Share News

ఎంపీ ఎవరో తెలియదా?

ABN , Publish Date - Nov 12 , 2025 | 01:22 AM

కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో కీలక ప్రజాప్రతినిధులు ఎవరన్నది అధికారులకు అవగాహన ఉండాలి. లేకపోతే తెలుసుకోవాలి. ప్రొటోకాల్‌ పాటిస్తూ శిలాఫలకాలపై వారి పేర్లను క్రమపద్ధతిలో ఉంచాలి. అయితే మద్దిపాడు మండలం గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ వద్ద మంగళవారం జరిగిన ఎంఎస్‌ఎంఈ పార్కు శంకుస్థాపన శిలాఫలకం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది.

ఎంపీ ఎవరో తెలియదా?

శిలాఫలకంపై బాపట్ల బదులు ఒంగోలు ఎంపీ పేరు

గ్రోత్‌ సెంటర్‌లో పరిశ్రమల శాఖ అధికారుల నిర్వాకం

వర్చువల్‌గా సీఎం శంకుస్థాపన

పాల్గొన్న ఎమ్మెల్యే బీఎన్‌

ఒంగోలు, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): కార్యక్రమం నిర్వహించే ప్రాంతంలో కీలక ప్రజాప్రతినిధులు ఎవరన్నది అధికారులకు అవగాహన ఉండాలి. లేకపోతే తెలుసుకోవాలి. ప్రొటోకాల్‌ పాటిస్తూ శిలాఫలకాలపై వారి పేర్లను క్రమపద్ధతిలో ఉంచాలి. అయితే మద్దిపాడు మండలం గుళ్లాపల్లి గ్రోత్‌సెంటర్‌ వద్ద మంగళవారం జరిగిన ఎంఎస్‌ఎంఈ పార్కు శంకుస్థాపన శిలాఫలకం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. సంతనూతలపాడు నియోజకవర్గం బాపట్ల పార్లమెంట్‌ స్థానం పరిధిలోనిది కాగా, అక్కడి ఎమ్మెల్యే బీఎన్‌.విజయకుమార్‌ను ఆహ్వానించిన పరిశ్రమల శాఖ, ఏపీఐఐసీ అధికారులు ఎంపీ పేరు వద్ద మాత్రం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరును ఏర్పాటు చేశారు. పీసీపల్లి మండలం లింగన్నపాలెం నుంచి వర్చువల్‌గా రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ పార్కులను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయగా అందులో ఇది కూడా ఉంది. దీంతో సదరు శిలాఫలకంపై ముఖ్యమంత్రి నుంచి గ్రామ సర్పంచ్‌ వరకు, అలాగే వివిధ స్థాయిల్లోని ఆ శాఖ అధికారుల పేర్లు వేశారు. అన్నీ సజావుగానే ఉన్నప్పటికీ కీలకమైన ఎంపీ పేరు తప్పుగా వేశారు. ఆ ప్రాంతం బాపట్ల పార్లమెంట్‌ పరిధిలో కావడంతో అక్కడి ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్‌ పేరును శిలాఫలకంపై ఉండాలి. అయితే అధికారులు మాత్రం ఒంగోలు ఎంపీ మాగుంట పేరును వేశారు. ఆ ప్రాంతం ఏ పార్లమెంట్‌ పరిధిలో అన్నది అధికారులకు అవగాహన లేదా, అక్కడి ఎంపీ ఎవరన్నది తెలియదా, లేక నిర్లక్ష్యమా అన్నది అధికారులే చెప్పాల్సి ఉంది.

Updated Date - Nov 12 , 2025 | 01:22 AM