Share News

సాగర్‌ నీటి పంపిణీలో వివక్ష

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:19 AM

సాగర్‌ నీటి పంపిణీలో వివక్ష కొనసాగుతోంది. అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎగువ ప్రాంతంలోని కాలువలకు అధిక నీరు విడుదల చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరన ఉన్న ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు తీరని అన్యాయం జరుగుతోందని రైతులు అంటున్నారు.

సాగర్‌ నీటి పంపిణీలో వివక్ష
పమిడిపాడు బ్రాంచ్‌ కాలువకు అధికంగా విడుదలవుతున్న నీరు

ఎగువ ప్రాంతానికి అధికంగా విడుదల

తప్పుడు లెక్కలు చూపుతున్న అధికారులు

ఒంగోలు బ్రాంచి కాలువకు తీరని అన్యాయం

ఆగ్రహం వ్యక్తంచేస్తున్న ఆయకట్టు రైతులు

పరిశీలించి చర్యలు తీసుకుంటాం : ఈఈ

సాగర్‌ నీటి పంపిణీలో వివక్ష కొనసాగుతోంది. అధికారులు ఉద్దేశపూర్వకంగా ఎగువ ప్రాంతంలోని కాలువలకు అధిక నీరు విడుదల చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరన ఉన్న ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు తీరని అన్యాయం జరుగుతోందని రైతులు అంటున్నారు. తక్కువగా నీరు విడుదల చేస్తుండటంతో మేజర్లు, మైనర్లకు అందడం లేదని వాపోతున్నారు. చివరి ఆయకట్టు భూముల్లో ఇంకా వరినాట్లు పూర్తికాక ఇబ్బందులు పడుతున్న తరుణంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దర్శి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలుకు (ప్రకాశం జిల్లా సరిహద్దు) 2,502 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. అందులో పమిడిపాడు బ్రాంచ్‌ కాలువకు 415 క్యూసెక్కులు, ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు 773 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు అధికారుల లెక్కల ప్రకారం వెల్లడవుతోంది. ఆ రెండు కాలువలకు అధిక నీరు విడుదల చేస్తున్నారని ఒంగోలు బ్రాంచ్‌ కాలువ (ఓబీసీ) పరిధిలోని నీటి సంఘాల అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. వాస్తవంగా పమిడిపాడు బ్రాంచ్‌ కాలువకు 650 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తూ 450 క్యూసెకులు అన్నట్లు లెక్కలు చెబుతున్నారని విమర్శిస్తున్నారు. అనధికారికంగా 200 క్యూసెక్కుల నీరు అదనంగా పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

లెక్కలు చెప్పడం లేదు

సాగర్‌ ప్రధాన కాలువ 85/3వ మైలు నుంచి 126వ మైలు వరకు ఉన్న మేజర్లకు, దర్శి బ్రాంచ్‌ కాలువ పరిధిలోని మేజర్లకు కూడా అధిక నీరు విడుదల చేస్తూ అధికారులు సక్రమంగా లెక్కలు చెప్పడం లేదు. దర్శి బ్రాంచ్‌ కాలువ హెడ్‌ వద్ద కొంతకాలంగా రీడింగ్‌ తీయడం నిలిపివేశారు. అక్కడ రీడింగ్‌ మీటర్‌ సక్రమంగా పనిచేయడం లేదని అధికారులు సాకులు చెబుతూ పక్కన పెట్టారు. ప్రస్తుతం పమిడిపాడు బ్రాంచ్‌ కాలువ వద్ద రీడింగ్‌ సక్రమంగా లేదని అందువలన తక్కువ నీరు విడుదల అవుతున్నా అధిక నీరు సరఫరా అవుతున్నట్లు రీడింగ్‌లు చూపుతున్నాయని అక్కడి అధికారులు బుకాయిస్తున్నారు. దర్శి-2 డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్‌ వెలుగొండారెడ్డి, పలువురు నీటి సంఘాల అధ్యక్షులు ఎన్‌ఎ్‌సపీ అధికారులకు నీటి పంపిణీలో జరుగుతున్న వివక్షపై ఫిర్యాదు చేశారు. ఆ సందర్భంగా అధికారులు రీడింగ్‌లలో తేడా ఉందని సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు. వాస్తవంగా పమిడిపాడు బ్రాంచ్‌ కాలువ హెడ్‌ వద్ద రీడింగ్‌లు సక్రమంగా ఉన్నాయని, అధికారులు ఉద్దేశపూర్వకంగానే వక్రీకరించి చెబుతున్నారని నీటి సంఘాల అధ్యక్షులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు సాగునీటి పంపిణీలో జరుగుతున్న వివక్షను పరిశీలించి చర్యలు తీసుకోవాలని, చివరి ప్రాంతాలకు సక్రమంగా నీరందించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఓబీసీకి నీటి పరిమాణం పెంచుతాం : ఎన్‌ఎస్పీ దర్శి ఈఈ

ఒంగోలు బ్రాంచ్‌ కాలువకు నీటి పరిమాణాన్ని పెంచుతామని దర్శి ఎన్‌ఎ్‌సపీ ఈఈ విజయలక్ష్మి చెప్పారు. నీటి సరఫరాలో వివక్ష చూపుతున్నారని, ఎగువ ప్రాంతానికి అధికంగా విడుదల చేస్తున్నారని వస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. పంపిణీ అవుతున్న నీటి పరిమాణం లెక్కలను పరిశీలించి తేడాలు ఉంటే సరిచేస్తామన్నారు. పీబీసీకి అధిక నీరు విడుదల చేస్తున్నారని కొందరు రైతులు, నీటి సంఘాల అధ్యక్షులు తమకు ఫిర్యాదులు చేసిన మాట వాస్తవమేనని చెప్పారు. ఆ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 01:19 AM