Share News

విద్యార్థుల ఆరోగ్య సమస్యలను తేలికగా తీసుకోవద్దు

ABN , Publish Date - Aug 21 , 2025 | 11:27 PM

జిల్లాలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాలయాలు, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, వసతితో పాటు ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు.

విద్యార్థుల ఆరోగ్య సమస్యలను తేలికగా తీసుకోవద్దు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అన్సారియా

సంక్షేమ హాస్టళ్లలో వసతులు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలి

అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యాలయాలు, వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం, వసతితో పాటు ఆరోగ్యంపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం వివిధ సంక్షేమశాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రెసిడెన్షియల్‌ విద్యాలయాలతో పాటు వసతిగృహాల్లో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, ఖాళీలు, మౌలిక సదుపాయాలు, స్వంత, అద్దెభవనాలు, వాటిని ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్న తీరు తదితర అంశాలపై కలెక్టర్‌ సంబంధిత అధికారులతో చర్చించి దిశా నిర్దేశం చేశారు. ఆయా వసతిగృహాలను నియోజకవర్గాల స్పెషలాఫీసర్లకు ట్యాగ్‌ చేస్తే వారు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారన్నారు. ఆరోగ్య సమస్యలను విద్యార్థులు ప్రస్తావించినప్పుడు తేలికగా తీసుకోకుండా నిబంధనల ప్రకారం వారికి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహాల స్థాయిలోనే పరిష్కారం అయ్యే సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోనేది లేదని హెచ్చరించారు. వసతిగృహాల్లో పారిశుధ్యం, ప్లాంటేషన్‌, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపజేసేలా నిర్మాణలపై దృష్టి సారించాలన్నారు. ఈ విషయంలో సంబంధిత ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకోవాలన్నారు. పదో తరగతి విద్యార్థులకు ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్లు త్వరగా వచ్చేలా చూస్తానని చెప్పారు. లెక్కలు, సైన్స్‌ పాఠ్యాంశాలను బోధించేందుకు టూటర్లను కూడా పూర్తిస్తాయిలో ఏర్పాటు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో సంక్షేమశాఖల అధికారులు లక్ష్మానాయక్‌, నిర్మలజ్యోతి, వరలక్ష్మీ, సువార్త, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి జయ, కేజీబీవీ జీసీడీవో హేమలత పాల్గొన్నారు.

Updated Date - Aug 21 , 2025 | 11:27 PM