తాగునీటికి తొలివిడత ప్రాధాన్యత ఇవ్వాలి
ABN , Publish Date - Sep 22 , 2025 | 11:57 PM
జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
కలెక్టర్ రాజాబాబు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో తాగునీటి కోసం ప్రజలు ఎవరూ ఇబ్బందులు పడకుండా తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. ఆ దిశగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణతో కలిసి ఆర్‌డబ్ల్యూఎస్, జలవనరుల శాఖ, డ్వామా, పంచాయతీ, జిల్లాపరిషత్, ఇరిగేషన్, విద్యుత్‌శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం కలెక్టర్ చాంబర్‌లో సమీక్షించారు. జిల్లాలో తాగునీటి వనరులు, ప్రజలకు తాగునీరు సరఫరా చేస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. పైపులైన్లు, ట్యాంకర్ల ద్వారా అందిస్తున్న వివరాలను ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ బాలశంకరరావు కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా తాగునీటి ట్యాంకర్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. భూగర్భ నీటి మట్టం, వాటిని పెంచేందుకు చేపట్టిన చర్యలను ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వందనం వివరించారు. ఆయాశాఖల ద్వారా నీటి సంరక్షణ కోసం చర్యలను వివరించారు. ఆయా అంశాలపై స్పందిస్తూ కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాలని చెప్పారు. ట్యాంకర్ల సరఫరాలో ఎస్సీ, ఎస్టీకాలనీల పట్లపక్షపాతం ఉండకూడదన్నారు. బోర్లు వేసే విషయంలో భూగర్భ నీటి వనరుల శాఖ గుర్తించిన జియో కో ఆర్డినేట్లతో సమన్వయం చేసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశిచారు. మంచినీటి పథకాల రిపేర్లు, ఇతర ఖర్చులకు నిధులు మంజూరు చేయిస్తానని కలెక్టర్ తెలిపారు. చెరువుల్లో పూడికతీతపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వివిధ అంశాలకు సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన కాకుండా శాశ్వత ప్రాతిపదికన 24 గంటలు పనిచేసేలా కలెక్టరేట్‌లో కంట్రోలు రూం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో చిన ఒబులేషు, వివిధ శాఖల అధికారులు వరలక్ష్మీ, కట్టా వెంకటేశ్వర్లు, ఎం. వెంకటేశ్వరరావు, చిరంజీవి ఉన్నారు.