Share News

జిల్లా సంబరం

ABN , Publish Date - Nov 27 , 2025 | 02:20 AM

జిల్లా పునర్విభజన విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న తాజా నిర్ణయంపై ఉమ్మడి జిల్లా వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడంతో వారు సంబరాల్లో మునిగిపోయారు. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు.

జిల్లా సంబరం
దర్శిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి లక్ష్మి, కూటమి పార్టీల నాయకులు

పునర్విభజనపై హర్షాతిరేకాలు

పండుగ చేసుకుంటున్న పశ్చిమప్రాంత ప్రజానీకం

పలుచోట్ల సీఎం చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం

దర్శి నియోజకవర్గ ప్రజల్లో ఆనందం

తిరిగి ప్రకాశంలో చేరికపై అద్దంకి, కందుకూరు ప్రాంత ప్రజల హర్షం

రెవెన్యూ డివిజన్‌ విషయంలో గిద్దలూరు వాసుల్లో అసంతృప్తి

జిల్లా పునర్విభజన విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న తాజా నిర్ణయంపై ఉమ్మడి జిల్లా వాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమప్రాంత ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడంతో వారు సంబరాల్లో మునిగిపోయారు. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. తమకు అనుకూలంగా ఉండే ప్రకాశం జిల్లాలోకి తిరిగి చేర్చడం కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల ప్రజల్లో జోష్‌ నింపింది. తమ ప్రాంతాన్ని ప్రకాశంలోనే కొనసాగించడం పట్ల దర్శి నియోజకవర్గ ప్రజలు ఆనందంగా ఉన్నారు. అదేసమయంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటుపై సంతోషంగా ఉన్నప్పటికీ రెవెన్యూ డివిజన్‌ విషయంలో తమకు అన్యాయం జరిగిందని గిద్దలూరు ప్రాంత ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఒంగోలు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లా ప్రజల్లో నూతనోత్సాహం నెలకొంది. ముఖ్యంగా పశ్చిమప్రాంత వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలతో కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులను సుదీర్ఘంగా సమీక్షించి తుది నిర్ణయాన్ని సీఎం చంద్రబాబునాయుడు తీసుకున్న విషయం విదితమే. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలకు అదనంగా మరో మూడు జిల్లాలు, అలాగే కొత్తగా నాలుగు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. 17 జిల్లాల్లో వివిధ ప్రాంతాల సర్దుబాట్లకు అనుమతించారు. అలాంటి సర్దుబాట్లు, కొత్తవాటి ఏర్పాటులో ప్రధాన భాగస్వామ్యం ప్రకాశం జిల్లాకు అధికంగా ఉంది. ప్రస్తుతం ఒంగోలు కేంద్రంగా ఎనిమిది నియోజకవర్గాలతో ఉన్న మన జిల్లాలో పశ్చిమప్రాంతంలోని మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ప్రకటించారు. మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో మార్కాపురం, వైపాలెం నియోజకవర్గంలోని మండలాలు, కనిగిరి డివిజన్‌లోకి కనిగిరి, గిద్దలూరు నియోజకవర్గంలోని మండలాలు కేటాయించారు. అలా నాలుగు నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, 21 మండలాలతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది.

ప్రకాశంలో మూడు రెవెన్యూ డివిజన్లు

ఒంగోలు, సంతనూతలపాడు, కొండపి, దర్శితోపాటు గతంలో నెల్లూరు జిల్లాలోకి వెళ్లిన కందుకూరు, బాపట్ల జిల్లాలోకి వెళ్లిన అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ప్రకాశం జిల్లాగా ఉండనుంది. ఈ పరిధిలో ఇప్పటికే ఉన్న ఒంగోలు, కందుకూరుతోపాటు కొత్తగా అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తున్నారు. అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని పది మండలాలను అందులో ఉంచుతున్నారు. కొండపి నియోజకవర్గంలోని పొన్నలూరు, మర్రిపూడి మండలాలను తిరిగి కందుకూరు రెవెన్యూ డివిజన్‌లోకి చేర్చారు. అలా ఒంగోలు కేంద్రంగా జిల్లా విషయం అన్ని ప్రాంతాల ప్రజలకు సంతృప్తికరంగానే ఉంది. స్థానిక ప్రజల ఆకాంక్షలకు సీఎం ఓకే చెప్పారు. ప్రత్యేక జిల్లా ఏర్పాటు విషయమై పూర్తి సంతృప్తిని పశ్చిమ ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా తాము ఎదురుచూస్తున్న మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసిన సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. మంగళవారం రాత్రి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీతోపాటు భారీగా సంబరాలు చేశారు. బుధవారం ఎర్రగొండపాలెంలో టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబు నేతృత్వంలో వేడుకలు నిర్వహించారు. మార్కాపురంలో బీజేపీ శ్రేణులు, కంభంలో వివిధ వర్గాల వారు సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

