కొండ కనుమల్లో కోట్లతో అభివృద్ధి
ABN , Publish Date - Nov 10 , 2025 | 11:38 PM
కొండ కనుమల్లో మారుమూల గ్రామాల్లో కోట్ల రూపాయల వెచ్చించి ప్రజాప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తోంది. ఈక్రమంలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలానికి మహర్దశ పట్టింది.
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు
పీసీపల్లి మండలానికి పట్టనున్న మహర్దశ
నేడు పరిశ్రమల పార్క్‌కు ప్రారంభోత్సవం చేయనున్న సీఎం
కనిగిరి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : కొండ కనుమల్లో మారుమూల గ్రామాల్లో కోట్ల రూపాయల వెచ్చించి ప్రజాప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తోంది. ఈక్రమంలో వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గంలోని పీసీపల్లి మండలానికి మహర్దశ పట్టింది. ఇప్పటికే పీసీపల్లి మండలంలోని దివాకరపల్లిలో కొండల నడుమ రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు చకచకా పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు లింగన్నపాలెంలో ఎంఎ్‌సఎంఈ (సూక్ష్మ,చిన్నతరహా పరిశ్రమల) ద్వారా పీసీపల్లి మండలం పారిశ్రామిక వాడగా మారనుంది. మంగళవారం గుంటూరు లింగన్నపాలెంలో పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది.
ఆ పల్లె ప్రజలు ఊహించి ఉండరు
శతాబ్దాలుగా ఆయా ప్రాంత ప్రజల తరాలు మారుతున్నాయి కాని వారి తలరాతలు మాత్రం మారడంలేదు. సూర్యోదయానికి ముందే పొలం పనులు చేసుకుంటూ వ్యవసాయం పైనే ఆధారపడి జీవించే కుటుంబాలు. పశువుల పోషణే ఆదాయమార్గంగా భావించి ఆ దిశగా జీవనం సాగించేవారే అధికంగా ఉంటారు. కొన్ని కుటుంబాలు గొర్రెలను మేపుకుంటూ, అమ్ముకోవటమే వారి ఆదాయ వనరు. పశువులు, గొర్రెలు, నాగలి కొర్రలు సంచరించే ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపన జరుగుతుందని, అందుకోసం తమ భూములకు మంచి విలువ వస్తుందని దీంతో వారి నివాసాలు పారిశ్రామిక వాడలుగా మారతాయని ఆయా గ్రామాల ప్రజలు ఊహించి ఉండరు. నేటి పరిస్థితిని బట్టి చూస్తుంటే అది నిజమని చెప్పాల్సిందే మరి.
కొండల్లో పారిశ్రామిక వాడలు
కనిగిరి నియోజకవర్గంలోని ఏ ప్రాంతం చూసినా కొండ, గుట్టలు, రాళ్లు, రప్పలేగా అనే నోళ్లకు నేడు మూతలు పడేలా పారిశ్రామిక సిరులు కురిపించనున్నారు. ఇప్పటికే రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు దివాకరపల్లిలో ఏర్పాటు కాగా, గుంటూరు లింగన్నపాలెంలో ఎంఎ్‌సఎంఈ ఆధ్వరం్యలో సూక్ష, చిన్నతరహా పరిశ్రమాలు ఏర్పాటు కానున్నాయి. రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుతో వేలాది ఎకరాల బీడుభూమలు కూడా ఆదాయసిరులుగా మారే అవకాశం ఈ ప్రాంత ప్రజలకు లభించింది. బీడుభూముల్లో పచ్చిగడ్డిని అమ్ముకున్నా ఆయా కంపెనీ నగదు చెల్లించనుంది. దీంతో దండగగా ఉన్న భూముల్లో నేడు పండగ అనేవిధంగా ప్రభుత్వం నిరూపించింది. ఇంకోపక్క సూక్ష, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుతో ఆయా పరిశ్రమల స్థాపనలో భాగమైన ఉద్యోగులు ఉపాది కోసం ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆయా గ్రామాల్లోని భూముల ధరలు పెరగటంతో పాటు ఇళ్ల నిర్మాణాలు పెరిగే అవకాశం ఉంది.
చకచకా ఏర్పాట్లు
పీసీపల్లి మండలంలోని గుంటూరులింగన్నపాలెం పరిధిలో ఎంఎ్‌సఎంఈ ద్వారా పరిశ్రమల స్థాపనకై సీఎం చంద్రబాబునాయుడు మంగళవారం ప్రారంభించనున్నారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. పైలాన్ ప్రారంభోత్సవం అనంతరం సీఎం చంద్రబాబు సభాస్థలికి వచ్చే మార్గం తారుతో రోడ్డు వేయించారు. సీఎం ప్రసంగించే సభాస్థలికి ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఆప్రాంతంలో గ్రీనరీ కోసం మూడు అడుగుల మేర ఉన్న చెట్లను ప్రత్యేకంగా తెప్పించి ప్రత్యేక మిషన్ ద్వారా చెట్లను నాటించారు. కార్యక్రమం వద్దకు వచ్చేవారికి అన్ని విధాలుగా మౌలిక వసతుల తో పాటు భోజనవసతి, పార్కింగ్ ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రారంభ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేందుకు సమీప గ్రామాల ప్రజలకు ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రనరసింహారెడ్డి ప్రత్యేక వాహానాలను ఏర్పాటు చేశారు. మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఇంటూరి నాగేశ్వరరావు, దామచర్లసత్య పనులను పర్యవేక్షించారు.
సీఎం పర్యటన షెడ్యూల్ వివరాలు
పీసీపల్లి మండలం గుంటూరు లింగన్నపాలెంలో మంగళవారంఎంఎ్‌సఎంఈ పార్క్‌ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు. ఆ పర్యటన వివరాలు ఇలా..
ఉదయం 9.30గంటలకు : తాడేపల్లి మండలం, ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు.
10.15గంటలకు : పీసీపల్లి మండలం, గుంటూరు లింగన్నపాలెం ఎంఎ్‌సఎంఈ పార్క్ సమీపంలోని హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు.
10.15నుండి 10.25 వరకు : ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి స్వాగతం పలుకుతారు.
ఉదయం 10.25గంటలకు: హెలిప్యాడ్ నుంచి కార్యక్రమ స్థలానికి బయలుదేరుతారు.
ఉదయం 10.35 నుంచి 12.15వరకు: ఎంఎ్‌సఎంఈ పార్క్(గుంటూరు లింగన్నపాలెం)ను ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఎంఎ్‌సఎంఈ పార్కులు, పలు పెట్టుబడి ప్రాజెక్టులు, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌లకు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. తదుపరి పారిశ్రామిక వేత్తలు, ఎంఎ్‌సఎంఈ పార్క్ ప్రతినిధులతో పాటు వివిధ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 12.15గంటలకు: కార్యక్రమాన్ని ముగిస్తారు.
12.25గంటలకు: హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
12.30గంటలకు: హెలికాప్టర్‌తో తిరుగు ప్రయాణం
1.15గంటలకు: తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.