అద్దె ఇంటి పేరుతో దివ్యాంగురాలిపై దాడి చేసి దోపిడీ
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:14 PM
అద్దెకు ఉండబోయే ఇంటిని చూసే పేరుతో ఓ యువతి దోపిడీకి పాల్పడింది. ఈ సంఘటన ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది.
ఏడున్నర సవర్ల బంగారం ఆభరణాలు అపహరణ
ఒంగోలుక్రైం, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): అద్దెకు ఉండబోయే ఇంటిని చూసే పేరుతో ఓ యువతి దోపిడీకి పాల్పడింది. ఈ సంఘటన ఒంగోలు నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే... నగరంలోని సుజాతనగర్ 3వ లైన్‌లో రిటైర్డ్ ఇరిగేషన్ సూపరింటెండెంట్ దివ్యాంగురాలైన నూనె పుష్పావతి నివాసం ఉంటోంది. ఆమె నివాసం ఉండే ఇంటి పైఅంతస్తు ఖాళీగా ఉండడంతో ఇల్లు అద్దెకు ఇవ్వబడును అని టూలెట్ బోర్డు పెట్టింది. మంగళవారం సాయంత్రం 30 ఏళ్ల వయస్సు కలిగిన ఓ యువతి అద్దెకు ఇల్లు కావాలని వచ్చి అడిగింది. దీంతో ఆ వృద్ధురాలు పైకి తీసుకెళ్లి ఇంటిని చూపించింది. అయితే ఇంటిని వీడియో తీసుకుంటానంటూ వృద్ధురాలిపై దాడి చేసి బంగారం ఆభరణాలను అపహరించు కెళ్ళింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సంఘటనా స్థలాన్ని తాలుకా సీఐ విజయకృష్ణ పరిశీలించి కేసు నమోదు చేశారు.