Share News

డీఎస్సీ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Sep 16 , 2025 | 02:38 AM

మెగా డీఎస్సీ అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించింది. దాన్ని డీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. జాబితాల్లో తమ పేర్లు చూసుకున్న అభ్యర్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

డీఎస్సీ ఫలితాలు విడుదల
వెబ్‌సైట్‌లో జాబితాలను పరిశీలిస్తున్న డీఈవో

ఎంపికైన అభ్యర్థుల అధికారిక ప్రకటన

వెబ్‌సైట్‌లో తుది జాబితాలు

డీఈవో కార్యాలయంలో హెల్ప్‌ డెస్క్‌

ఒంగోలు విద్య, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫలితాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను అధికారికంగా ప్రకటించింది. దాన్ని డీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచింది. జాబితాల్లో తమ పేర్లు చూసుకున్న అభ్యర్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి తల్లిదండ్రులు స్వీట్లు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. కాగా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారిలో కొందరి పేర్లు ఎంపిక జాబితాల్లో లేకపోవడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఒకరిద్దరు అభ్యర్థులు కంటతడిపెట్టుకున్నారు.

జిల్లాలో 661 మంది ఎంపిక

మెగా డీఎస్సీకి సంబంధించి జిల్లాలో 672 పోస్టులు ప్రకటించగా 661 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. అర్హులు లేకపోవడంతో 11 మిగిలిపోయాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మండల యాజమాన్యాల్లోని పాఠశాలల్లో 599 పోస్టులు ప్రకటించగా 593 భర్తీ అయ్యాయి. మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రకటించిన 30 పోస్టులకూ అభ్యర్థులను ఎంపిక చేశారు. గిరిజన సంక్షేమ, గురుకుల పాఠశాలలు, చెంచు పాఠశాలలకు ప్రకటించిన 43 పోస్టుల్లో ఐదు ఎస్సీ గ్రూపు-1కు కేటాయించడంతో అవి భర్తీ కాలేదు. వీటిని కూడా వచ్చే డీఎస్సీలో భర్తీ చేస్తారు.

అన్ని వివరాలతో ఎంపిక జాబితా

టీచర్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల అన్ని వివరాలను ఎంపిక జాబితాలో ప్రకటించారు. పాఠశాలల యాజమాన్యాలు, పోస్టు వారీ, అభ్యర్థి డీఎస్సీ ర్యాంకు వారీగా అన్ని వివరాలు ఆ జాబితాల్లో పేర్కొన్నారు. అభ్యర్థి ఎంపికైన పోస్టు బ్యాక్‌లాగ్‌ పోస్టా, ప్రస్తుత ఖాళీనా అన్న వివరాలు కూడా ఇచ్చారు. లోకల్‌/నాన్‌లోకల్‌ కోటా దేనిలో ఎంపికయ్యారో కూడా పేర్కొన్నారు. మెరిట్‌ కమ్‌ రోస్టర్‌ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపిక జాబితాలను కలెక్టర్‌ కార్యాలయంలోని నోటీసు బోర్డు, డీఈవో కార్యాలయం నోటీసు బోర్డులో ఉంచినట్లు డీఈవో కిరణ్‌కుమార్‌ తెలిపారు.

డీఈవో కార్యాలయంలో హెల్ప్‌డెస్క్‌

డీఎస్సీ ఫలితాలపై సోమవారం స్థానిక డీఈవో కార్యాలయంలో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. డీఎస్సీ ఎంపికలపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసేందుకు ఈ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు ఆర్‌జేడీ లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఎంపికైన వారికి ఏమైనా సందేహాలు ఉంటే ఈ డెస్క్‌ను సంప్రదించవచ్చని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 19న సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారు. ఈనెల 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు రెసిడెన్షియల్‌ విధానాల్లో శిక్షణ ఇస్తారు. ఈ సమయంలోనే పాఠశాలలు కేటాయించి నియామకపు ఉత్తర్వులు ఇస్తారని లింగేశ్వరరెడ్డి తెలిపారు.

ఎంపిక కాని అభ్యర్థుల్లో నిరాశ

మెగా డీఎస్సీలో ఉద్యోగం సాధిస్తామన్న దీమాతో ఉన్న అభ్యర్థుల పేర్లు ఎంపిక జాబితాలో లేకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. స్కూలు అసిస్టెంట్‌, బయోలాజికల్‌ సైన్స్‌ పోస్టుకు దరఖాస్తు చేసిన ఒక అభ్యర్థికి ఎస్సీ గ్రూపు-3, అంగవైకల్యం రిజర్వేషన్లు ఉన్నాయి. దివ్యాంగుల్లో ఓహెచ్‌ కేటగిరీలో జిల్లా ఫస్ట్‌ అతనే. అయితే మొదటి విడత సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుపు రాకపోవడంతో విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచారు. డీఎస్సీలో 76వ ర్యాంకు సాధించారు. మొత్తం 72 పోస్టులు ప్రకటించగా ఆయనకు 76వ ర్యాంకు రావడంతో ఉద్యోగం వస్తుందని ధీమా వచ్చింది. తీరా తుది జాబితాలో పేరు లేదు. దీంతో ఆ అభ్యర్థి ఒంగోలు వచ్చి డీఈవోను, హెల్ప్‌ డెస్క్‌లో కలిశారు. గత డీఎస్సీలో కేవలం అర మార్కు తేడాతో ఉద్యోగం కోల్పోయాడు. డీఎస్సీకి హాజరుకావడానికి తనకు ఇదే చివరి అవకాశం అంటూ ఆ అభ్యర్థి కన్నీరుపెట్టుకున్నాడు. ఎంపికలో తనకు అన్యాయం జరిగిందంటూ డీఈవోకు, గ్రీవెన్స్‌లో అర్జీలు ఇచ్చారు. పాఠశాల విద్య డైరెక్టర్‌ను కలిసి తన గోడును చెప్పుకునేందుకు అమరావతి వెళ్లారు. అలాగే సోషల్‌ స్టడీస్‌ అభ్యర్థి ఒకరు, మరికొందరు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన ఎంపిక కాని వారు హెల్ప్‌డెస్క్‌కు ఫోన్లు చేస్తున్నారు.

Updated Date - Sep 16 , 2025 | 02:38 AM