‘అభివృద్ధే మా అజెండా’
ABN , Publish Date - Dec 24 , 2025 | 11:00 PM
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ అజెండా అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిఽథిగా విచ్చేసిన మంత్రి గ్రామస్థులతో మాట్లాడారు.
పలు పనుల ప్రారంభోత్సవాల్లో మంత్రి స్వామి
కురిచేడు, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి) : రాష్ట్రాభివృద్ధి, సంక్షేమమే తమ ప్రభుత్వ అజెండా అని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి చెప్పారు. కురిచేడు మండలం ఆవులమంద గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిఽథిగా విచ్చేసిన మంత్రి గ్రామస్థులతో మాట్లాడారు. రోడ్ల అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్నీ అమలు చేస్తున్నామన్నారు. ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా, పింఛన్ల పెంపు కార్యక్రమాలు ఇప్పటికే అమలు చేశామని గుర్తుచేశారు. త్వరలో అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చేందుకు హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. సంక్రాంతి అనంతరం అర్హులకు గృహాలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. దర్శి నియోజకవర్గంలో అభివృద్ధికి అధిక నిధులు విడుదల చేస్తున్నామన్నారు. డ్రైవింగ్ స్కూల్ నిర్మాణానికి రూ.20 కోట్లకు పైగా నిధుల మంజూరుకు కృషి చేశామన్నారు. అందరి కోరిక మేరకు నియోజకవర్గాన్ని జిల్లాలోనే ఉంచామన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అప్పులు చేస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు.
కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో దర్శిలో అధిక స్థానాలు గెలిపించాలని కోరారు. 2029 ఎన్నికలల్లో నూరు శాతం విజయం మనదేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. అందుకు తగ్గట్టుగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఇక్కడి నాయకులు 3 ఆర్వో ప్లాంటు అడిగారని, వెంటనే ఏర్పాటు చేస్తానన్నారు. గుండ్లకమ్మ నదిమీద బ్రిడ్జి ఏర్పాటుకు సీఎంతో మాట్లాడి నిధులు వచ్చేలా చూస్తానని చెప్పారు. నియోజకవర్గ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం సృష్టిస్తే ప్రజా ప్రభుత్వం అభివృద్ధే అజెండాగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ నాగవేణి సుబ్బారావు, కురిచేడు మండల పార్టీ అధ్యక్షుడు పిడతల నెమిలయ్య, మాజీ అధ్యక్షుడు కాట్రాజు నాగరాజు, సీనియర్ టీడీపీ నాయకులు దాసరి ఏడుకొండలు, కమతం నాగిరెడ్డి, గడ్డం బాలయ్య, షేక్ సునీల్, గొట్టిపాటి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభం
ఆవులమంద, కొత్తూరు గ్రామంలో కోటి రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం మంత్రి, ఎంపీతోపాటు ఎమ్మెల్యే ఉగ్ర, ఇన్‌చార్జి లక్ష్మిలు ప్రారంభించారు. కొత్తూరులో రూ.30 లక్షలతో సీసీరోడ్డు, రూ. 20 లక్షలతో మురుగు కాలువల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆవులమందలో ఉపాధిహామీ నిధులు రూ. 2.30 లక్షలతో గోకులం షెడ్డు, ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డును వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టిపాటి వెంకటేశ్వర్లు, నక్కా కోటి వీరయ్య, నక్కా ఆదినారాయణ పాల్గొన్నారు.