ఆరంభంలోనే అవస్థలు
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:01 PM
ఈ ఏడాది పొగాకు సాగు ఆరంభం నుంచే రైతులకు అవస్థలు ప్రారంభమయ్యాయి. నాట్ల దశలోనే పాట్లు పడాల్సి వస్తోంది. గత నెలలో మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో సకాలంలో పంట సాగు చేయలేకపోయారు. వానలకు చాలాచోట్ల దొడ్లు పూర్తిగా దెబ్బతినడంతో పొగాకు నారుకు కొరత ఏర్పడింది. దీంతో నారు ధర భారీగా పెరిగింది.
పొగాకు సాగును దెబ్బతీసిన మొంథా తుఫాన్
కీలక సమయంలో భారీ వర్షాలు
చాలాచోట్ల సకాలంలో నాట్లు వేయలేకపోయిన దుస్థితి
ఇప్పటి వరకు దక్షిణాదిలో 18,026 హెక్టార్లలోనే సాగు
గత ఏడాది కన్నా 47శాతం తక్కువ
ఇంకా పూర్తికాని గత సీజన్ వేలం
ఈ ఏడాది పొగాకు సాగు ఆరంభం నుంచే రైతులకు అవస్థలు ప్రారంభమయ్యాయి. నాట్ల దశలోనే పాట్లు పడాల్సి వస్తోంది. గత నెలలో మొంథా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో సకాలంలో పంట సాగు చేయలేకపోయారు. వానలకు చాలాచోట్ల దొడ్లు పూర్తిగా దెబ్బతినడంతో పొగాకు నారుకు కొరత ఏర్పడింది. దీంతో నారు ధర భారీగా పెరిగింది. ఎకరా విస్తీర్ణంలో పొగాకు నాట్లు వేసేందుకు సేద్యం, నారు, ఎరువులు, కూలి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి సగటున రూ.35వేల వరకూ ఖర్చవుతోంది. గత సీజన్‌తో పోల్చితే నాట్లు వేసే రోజే దాదాపు 40శాతం అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. మరోవైపు గత సీజన్ కొనుగోళ్లు ఇంకా ముగియకపోవడం సాగుదారులను మరింత కలవరపెడుతోంది.
ఒంగోలు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాదిలోని రెండు జిల్లాల్లో మొత్తం 11వేలం కేంద్రాలు ఉండగా సుమారు 24వేల నుంచి 25వేల బ్యార్‌లకు రైతులు లైసెన్స్‌లు కలిగి ఉన్నారు. వాటి పరిధిలో 2025-26 పంట కాలానికి దాదాపు 62వేల హెక్టార్లలో సాగుకు, సుమారు 90.20 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి పొగాకు బోర్డు అనుమతి ఇచ్చింది. దక్షిణాది ప్రాంతంలో ప్రస్తుతం పొగాకు నాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవైపు వాతావరణం అనుకూలించక సాగు జాప్యం, మరో వైపు నారు, ఇతర ధరలు పెరగడం రైతులకు భారంగా మారింది.
తుఫాన్‌తో అంతా తారుమారు
బోర్డు అనుమతించిన విస్తీర్ణంలో 60 శాతం మేర ఈసమయానికి నాట్లు వేస్తారు. ప్రధానంగా దక్షిణాది తేలిక నేలలుగా ఉండే జిల్లాలోని పొదిలి, కనిగిరి, నెల్లూరు జిల్లాలోని కలిగిరి, డీసీపల్లి, కందుకూరు వేలం కేంద్రాల్లోని అధిక భాగంలోనూ, అలాగే ఎస్‌బీఎస్ రీజియన్‌లోని ఎగువ ప్రాంతాల్లోనూ నాట్లు వేయడం పూర్తవుతుంది. కొన్నిచోట్ల సెప్టెంబరు ఆఖరులో నాట్లు ప్రారంభమై అక్టోబరు రెండో పక్షానికి ముమ్మరమవుతాయి. అలాంటిది ఈ ఏడాది మొంథా తుఫాన్ ముంచెత్తి సీజన్‌ను తారుమారు చేసింది. ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లో ముమ్మరంగా నాట్లు వేసే సమయంలో తుఫాన్ విరుచుకుపడటంతో సాగు జాప్యమైంది. చాలాచోట్ల 15నుంచి 20 రోజులపాటు మొక్కలు నాటలేకపోయారు. కొన్నిచోట్ల బురదలోనే నాట్లు వేసేందుకు రైతులు సిద్ధమైనప్పటికీ భారీ వర్షాలతో నారుమళ్లు దెబ్బతిన్నాయి. నారు ధర కొండెక్కి కూర్చోవడమే కాక నాణ్యత అంతగా లేక రైతులు ఇబ్బంది పడ్డారు.
