సీజనల్ వ్యాధులపై భయపడొద్దు
ABN , Publish Date - Sep 10 , 2025 | 10:41 PM
సీజనల్ వ్యాధులైన విషజ్వరాలు, చికున్‌గున్యా వ్యాధులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాధులు సోకిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తాం
కలెక్టర్ తమీమ్ అన్సారియా
ముండ్లమూరు, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : సీజనల్ వ్యాధులైన విషజ్వరాలు, చికున్‌గున్యా వ్యాధులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వ్యాధులు సోకిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని కలెక్టర్ తమీమ్ అన్సారియా చెప్పారు. ఆమె బుధవారం ముండ్లమూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఓపీల రిజిస్టర్‌ను పరిశీలించారు. రోజూ ఎంత మంది జ్వరం, ఇతర వ్యాధులతో ఆస్పత్రులకు వస్తున్నారు?వారికి ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారని వైద్యాధికారులు ఎం జాస్మిన్, వెంకటేశ్వరరెడ్డిలను అడిగి తెలుసుకున్నారు. ఈనెల 8, 9, 10 తేదీల నుంచి ఎంత మంది రోగులు ఆస్పత్రికి వచ్చింది, వారికి ఎలాంటి పరీక్షలు నిర్వహించారు?, మందులు అందజేసిన విషయంపై ఆరాతీశారు. జ్వరపీడితులకు చేస్తున్న రక్త పరీక్షలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 172 రకాల మందులు అందుబాటులో ఉన్నాయని, 64 రకాల టెస్ట్‌లు చేస్తున్నారని చెప్పారు. జ్వరం సోకిన బాధితులు అనవసరంగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి సేవలు అందిస్తున్నారని చెప్పారు. అనంతరం మందుల స్టాక్ రూమ్‌ను పరిశీలించి కంప్యూటర్‌లో పీహెచ్‌సీ పరిధిలో ఉన్న మందుల వివరాలు చూశారు. ఫార్మాలజిస్టు యుగంధర్‌ను కలెక్టర్ ప్రశ్నించారు. గుండె, కుక్క కాటు లాంటి మందులు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రామాల్లో జ్వరాలు అదుపులోకి వచ్చేంత వరకు వైద్య శిబిరాలు కొనసాగించాలన్నారు. ప్రధానంగా కాచి చల్లార్చిన నీటినే తాగే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. వీధుల్లో ఫాగింగ్, కాలువల్లో ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ పౌడర్, ఎబేట్ పిచికారీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ముందుగా సింగనపాలెంలో ఇంకుడు గుంతలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీవో అబ్దుల్ రహీం, ఏపీవో టీ వెంకటరావు, సొసైటీ అధ్యక్షుడు కోయి శివరామకృష్ణ, ఈసీ శివరామకృష్ణ, డీసీ చైర్మన్ కంచుమాటి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ ఎం నరసింహారావు, మండల టీడీపీ అధ్యక్షుడు కూరపాటి శ్రీనివాసరావు, మాజీ పీడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ కందిమళ్ళ చంద్రమౌళి ఉన్నారు.
మోదేపల్లి మేజరుకు సరిపడా నీరు సరఫరా చేయాలి
మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ తమీమ్ అన్సారియాను మోదేపల్లి మేజరు పరిధిలో డీసీ చైర్మన్ కంచుమాటి శ్రీనివాసరావు నేతృత్వంలో పలు గ్రామాల సాగు నీటి సంఘం అధ్యక్షులు కలిశారు. మేజరు పరిధిలో సాగర్ జలాలు సరిపడా స్థాయిలో సరఫరా చేసి రైతులు ఆదుకోవాలని కోరారు. జలవనరుల ఎస్సీతో మాట్లాడి సరిపడా స్థాయిలో నీరు సరణరా చేయిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.