ఈ-పంట నమోదును పూర్తిచేయాలి
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:42 AM
జిల్లాలో ఈ-పంట నమోదును త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కలెక్టర్ సమావేశపు హాలులో బుధవారం వ్యవసాయశాఖ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం
సాంకేతిక సమస్యలను పరిష్కరించాలని డీఏవోకు సూచన
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ-పంట నమోదును త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ ఆదేశించారు. స్థానిక ప్రకాశం భవన్‌లోని కలెక్టర్ సమావేశపు హాలులో బుధవారం వ్యవసాయశాఖ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 15,68,517 భూకమతాలకుగాను 4,63,072 మాత్రమే (30శాతం) నమోదు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ నెలాఖరు నాటికి నూరుశాతం పూర్తిచేయాలన్నారు. ప్రతిరోజూ సమీక్ష చేసి అందుకు అనుగుణంగా లక్ష్యాలను అధికారులు నిర్దేశించాలన్నారు. సాంకేతిక సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే సవరించాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావుకు సూచించారు. జిల్లా సరాసరి కన్నా తక్కువగా నమోదు చేసిన వారిని అందుకు కారణాలను అడిగి తెలుసుకున్నారు. జియో పెన్షింగ్ 20మీటర్ల నుంచి 100 మీటర్లకు పెంచితే బీడు కమతాలను త్వరగా పూర్తి చేయవచ్చని ఆ శాఖ అధికారులు జేసీ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన జేసీ ఆ విషయాన్ని ఉన్నతాధికారుల తెలియజేస్తానని చెప్పారు. జిల్లాలో నల్లబర్లీ పొగాకు సాగును కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవా లన్నారు. సమావేశంలో డీపీఎం సుభాషిణి పాల్గొన్నారు.