Share News

డాక్టర్ల ఆందోళన.. వైద్య సేవలపై కలెక్టర్‌ దృష్టి

ABN , Publish Date - Sep 30 , 2025 | 11:14 PM

జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కలెక్టర్‌ రాజాబాబు ప్రత్యేకదృష్టి సారించారు.

డాక్టర్ల ఆందోళన.. వైద్య సేవలపై కలెక్టర్‌ దృష్టి
కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సిబ్బంది

పీహెచ్‌సీల్లో పేదల చికిత్సలకు ఆటంకాలు లేకుండా చర్యలు

ప్రత్యేకంగా వైద్యుల కేటాయింపు

కలెక్టరేట్‌లో కంట్రోలు రూము ఏర్పాటు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యాధికారులు సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కలెక్టర్‌ రాజాబాబు ప్రత్యేకదృష్టి సారించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యసేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. జిల్లాలో 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వైద్యులను జీజీహెచ్‌ల నుంచి కమ్యూనిటీ వైద్యశాలల నుంచి డాక్టర్లను కేటాయిస్తూ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు నిరంతరం కలెక్టరేట్‌లో కంట్రోలు రూమును కూడా ఏర్పాటు చేశారు. అందుకోసం 1077 టోల్‌ఫ్రీ నెంబరుతో పాటు 08592-281400 ఫోన్‌ నెంబర్‌ను కూడా కేటాయించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ప్రజలకు వైద్య సేవలు అందడంలో ఏమైనా సమస్యలు ఉన్నా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేటాయించిన వైద్యులకు ఏమైనా సమస్యలు ఉంటే ఈ కంట్రోలు రూముకు కేటాయించిన ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. 64 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్‌ కళాశాల నుంచి 50 మంది వైద్యులను కమ్యూనిటీ వైద్యశాలల నుంచి 20 మంది వైద్యులను కలెక్టర్‌ నియమించారు. వీరితో పాటు అనుభవం కలిగిన ఎంఎల్‌హెచ్‌పీలను వీరికి సహాయకులుగా నియమించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యవేక్షణకు ఒకరిని ప్రోగ్రాం అఽధికారిగా నియమించడంతో పాటు ప్రతి మండల పరిధిలో ఒక 108 వాహనాన్ని అత్యవసర కేసుల నిమిత్తం అందుబాటులో ఉంచారు. హైరిస్క్‌, గర్భిణుల జాబితాలను ముందస్తు జాగ్రత్తల కోసం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపే విధంగా కలెక్టర్‌ శ్రీకారం చుట్టారు. పీహెచ్‌సీ వైద్యాధికారులు పీజీ ఇన్‌సర్వీ్‌స కోటాతో పాటు పలు రకాల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టిన నేపథ్యంలో ప్రజలకు వైద్యసేవల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారించి వైద్యశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Updated Date - Sep 30 , 2025 | 11:14 PM