18వేల హెక్టార్లలోనే నాట్లు
గత ఏడాది ఈ సమయానికి ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లో సుమారు 19,900 హెక్టార్లు, ఎస్‌బీఎ్‌సలో సుమారు 18,500 హెక్టార్లు వెరసి ఇంచుమించు 38,400 హెక్టార్లలో పొగాకు నాట్లు వేశారు. అయితే ఈసారి అందులో సగం విస్తీర్ణంలో కూడా నాట్లు పడిన పరిస్థితి లేదు. అధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ ఏడాది ఇప్పటి వరకు ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్‌లో సుమారు 11,500 హెక్టార్లు, ఎస్‌బీఎస్ రీజియన్‌లో 6,500 హెక్టార్లు వెరసి 18వేల హెక్టార్లలో మాత్రమే నాట్లు పూర్తయ్యాయి. జిల్లాలోని పొదిలి, కనిగిరి కేంద్రాల పరిధిలో ఒక మోస్తరుగా నాట్లు వేయగా, మిగతా చోట్ల అంతగా కనిపించడం లేదు. నాలుగైదు రోజులుగా అన్ని ప్రాంతాల్లోనూ ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు.
దిగుబడి తగ్గుతుందని రైతుల ఆందోళన
ఎస్‌ఎల్‌ఎస్ రీజియన్ ప్రాంతంలో నెల రోజులకుపైన ఆలస్యంగా పొగాకు నాట్లు వేస్తుండటం వలన పంట దిగుబడి తగ్గే అవకాశం ఉండటంతో రైతులు కొంత ఆందోళన చెందుతున్నారు. జనవరి తర్వాత ఒక మోస్తరు వాన కురిస్తే తప్ప దిగుబడిరాదంటున్నారు. ఒకవైపు పొగాకు నాట్లు ముమ్మరమైనప్పటికీ ఇంకా గత సీజన్ కొనుగోళ్లు ముగియకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.
భారీగా పెరుగుతున్న పెట్టుబడి ఖర్చు
పొగాకు నాట్లకు ఈసారి ఖర్చు భారీగా పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ఈ సమయంలో మూట నారు ధర రూ.1,500 నుంచి 2వేలు ఉండగా.. ప్రస్తుతం రూ.6వేల నుంచి 7వేలు పలుకుతోంది. ఎకరాకు రెండు మూటల నారు అవసరం కాగా ఇందులోనే దాదాపు ఎకరాకు గతం కన్నా సగటున రూ.8వేల నుంచి 10వేలు అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. గత ఏడాది రూ.6వేల వరకు ఉన్న సేద్యపు ఖర్చులు ఈసారి దాదాపు రూ.10వేలకు పెరిగాయి. వర్షాలతో మళ్లీమళ్లీ దున్నాల్సి రావడంతో ఆమేరకు ఖర్చు పెరిగింది. ఇక నాట్లు వేసే కూలీలకు రూ.5వేల నుంచి రూ.6వేలు, ట్యాంకర్ నీటికి రూ.2వేలు, బలం కోసం వేసే ఎరువులకు మరో 10వేల వరకూ అవుతున్నాయి. అలా పొలంలో పొగాకు మొక్క నాటే సరికి సగటున ఎకరాకు రూ.35వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. అంటే గత ఏడాది కన్నా నికరంగా ఎకరాకు 40శాతానికిపైగా ఖర్చు నాట్లు వేసే సమయానికే పెరిగి రైతులు ఆందోళన చెందుతున్నారు.