అర్ధరాత్రి వరకూ తాగుడే!
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:16 AM
ఎక్సైజ్ నూతన విధానం (2025-28)లో జిల్లాలో 29 బార్ల ఏర్పాటుకు నోటిఫికే షన్‌ను విడుదల చేశారు. వీటిలో మూడు గీత కార్మికులకు కేటాయించారు. ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు నిర్వహించుకోవచ్చు. స్థానిక జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్(డీసీ) హేమంత్ నాగరాజు, ఈఎస్ ఆయేషాబేగం సోమవారం నూతన బార్లకు నోటిఫికేషన్‌నను విడుదల చేశారు.
జిల్లాలో 29 బార్లకు నోటిఫికేషన్
28న ఒంగోలులో లాటరీ ప్రక్రియ
గీత కార్మికులకు మూడు కేటాయింపు
ఒంగోలు క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి) : ఎక్సైజ్ నూతన విధానం (2025-28)లో జిల్లాలో 29 బార్ల ఏర్పాటుకు నోటిఫికే షన్‌ను విడుదల చేశారు. వీటిలో మూడు గీత కార్మికులకు కేటాయించారు. ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు నిర్వహించుకోవచ్చు. స్థానిక జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్(డీసీ) హేమంత్ నాగరాజు, ఈఎస్ ఆయేషాబేగం సోమవారం నూతన బార్లకు నోటిఫికేషన్‌నను విడుదల చేశారు. అనంతరం వివరాలను వెల్లడించారు. మొత్తం జిల్లాలో 29 బార్లు ఉండగా వీటిలో 3 గీత కార్మికులకు కేటాయించినట్లు తెలిపారు. మిగిలిన 26లో ఒంగోలుకు 16, మార్కాపురానికి 5 కేటాయించామన్నారు. వీటికి ఒక్కోదానికి రూ.55లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించినట్లు చెప్పారు. పొదిలి, కనిగిరి, దర్శి, చీమకుర్తి, గిద్దలూరుకు ఒక్కో బార్‌ను కేటాయించామన్నారు. ఆ ప్రాంతాల్లో రూ.35 లక్షల లైసైన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈనెల 18 నుంచి 26 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు. 28న ఒంగోలు అంబేడ్కర్ భవన్‌లో కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన బార్లను కేటాయిస్తామన్నారు. అప్లికేషన్ దర రూ.5లక్షలుగా నిర్ణయించారని ఆ ఫీజు తిరిగి ఇవ్వరన్నారు. ప్రాసెసింగ్ ఫీజు రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒక్కో బార్‌కు తప్పనిసరిగా 4 దరఖాస్తులు వస్తేనే లాటరీ తీస్తామన్నారు.
గీత కార్మికులకు సగం ధరకే బార్
గీత కార్మికులకు లైసైన్స్ ఫీజులో 50శాతం రాయితీ ఇస్తారని డీసీ, ఈఎస్ తెలిపారు. వారికి మూడు బార్‌లు కేటాయించినట్లు వెల్లడించారు. ఒంగోలులో ఒక బార్ గౌడ్‌కు, మార్కాపురంలో ఒకటి గౌడా, మరొక బార్ గౌండ్లకు కేటాయించారు. వీరు ఈనెల 20 నుంచి 29 వరకు జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రీడ్ మోడ్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వీరికి కేటాయించే బార్‌లకు లైసైన్స్ ఫీజు రూ.27.50 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈనెల 30న దరఖాస్తులు పరిశీలించి లాటరీ తీసి కేటాయిస్తామని చెప్పారు.