Share News

శుభ్రపడుతున్న డంపింగ్‌ యార్డు

ABN , Publish Date - Oct 01 , 2025 | 02:07 AM

అద్దంకి కొండ వద్ద టిడ్కో ఇళ్ల సమీపంలోని డంపింగ్‌ యార్డు వైపు వెళ్ళాలంటే ఇటీవల వరకు ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి.

శుభ్రపడుతున్న డంపింగ్‌ యార్డు

అద్దంకి, సెప్టెంబర్‌30(ఆంధ్రజ్యోతి): అద్దంకి కొండ వద్ద టిడ్కో ఇళ్ల సమీపంలోని డంపింగ్‌ యార్డు వైపు వెళ్ళాలంటే ఇటీవల వరకు ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి. దీంతో టిడ్కో ఇళ్లు పూర్తయినా, అక్కడ నివాసం ఉండేందుకు లబ్ధిదారులు వెనుకడుగు వేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న నిర్ణయం తో డంపింగ్‌ యార్డు స్థానంలో పార్కు అందుబాటులోకి రానుంది. గత దశాబ ్దకాలంగా అద్దంకి పట్టణంలో సేకరించిన చెత్త మొత్తం అద్దంకి కొండకు తూర్పు వైపున సుమారు 4 ఎకరాలు డంపింగ్‌ యార్డుగా మార్చారు. డంపింగ్‌ యార్డులో ఉన్న సుమారు 58 వేల మెట్రిక్‌ టన్నుల చెత్తను చిలకలూరిపేట కు చెందిన తరుణి స్వచ్చంద సంస్థ స్ర్కీనింగ్‌ ద్వారా 4 రకాలుగా విభజిస్తోంది. స్కీనింగ్‌ ద్వారా వచ్చే ఘన వ్యర్థాలు, రాళ్లు, అద్దంకి పట్టణంలోని రేణింగవరం రోడ్డులో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సమీపంలోని గుంతను పూడ్చుతున్నారు. ఎరువును తరుణి స్వచ్చంధ సంస్థ రైతులకు అందజేయనుంది.. కాగితాలు, పాత దుస్తులను జిందాల్‌ సంస్థకు తరలిస్తున్నారు. మిగిలిన వ్యర్ధాలను కాల్చివేయను న్నారు. అక్టోబరు 2వ తేదీ నాటికి డంపింగ్‌ యార్డు వద్ద ఉన్న వ్యర్దాలు అత్యధిక శాతం తొలగించే విధంగా చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తొలగింపు చేపట్టిన తరువాత ఆ ప్రాంతాన్ని ఉద్యానవనంగా అభివృద్ది చేయనున్నారు. సాధారణంగా డంపింగ్‌ యార్డుగా వినియోగించిన ప్రాంతంలో 15 సంవత్సరాల పాటు ఎలాంటి కట్టడాలు నిర్మాణం చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ అద్దంకి కొండ వద్ద ఉన్న డంపింగ్‌ యార్డు ప్రాంతం కొండ ప్రాంతం కావడంతో నేల గట్టితనంగా ఉండే అవకాశం ఉంది. దీంతో కొద్ది సంవత్సరాల తరువాత మున్సిపల్‌ అవసరాలకు, ఇళ్ల స్థలాల కోసం వినియోగించే అవకాశం ఉంది. దీంతో సుమారు 4 ఎకరాల భూమి మున్సిపాలిటికి చెందనుంది. అయితే ప్రస్తుతం అద్దంకి పట్టణంలో ప్రతి రోజు 19 టన్నులు చెత్త సేకరణ జరుగుతుండగా 10 టన్నులు మాత్రం ప్రతిరోజు నేరుగా గుంటూరులోని జిందాల్‌కు తరలిస్తున్నారు. మిగిలిన 9 టన్నులలో 1.5 టన్ను వరకు ఎరువుగా మారుతుంది. మిగిలిన చెత్తను ఏవిధంగా వినియోగించాలన్న విషయంపై పై ఉన్నతస్థాయి అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. డంపింగ్‌ యార్డు శుభ్రం అవుతుండటంతో టిడ్కో ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయిన తరువాత లబ్దిదారులకు దుర్వాసన వచ్చే అవకాశం తప్పింది.

Updated Date - Oct 01 , 2025 | 02:07 AM