నిమజ్జనంలో అపశ్రుతి
ABN , Publish Date - Sep 07 , 2025 | 02:24 AM
వినాయక నిమజ్జనంలో చివరి రోజైన శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగి మోటుమాలకు చెందిన పురిణి నాగరాజు (50), పురిణి పాలచంద్రరావు (45) మృతి చెందారు. ఈ ఘటన గుండమాల తీరంలో జరిగింది.
సముద్రంలోకి దిగి ఇద్దరు మృతి
ఒకరిని కాపాడే ప్రయత్నంలో కొట్టుకుపోయిన మరొకరు
గుండమాల తీరంలో ఘటన
కొత్తపట్నం, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : వినాయక నిమజ్జనంలో చివరి రోజైన శనివారం అపశ్రుతి చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగి మోటుమాలకు చెందిన పురిణి నాగరాజు (50), పురిణి పాలచంద్రరావు (45) మృతి చెందారు. ఈ ఘటన గుండమాల తీరంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కొత్తపట్నం మండలం మోటుమాల గ్రామంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను గ్రామస్థులు ఒకే రోజు నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారం శనివారం విగ్రహాలను గుండమాల తీరానికి తీసుకువచ్చి నిమజ్జనం చేశారు. ఆతర్వాత కొంత మంది సముద్రంలో స్నానాలకు దిగారు. వీరిలో నాగరాజు లోతుకు వెళ్లి స్నానం చేస్తున్న సమయంలో సముద్రంలోకి కొట్టుకుపోతుండటంతో పురిణి పాలచంద్రరావు రక్షించేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కూడా లోపలికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో మోటుమాలలో విషాదచాయలు నెలకొన్నాయి. అప్పటివరకు విగ్రహాల నిమజ్జన కార్యక్రమాల్లో హుషారుగా ఉన్న గ్రామస్థులు ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. పాలచంద్రరావుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నాగరాజుకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొద్దిసేపటికి ఒడ్డుకు చేరిన ఇద్దరి మృతదేహాలను కొత్తపట్నం ఎస్‌ఐ సుధాకర్ పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
గస్తీని పెంచిన పోలీసులు
ఇప్పటి వరకు నిమజ్జనాల్లో చిన్నపాటి అవాంఛనీయ ఘటన కూడా చోటుచేసుకోకుండా చూసిన పోలీసులు గుండమాల ప్రమాదంతో అప్రత్తమయ్యారు. కొత్తపట్నం మండలంలోని తీరప్రాంత గ్రామాల వద్ద గస్తీని పెంచారు. ఒంగోలు డీఎస్పీ శ్రీనివాసరావు హుటాహుటిన తీరానికి చేరుకున్నారు. కొత్తపట్నంతోపాటు నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు.
మంత్రి స్వామి, ఎమ్మెల్యే దామచర్ల సంతాపం
నిమజ్జనం సందర్భంగా ఇద్దరు మృతి ఘటనపై రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. నిమజ్జనాల్లో భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మృతుల కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.