Share News

జిల్లావ్యాప్తంగా తనిఖీలు

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:21 AM

జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్లతోపాటు రేషన్‌ షాపులు, పెట్రోలు బంకులు, సినిమా హాల్స్‌, గ్యాస్‌ ఏజెన్సీలు, బాణసంచా గోడౌన్లలో రెవెన్యూ యంత్రాంగం మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ ఆదేశాలతో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, అగ్నిమాపక శాఖ, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు ఎక్కడికక్కడ ఈ పని చేపట్టారు.

జిల్లావ్యాప్తంగా తనిఖీలు
మార్కాపురంలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో తనిఖీలు చేస్తున్న జేసీ గోపాలకృష్ణ

ప్రతి మండలంలో తహసీల్దార్ల పరిశీలన

చీమకుర్తి, పొదిలి, మార్కాపురంలో పాల్గొన్న జేసీ గోపాలకృష్ణ

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పౌరసరఫరాల సంస్థ గోడౌన్లతోపాటు రేషన్‌ షాపులు, పెట్రోలు బంకులు, సినిమా హాల్స్‌, గ్యాస్‌ ఏజెన్సీలు, బాణసంచా గోడౌన్లలో రెవెన్యూ యంత్రాంగం మంగళవారం విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. జాయింట్‌ కలెక్టర్‌ గోపాలకృష్ణ ఆదేశాలతో ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌, అగ్నిమాపక శాఖ, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు ఎక్కడికక్కడ ఈ పని చేపట్టారు. జిల్లాలోని 30 పెట్రోలు బంకులు, 23 గ్యాస్‌ ఏజెన్సీలు, 23 రేషన్‌షాపులు, 11 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు, 11 రైస్‌ మిల్లులు, 6 బాణసంచా గోడౌన్లు, 15 ఆర్వో ప్లాంట్లు, ఒక ఐస్‌క్రీం ఇండస్ట్రీ, 9 సినిమా హాల్స్‌ను తనిఖీ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నాయా? లేవా? అన్నది పరిశీలించారు. పెట్రోలు బంకుల్లో ధరల పట్టికలతోపాటు లీటరు కొలతలను పరిశీలించారు. సినిమా థియేటర్లలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వసతులు, రక్షణ చర్యలను చూశారు. మరోవైపు పౌరసరఫరాల గిడ్డంగుల్లో స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. రేషన్‌షాపుల ద్వారా వచ్చేనెల 1 నుంచి సరుకులు పంపిణీ చేయాల్సి ఉండటంతో వాటికి సరఫరా చేసిన బియ్యం, చక్కెర నిల్వలను పరిశీలించి రిజిస్టర్లను చెక్‌ చేశారు. గ్యాస్‌ ఏజెన్సీల ద్వారా లబ్ధిదారులకు ఇస్తున్న సిలిండర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు వేసవికాలం కావడంతో బాణసంచా గోడౌన్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అంశాలను అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. తాగునీటిని అందించే వాటర్‌ ప్లాంట్లను ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులతో కలిసి నాణ్యతను పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణ చీమకుర్తిలోని పెట్రోలు బంకుతోపాటు పొదిలిలో సినిమా థియేటర్‌ను, గ్యాస్‌ గోడౌన్‌ను, వాటర్‌ప్లాంట్‌ను తనిఖీ చేశారు. అక్కడ పరిసరాలను కూడా పరిశీలించి పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. మార్కాపురంలో అక్కడి సబ్‌కలెక్టర్‌తో కలిసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయా శాఖల అధికారులు తనిఖీలు నిర్వహించారు. పూర్తిస్థాయి నివేదికలను నేడు రేపో జాయింట్‌ కలెక్టర్‌కు పంపనున్నట్లు సమాచారం.

Updated Date - Apr 30 , 2025 | 01:21 AM