బాధితుల వద్దకే నేరుగా..
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:25 AM
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతిపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్పీల చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టింది. సోమవారంజేసీ గోపాలకృష్ణ నేరుగా బాధితులను కలిసి మాట్లాడారు.
మెప్మాలో అవినీతిపై జేసీ లోతైన విచారణ
బయటపడుతున్న బోగస్ గ్రూపుల బాగోతం
ఒంగోలు కార్పొరేషన్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో అవినీతిపై జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్పీల చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టింది. సోమవారంజేసీ గోపాలకృష్ణ నేరుగా బాధితులను కలిసి మాట్లాడారు. ముందుగా స్థానిక విజయ్‌నగర్ కాలనీలోని కొన్ని గ్రూపుల సభ్యులను విచారించారు. గతంలో ఆర్పీగా పనిచేసిన శ్రీలత తమను మోసం చేశారని వారు వాపోయారు. అక్కడి నుంచి కేశవస్వామిపేటకు వెళ్లారు. అక్కడి ఎస్టీ సామాజికవర్గానికి చెందిన 14 గ్రూపుల సభ్యులు ఆర్పీ దివ్యశాంతి మోసం చేసి భారీగా దోచుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో వారిని విచారించారు. ఆర్పీ సమక్షంలోనే ఒక్కో సభ్యురాలు తమకు జరిగిన అన్యాయాన్ని జేసీకి వివరించారు. వారి వివరణను లిఖితపూర్వకంగా, వీడియో ద్వారా నమోదు చేసుకున్నారు. కర్నూలు రోడ్డులోని ఓ బ్యాంకులో అత్యధికంగా బోగస్ రుణాలు పొందడంతో అక్కడకు వెళ్లి విచారించాలని జేసీ కమిటీ నిర్ణయించింది. మెప్మా అధికారులు, సిబ్బందిని ఆ బ్యాంకు వద్దకు రావాలని జేసీ ఆదేశించారు. పీడీ శ్రీహరి రేపు వెళ్దామని బదులివ్వడంతో ఆయనపై సీరియస్ అయినట్లు సమాచారం. ఏమైనా మంచి ముహూర్తం చూసుకొని వెళ్దామా? అని మండిపడటంతో అధికారులు మౌనం వహించారు. దీంతో మధ్యాహ్నం నుంచి జేసీ విచారణ కమిటీ నేరుగా బ్యాంకుకు వెళ్లి అక్కడి ఉద్యోగులు, మెప్మా సిబ్బంది సమక్షంలో పలు అంశాలపై విచారణ చేశారు. జేసీ వెంట విచారణ కమిటీసభ్యులైన జడ్పీ సీఈవో చిరంజీవి, డీఆర్‌డీఏ పీడీ నారాయణ ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం జేసీ కమిటీ నుంచి 2022 నుంచి మెప్మాలో పనిచేస్తున్న ఉద్యోగుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలో 2022 నుంచి పనిచేస్తున్న బ్యాంకు లింకేజీ అధికారి రాణి తాను 2023 సెప్టెంబరు నుంచి పని చేస్తున్నానని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కొంత మంది సిబ్బంది 2024లో బదిలీపై ఒంగోలు మెప్మా కార్యాలయానికి రాగా, వారు కూడా 2022 నుంచి ఇక్కడే పనిచేస్తున్నారంటూ పీడీ చెప్పి విచారణ కమిటీని పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు సమాచారం.