గిద్దలూరుకు డివిజన్‌ సమస్య

గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సంతృప్తితో ఉన్నప్పటికీ తమ ఎమ్మెల్యే కోరిన ప్రకారం గిద్దలూరు రెవెన్యూ డివిజన్‌ ఇవ్వకపోవడమే దూరంగా ఉండే కనిగిరి డివిజన్‌లో కలపడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ విషయంలో ఆ ప్రాంత ప్రజల ఆలోచన సరైనదిగానే భావించాల్సిన ఉంది. కనిగిరిలో ఇప్పటికే రెవెన్యూ డివిజన్‌ కార్యాలయం ఉండటంతో గిద్దలూరు ప్రాంతాన్ని అందులో చేర్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు మార్కాపురం రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. ఆయా మండల కేంద్రాలు మార్కాపురానికి 25 నుంచి 65 కి.మీ దూరం లోపు ఉన్నాయి. రెండు ప్రధాన జాతీయ రహదారులు, నిత్యం బస్సు సర్వీసులు, ఇతర రవాణా సౌకర్యాలతో రాకపోకలు సులువుగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఆరు మండలాలను కనిగిరి డివిజన్‌లో కలపడంతో వారు రవాణా విషయంలో తీవ్ర సమస్యగా భావిస్తున్నారు. గిద్దలూరు నియోజకవర్గం నుంచి నేరుగా కనిగిరికి రోడ్డు సౌకర్యం లేదు. గిద్దలూరు నుంచి కనిగిరి వెళ్లాలంటే నంద్యాల-ఒంగోలు రహదారిలో చిన్నారికట్ల జంక్షన్‌ వరకు వచ్చి తిరిగి మరో 30కి.మీ లోపలికి వెళ్లాలి. దాదాపు 100 కిలోమీటర్లకుపైగా దూరం ఉంటుంది. ఇతర మండలాల నుంచి అదే రహదారిలో ప్రయాణం చేయాలి. నేరుగా వెళ్లేందుకు ఒక్క బస్సు సౌకర్యం కూడా లేని పరిస్థితి. భూ సమస్యలు అధికంగా ఉండే గిద్దలూరు ప్రాంత వాసులకు రెవెన్యూ డివిజన్‌ దూరం కావడం, రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం తీవ్ర ప్రతికూల పరిస్థితి.

డివిజన్‌ కావాలి లేదా మార్కాపురంలోనే ఉంచాలి..

ప్రస్తుతం మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పడుతుండగా గిద్దలూరు వాసులు ఎక్కడి నుంచైనా జిల్లా కేంద్రానికి ఏ సమయంలోనైనా గంట వ్యవధిలో చేరుకునే అవకాశం ఉంది. అదే కనిగిరికి వెళ్లి రావాలంటే ఒక రోజు పట్టే పరిస్థితి. దీనిపై ఆ ప్రాంత ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మార్కాపురం జిల్లా ఏర్పాటు వల్ల కలిగిన ఉత్సాహం కన్నా కనిగిరి డివిజన్‌లో చేర్చిడంపై అసంతృప్తే అధికంగా కనిపిస్తోంది. ఈ ప్రతికూల పరిస్థితిని గుర్తించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి గిద్దలూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ కోసం శాయుశక్తులా ప్రయత్నం చేశారు. మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించగా తొలుత సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ చివరకు సాకారం కాలేదు. కాగా తమ ఎమ్మెల్యే కోరిన విధంగా గిద్దలూరు డివిజన్‌ ఏర్పాటు చేయాలని, అలా సాధ్యంకాని పక్షంలో ఇప్పటివరకు ఉన్న విధంగా మార్కాపురం డివిజన్‌లోనే తమ ప్రాంతాన్ని కొనసాగించాలన్న బలమైన ఆకాంక్ష ఆ ప్రాంత ప్రజల్లో కనిపిస్తోంది.

Updated Date - Nov 27 , 2025 | 02:20 AM