Share News

గుప్తనిధుల కోసం తవ్వకాలు

ABN , Publish Date - Aug 23 , 2025 | 12:02 AM

హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామ కొండపై ఉన్న రంగనాయకస్వామి ఆలయంలో శుక్రవారం వేకువజామున గుప్తనిధుల కోసం దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.

గుప్తనిధుల కోసం తవ్వకాలు
తవ్వకం జరిగిన ప్రదేశం

నందనవనం కొండపై విగ్రహాల ధ్వంసం

నెలరోజులుగా రెక్కీ వేసిన ముఠా

పోలీసులు అదుపులో ముఠా నాయకులు

కనిగిరి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామ కొండపై ఉన్న రంగనాయకస్వామి ఆలయంలో శుక్రవారం వేకువజామున గుప్తనిధుల కోసం దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు. స్థానికుల కఽథనం ప్రకారం.. నందనవనం గ్రామ శివారు కొండపై కొలువైఉన్న రంగనాయక స్వామి, శివాలయంలో గుప్తనిధుల కోసం ముఠా ప్రత్యేక పూజలు చేపట్టింది. పూజా కార్యక్రమం నిర్వహించే క్రమంలో టెంకాయల లేకపోవడంతో వాటిని కొనుగోలు చేసేందుకు గ్రామంలోని ఓ చిల్లర దుకాణానికి కొత్త వ్యక్తులు రావటంతో గ్రామస్థులకు అనుమానం కలిగింది. దీంతో వారిని వెంబడించి ఓ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పచెప్పగా విచారణలో అవాక్కయ్యే వాస్తవాలు బయటపడినట్లు సమాచారం.

నెలరోజులుగా రెక్కీ వేసిన ముఠా

కొండవద్ద ఉన్న రంగనాయకస్వామి ఆలయంలో ఉన్న గుప్త నిధులు ఉన్నట్లు ఆధారాలతో ఓ ముఠా గ్రామంలోకి వచ్చింది. నెలరోజులుగా రోజూ గ్రామంలోని ఆయా మార్గాల్లో ప్రజలు ఏయే సమయాల్లో సంచరిస్తారో ముఠా వ్యక్తులు రెక్కీ వేశారు. ఎలాంటి అనుమానాలు రాకుండా అపరాలు కొనుగోలు చేసే వ్యక్తులుగా, వివిధ వ్యాపారాలు నిర్వహించే వ్యక్తులుగా అవతారాలెత్తి గ్రామంలో సంచరించినట్లు గ్రామస్థులు చెప్తున్నారు. 15మంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి కొండపైన ఆలయంలో తవ్వకాలకు పాల్పడ్డారు.

పోలీసుల అదుపులో నిందితుడు

శుక్రవారం వేకువజామున నందనవనం గ్రామంలోని చిల్లర దుకాణం నుంచి టెంకాయలు కొనుగోలు చేసి వెళ్తున్న ఓ వ్యక్తి కొండ దిగువ ప్రవేశమార్గం వద్ద ఉన్న మరో వ్యక్తికి టెంకాయలు అప్పచెప్పాడు. ఈ విషయాన్ని గ్రామస్థుడు రామకృష్ణ అనే వ్యక్తి వెంబడించి గుర్తించాడు. ఈక్రమంలో ముఠాలోని ఇరువురు వ్యక్తులు టెంకాయలు కొనుగోలు చేశామనే విషయాన్ని ఫోన్‌ ద్వారా కొండపై ఉన్న ముఠాకు తెలియచేశాడు. గ్రామస్థుడు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకరు పారిపోగా, మరొకరు చిక్కాడు. ఈలోపు పారిపోయిన వ్యక్తి ముఠాకు సమాచారం అందించగా వారు కొండపై నుంచి పలాయనం చిత్తగించారు. గ్రామస్థులు కొండపైకి వెళ్ళి చూడగా విగ్రహాలు పెకలించి ఉన్నట్లుగా, పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లుగా ఉన్నాయి. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం.

Updated Date - Aug 23 , 2025 | 12:02 AM