Share News

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి

ABN , Publish Date - Nov 22 , 2025 | 02:38 AM

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రానికి మత్స్యసంపద కీలక ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో దాన్ని మరింత విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు.

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి
మత్స్యకారుల కుటుంబాలకు నమూనా చెక్కును అందజేస్తున్న మంత్రి స్వామి, ఎమ్మెల్యే జనార్దన్‌, కలెక్టర్‌ రాజాబాబు

ఆదాయం మరింత పెంపునకు చర్యలు

మంత్రి శ్రీబాలవీరాంజనేయస్వామి

ఒంగోలు కలెక్టరేట్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి) : మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయ స్వామి అన్నారు. రాష్ట్రానికి మత్స్యసంపద కీలక ఆదాయ వనరుగా ఉన్న నేపథ్యంలో దాన్ని మరింత విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు. మత్స్య సంపద ద్వారా ఆదాయ ఆర్జనలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్నదని చెప్పారు. దీన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆక్వా సాగుకు ఒక్కో యూనిట్‌ రూ.1.5 చొప్పున విద్యుత్‌ అందిస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ పి.రాజాబాబు మాట్లాడుతూ పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఆక్వాకు సంబంధించి మరింత అధ్యయనం కోసం కాలేజీలలో ప్రత్యేక కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెడుతున్నదని చెప్పారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ వేట నిషేధం, ఇతర విపత్తుల్లోనూ మత్స్యకారులకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చి అండగా నిలుస్తున్నదన్నారు. వేట నిషేధ సమయంలో రూ.20వేల ఆర్థిక సహాయం అందించడంతోపాటు తాజాగా వచ్చిన మొంథా తుఫాన్‌ సమయంలోనూ ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. జేసీ గోపాలకృష్ణ మాట్లాడుతూ జిల్లాలోని తీరప్రాంతం వెంట చేపట్టిన పర్యాటక, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకంలో ధరలను కూడా మత్స్యకారుల సమక్షంలోనే ఖరారు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అనంతరం ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు మత్స్యకార కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల విలువైన చెక్కులను మంత్రి అందజేశారు. పది మందికి లైఫ్‌ జాకెట్లు, ఐదుగురికి జీపీఎస్‌ సెట్లు, ఇద్దరికి పడవలు, ఇంజన్లు, వలలను ఇచ్చారు. కార్యక్రమంలో ఒంగోలు మేయర్‌ గంగాడ సుజాత, మత్స్యకార సంఘం అధ్యక్షుడు పేరయ్య, ఒంగోలు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అద్యక్షుడు ఆర్‌.వెంక ట్రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 02:39 AM