డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:38 AM
డీఎస్సీ-25 అభ్యర్థుల మెరిట్ జాబితాను శుక్రవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రాతపరీక్షల్లో వచ్చిన మార్కులు, టెట్ మార్కులు కలిపి ర్యాంకులు ప్రకటించారు.
20,493 మందికి ర్యాంకుల ప్రకటన
మహిళలదే పైచేయి
ఒంగోలు విద్య, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : డీఎస్సీ-25 అభ్యర్థుల మెరిట్ జాబితాను శుక్రవారం రాత్రి పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు రాతపరీక్షల్లో వచ్చిన మార్కులు, టెట్ మార్కులు కలిపి ర్యాంకులు ప్రకటించారు. మెరిట్ జాబితాను రాష్ట్ర, జోనల్, జిల్లాస్థాయి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. జిల్లాస్థాయిలో డీఈవో వెబ్‌సైట్‌లో కూడా మెరిట్ జాబితాలను ఉంచారు. అభ్యర్థుల మొబైల్‌కు వారు సాధించిన మార్కులు, ర్యాంకుల వివరాలను మెసేజ్ చేశారు. సర్టిఫికెట్ల పరిశీలనకు ఎంపికైన వారి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అభ్యర్థులు తమ లాగిన్ ద్వారా కాల్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకొని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలి. అయితే పరిశీలన ఎప్పుడు నిర్వహించేది పాఠశాల విద్యాశాఖ ఇంకా ప్రకటించలేదు. ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని డీఈవోలను పాఠశాల విద్య డైరెక్టర్ ఆదేశించారు. మెరిట్ జాబితాలో పురుషుల కంటే మహిళలే ముందంజలో ఉన్నారు.
672 పోస్టులకు 20,493 మంది
జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 672 పోస్టులకు డీఎస్సీ ప్రకటించారు. ఈ పోస్టులకు సంబంధించి 20,493 మంది అభ్యర్థుల మార్కులు, ర్యాంకులు ప్రకటించారు. 132 ఎస్‌జీటీ పోస్టులకు 9,074 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా వీరిలో 94.06 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. కేవలం 19.24 మార్కులు సాధించిన అభ్యర్థి చివరి స్థానంలో నిలిచారు.
స్కూలు అసిస్టెంట్ తెలుగు 41 పోస్టులకు 863 మంది పరీక్ష రాయగా 84.82మార్కులతో ప్రథమ స్థానం, 23.0మార్కులతో చివరిస్థానం పొందారు.
స్కూలు అసిస్టెంట్ హిందీ 27 పోస్టులకు 433 మంది పోటీపడగా 82.17 మార్కులతో ప్రథమ స్థానంలో, 26.50 మార్కులతో చివరి స్థానంలో నిలిచారు.
స్కూలు అసిస్టెంట్ ఇంగ్లీషు 99 పోస్టులకు 842 మంది పరీక్షలు రాయగా గరిష్ఠంగా 91.32శాతం, కనిష్టంగా 26.28 మార్కులు సాధించారు.
స్కూలు అసిస్టెంట్ గణితం 95 పోస్టులకు 2,794 మంది పరీక్షకు హాజరుకాగా వీరిలో అత్యధికంగా 93.01 మార్కులు, అత్యల్పంగా 21.59 మార్కులు సాధించారు.
స్కూలు అసిస్టెంట్ పీఎస్ 26 పోస్టులకు 753 మంది పరీక్షకు హాజరు కాగా వీరిలో అత్యధికంగా 84.27 మార్కులు, అత్యల్పంగా 28.90 మార్కులు సాధించారు
స్కూలు అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ 72 పోస్టులకు 1,899 మంది పరీక్షకు హాజరుకాగా గరిష్ఠంగా 86.23 మార్కులు కనిష్ఠంగా 14.13 మార్కులు సాధించారు.
- స్కూలు అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులు 108 పోస్టులకు 2,689 మంది పరీక్ష రాయగా అత్యధికంగా 85.13 మార్కులు, అత్యల్పంగా 22.74 మార్కులు సాధించారు.
- స్కూలు అసిస్టెంట్ వ్యాయామ విద్య 72 పోస్టులకు 1,195 మంది పరీక్ష రాయగా గరిష్ఠంగా 88.5 మార్కులు, కనిష్ఠంగా కేవలం 4.5 మార్కులు మాత్రమే సాధించారు.
మెగా డీఎస్సీ టాపర్లు
పోస్టుపేరు అభ్యర్థిపేరు మార్కులు
ఎస్‌ఏ తెలుగు పుచ్చనూతల మనోహర్ (ఓసీ) 84.82
ఎస్‌ఏ హిందీ చలువాది వి.నాగరాజు (ఓసీ) 82.17
ఎస్‌ఏ ఇంగ్లీషు పిగిలి కవిత (బీసీడీ) 91.32
ఎస్‌ఏ గణితం జంధ్యాల అంజని (ఓసీ) 93.01
ఎస్‌ఏ పీఎస్ ఎం.వెంకటకృష్ణారెడ్డి (ఓసీ) 84.27
ఎస్‌ఏ బీఎస్ ఈ.సుకేష్‌కుమార్ (బీసీబీ) 86.73
ఎస్‌ఏ ఎస్‌ఎస్ రావూరి వెంకటహర్షిత (ఓసీ) 85.13
ఎస్‌ఏ వ్యాయామవిద్య పిల్లి వెంకటనారాయణ (ఎస్సీ-3) 88.5
ఎస్‌ఏ ఉర్దూ షేక్ యాసీన్‌సాహెబ్ (బీసీఈ) 77.33
ఎస్‌జీటీ తెలుగు గాలి లావణ్య (బీసీబీ) 94.06
ఎస్‌జీటీ ఉర్దూ షేక్ అర్షియాతబ ఉసుమ్ (బీసీఈ) 69.43
పరిశీలకులుగా తహెరా సుల్తానా
మెగా డీఎస్సీ జిల్లా పరిశీలకులుగా పాఠశాల విద్య జాయిం ట్ డైరెక్టర్ తహెరా సుల్తానా నియమితులయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రమైన ఒంగోలు సమీపం చెరువుకొమ్ముపాలెంలోని శ్రీ సరస్వతి జూనియర్ కళాశాలలో శనివారం పరిశీలనకు నియమించిన 18 టీంలకు శిక్షణ ఇచ్చారు. 14 టీంలు జిల్లా స్థాయి పోస్టులకు, మిగిలిన నాలుగు టీంలు జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టుల అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తాయి. శనివారం జరిగిన శిక్షణ కార్యక్రమంలో సుల్తానా కూడా మాట్లాడారు. సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధించిన పలు అంశాలను ఆమె వివరించారు.