Share News

కదలరే..

ABN , Publish Date - Dec 09 , 2025 | 02:20 AM

మార్కాపురం పట్టణంలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల అండతో అక్రమార్కులు చెలరేగిపోయారు. అప్పట్లో అధికారులు అటువైపు చూడాలంటే వణికిపోయారు. దీంతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనధికారికంగా అంతస్తుల మీద అంతస్తులు నిర్మించారు.

కదలరే..
మార్కాపురం మెయిన్‌ బజార్‌లో ఎలాంటి కనీస అనుమతులు లేకుండా నిర్మించిన వాణిజ్య సముదాయం, మార్కాపురం ఎన్‌ఎ్‌స నగర్‌ సమీపంలో సాధారణ భవన అనుమతులు తీసుకుని అపార్ట్‌మెంట్‌ నిర్మిస్తున్న వైసీపీ నాయకుడు

బీపీఎస్‌కు కొరవడిన స్పందన

మార్కాపురంలో అక్రమ నిర్మాణాలు ఫుల్‌

నేటికి వచ్చింది ఆరు దరఖాస్తులే

అనుమతిలేని కట్టడాలపై చర్యలు శూన్యం

మామూళ్ల మత్తులో జోగుతున్న పట్టణ ప్రణాళిక విభాగం

మార్కాపురం పట్టణంలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నేతల అండతో అక్రమార్కులు చెలరేగిపోయారు. అప్పట్లో అధికారులు అటువైపు చూడాలంటే వణికిపోయారు. దీంతో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా అనధికారికంగా అంతస్తుల మీద అంతస్తులు నిర్మించారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం మళ్లీ బీపీఎస్‌ స్కీంను ప్రారంభించింది. అనధికారిక కట్టడాలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. అయినా కూడా ఆయా భవన యజమానులు స్పందించడం లేదు. భారీగా పెనాల్టీలు కట్టాల్సి వస్తుందనే భయంతోనే వారు కదలడం లేదని సమాచారం.

మార్కాపురం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం పట్టణంలో అక్రమ కట్టడాలు, ప్లాన్‌ తీసుకున్నా అందుకనుగుణంగా కాకుండా ఇష్టారీతిన నిర్మాణాలు చేయడం ఆనవాయితీగా మారింది. ఎలాంటి నిర్మాణం చేయలన్నా ముందుగా నిబంధనల మేరకు ప్లాన్‌ తయారు చేసుకుని పట్టణ ప్రణాళిక విభాగం అనుమతి తీసుకోవాలి. కానీ మార్కాపురంలో మాత్రం చాలా వరకు ముందస్తు అనుమతులు తీసుకోకుండానే అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారు. ఎవరైనా సిబ్బంది వస్తే అధికారాన్ని చూపి భయపెట్టడం, చేతులు తడిపి పంపించడం ఆనవాయితీగా మారింది. అక్రమంగా నిర్మించుకున్న భవనాలు, నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం ఈ మధ్యనే అవకాశం ఇచ్చింది. గత నెల 12 నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 120 రోజులపాటు దరఖాస్తులకు అవకాశం కల్పించింది. కానీ మార్కాపురంలో 25 రోజులు కావస్తున్నా కేవలం 6 దరఖాస్తులే రావడం గమనార్హం. పట్టణ పరిధిలో వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు ఉన్నప్పటికీ స్పందన అంతంతమాత్రంగానే ఉంది. మున్సిపల్‌ అధికారులు కేవలం నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంతోనే అక్రమ నిర్మాణదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగం గుర్తించింది 644 నిర్మాణాలు

మార్కాపురం పట్టణ పరిధిలోని 20 సచివాలయాల పరిధిలో టౌన్‌ ప్లానింగ్‌ సెక్రటరీలు ఉన్నారు. వారు గుర్తించిన మేరకు నవంబరు చివరి నాటికి పట్టణంలో మొత్తం 644 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. వాటిల్లో కనీస అనుమతుల్లేకుండా నిర్మించినవి 216, ప్లాన్‌ తీసుకున్నా అందుకు విరుద్ధంగా ఇష్టారీతిన నిర్మాణాలు చేసినవి 428 ఉన్నట్లు తేల్చారు. అక్రమ నిర్మాణాలన్నింటికీ కేవలం నోటీసులు ఇచ్చి మమ అనిపించారు. వాస్తవానికి టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది గుర్తించిన వాటికంటే కూడా ఇంకా ఎక్కువగానే అక్రమ నిర్మాణాలు పట్టణ పరిధిలో ఉన్నాయి. రాజకీయ అండదండలు ఉన్నవారివి, పెద్దమొత్తంలో చేతులు తడిపిన వారివి చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. గతేడాది ప్రధాన రహదారుల్లో ఆక్రమణల తొలగింపు సమయంలో కొన్ని వాణిజ్య సముదాయాలు, భవనాలకు నోటీసులిచ్చి కొంతమేర కూల్చివేశారు. అప్పట్లో పట్టణ అభివృద్ధి కోసం అధికారులపై స్థానిక ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఒత్తిడి చేయడంతో కొంతమేర అక్రమ నిర్మాణాలను నిలువరించగలిచారు. తర్వాత షరామామూలుగానే నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు సాగుతున్నాయి.

బీపీఎస్‌ వచ్చినా స్పందన శూన్యం

అక్రమంగా నిర్మించుకున్న భవనాలను క్రమబద్ధీకరించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో జీవో నంబర్‌ 225 ద్వారా బీపీఎస్‌ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చింది. అనధికారికంగా నిర్మించిన భవనాలు, అనుమతికి మించి నిర్మించుకున్నవి, సెట్‌బ్యాక్‌ డీవియేషన్‌ ఉన్న వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి ఈ అవకాశం కల్పించింది. 120 రోజులపాటు ఈ పథకం అమల్లో ఉండనుంది. ప్రభుత్వం ఇంతమంచి అవకాశం కల్పించినా అక్రమ నిర్మాణదారులు స్పందించడంలేదు. జీవో వచ్చి 25 రోజులు కావస్తున్నా నేటికీ మార్కాపురంలో 6 దరఖాస్తులు మాత్రమే వచ్చినట్లు టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చెబుతున్నారు. యంత్రాంగం గుర్తించినవే 644 నిర్మాణాలు ఉంటే దరఖాస్తు చేసుకోవడానికి కనీస స్పందన ఉండటంలేదని అర్థమవుతోంది.

Updated Date - Dec 09 , 2025 | 02:20 AM