Share News

బిందు సేద్యం.. దిగుబడులు అధికం

ABN , Publish Date - Jun 15 , 2025 | 10:20 PM

తక్కువ సమయంలో మొక్కలకు ఎక్కువ సార్లు నీటిని అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు బిందు సేద్యం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పద్ధతి వల్ల నీటిని ఆదా చేయడంతో పాటు అధిక ప్రయోజనాలు పొందవచ్చు.

బిందు సేద్యం.. దిగుబడులు అధికం
డ్రిప్‌ పద్ధతిలో సాగులో ఉన్న పైరు

నీటి ఆదా, శ్రమ, ఖర్చు తక్కువ

పెద్ద దోర్నాల, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి) : తక్కువ సమయంలో మొక్కలకు ఎక్కువ సార్లు నీటిని అందించడం ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు బిందు సేద్యం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ పద్ధతి వల్ల నీటిని ఆదా చేయడంతో పాటు అధిక ప్రయోజనాలు పొందవచ్చు. బిందు సేద్యం అవలంభిస్తున్న రైతులు తక్కువ ఖర్చుతో పాటు మేలైన దిగబడులు సాధిస్తున్నారని పలు పరిశోధనలు నిరూపించాయి.రైతులు ఇప్పటివరకు ఉద్యాన పంటల్లో ఎక్కువగా డ్రిప్‌ను వినియోగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఆరుతడి పైర్లకు బిందు సేద్యం అవలంబించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభు త్వం డ్రిప్‌కు రాయితీ కూడా కల్పిస్తోంది. మోటారు పంపుసెట్ల నుంచి వచ్చే నీటిని నేరుగాగొట్టాల్లోకి పంపించి యిన్న చిన్న పైపుల ద్వారా ప్రతి మొక్క కూ నీరు పడేటట్టు అమర్చాలి. ఈ డ్రిప్పర్ల ద్వారా గంటకు 2 నుంచి 8 లీటర్ల వరకు మొక్కకు నీరు అందుతుంది. ఈ పద్ధతిలో ఎక్కువగా నేలపై అమ ర్చే విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లలో నీటి మట్టం తగ్గి పోగాకొన్ని బోర్లలో కొద్దిపాటి నీరు వస్తోంది. ఈ నీటిని పైర్లకు అందించేందుకు డ్రిప్‌ పతద్ధతి ఎంతో మేలు. పత్తి, మిరప, జొన్న, కూరగాయలు, పూలు, మల్బరీ, చెరకు తదితర పంటలకు సన్నని పైపుల ద్వారానే పంటల అవసరాన్ని బట్టి నాటుకునే విధానాన్ని బట్టి 30 నుంచి 75సెంటీ మీటర్ల దూరంలో రంధ్రాలు ఉండి నీటి చుక్కలు పడుతుంటాయి. నేల ఎత్తు పల్లాలు ఉన్నా మొక్క దగ్గర నీటి చుక్క పడే విధంగా డ్రిప్‌ను ఏర్పాటు చేస్తారు.

డ్రిప్‌ వినియోగంతో లాభాలు

డ్రిప్‌ పద్ధతిలో సాగు చేసే పంటలకు ప్రత్యేకంగా నీటి తడులు ఇవ్వాలసిన అవసరం ఉండదు. నీరు ఎక్కువ, తక్కువ కాకుండా డ్రిప్పర్‌ దగ్గర నీటి చుక్కలు సమానంగా పడతాయి.నేలకు అవసరమయ్యే తేమ అందుతుంది. కొలత ప్రకారం నీరు అందించవచ్చు. వినియోగించిన ప్రతి లీటరు నీటికి ఎక్కువ ఫల సాయం లభిస్తుంది. మామూలుగా ఎకరం సాగు చేసే నీటితో డ్రిప్‌ పద్ధతి ద్వారా రెండున్నర ఎకరాలు సాగు చేయవచ్చు. కలుపు మొక్కలను అదుపు చేయవచ్చు. విద్యుత్‌ కూడా ఆదా అవుతుంది. రసాయనిక ఎరువులు డ్రిప్‌ ద్వారానే ద్రవ రూపంలో అందించే అవకాశం ఉంది. తద్వారా ఎరువు ఖర్చు తగ్గుతుంది. కూలీల శ్రమ ఆదా అవుతుంది. సాధారణంగా 100కిలోల ఎరువు అవసరమైతే డ్రిప్‌ ద్వారా 50కిలోలు ఎరువు సరిపోతుంది.

ప్రభుత్వ ప్రోత్సాహం

రైతులు బిందు సేద్యం చేసేందుకు ప్రభుత్వం రాయితీని ప్రకటించింది. గత టీడీపీ హయాంలో ఈ పథకం అమలులో ఉండగా, వైసీపీ దానిని రద్దు చేసింది. మళ్లీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డ్రిప్‌కు రాయితీని మంజూరు చేసింది. సన్న చిన్న కారు రైతులకు 90శాతం, 5ఎకరాలకు పైగా ఉన్న రైతులకు 70 శాతం రాయితీని ప్రకటించింది.

మెళకువలు పాటించాలి

డ్రిప్‌ పద్ధతి అవలంబించే రైతులు కొద్ది పాటి మెళకువలు తెలుసుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. కాలువలు, చెరువుల నుంచి వచ్చే నీటిలో సన్నని మట్టి, ఇసుక రేణువులు ఎక్కువగా ఉంటా యి. కొన్ని ప్రాంతాల్లో నీటిలో లవణాలు అధికంగా ఉంటాయి. ఇవన్నీ డ్రిప్‌ పరికరాల్లో పేరుకుపోయి నీటి సరఫరాకు అవరోధం కల్గిస్తాయి. అందువల్ల ఫిల్టర్లను రైతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లోని రైతులకు డ్రిప్‌ చాలా ఉపయోగపడుతుంది.

Updated Date - Jun 15 , 2025 | 10:20 PM