామినేషన్ల అనంతరం బ్యాలెట్‌ పత్రాలు, బ్యాలెట్‌ బాక్సులు, ఇతర సామగ్రి సమకూర్చుకోవడం వంటి వాటిపై ఆశాఖ అధికారులు దృష్టిసారించారు.

Updated Date - Jul 29 , 2025 | 01:25 AM