Share News

అభివృద్ధి ప్రదాత దామచర్ల ఆంజనేయులు

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:35 AM

అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలాంజనేయులు కొనియాడారు. రాష్ట్ర మార్కెటింగ్‌, దేవదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన రైతుల అభ్యున్నతి, ఆలయాల పవిత్రత కోసం కృషి చేశారన్నారు.

అభివృద్ధి ప్రదాత దామచర్ల ఆంజనేయులు
తూర్పునాయుడుపాలెంలో దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న మంత్రి స్వామి

టంగుటూరు (కొండపి), సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీబాలాంజనేయులు కొనియాడారు. రాష్ట్ర మార్కెటింగ్‌, దేవదాయ శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన రైతుల అభ్యున్నతి, ఆలయాల పవిత్రత కోసం కృషి చేశారన్నారు. ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా సోమవారం తూర్పునాయుడుపాలెంలో ఆయన విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాట్లాడుతూ నీతి, నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనం ఆంజనేయులు అని కీర్తించారు. కొండపి నియోజకవర్గ అభివృద్ధిలో ఆయన చెరగని ముద్ర వేశారన్నారు.

కుటుంబ సభ్యుల నివాళి..

దామచర్ల ఆంజనేయులు వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన మనవడు, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. తూర్పునాయుడుపాలెంలోని దివంగత ఎన్టీఆర్‌, దామచర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి సత్య నివాళులర్పించారు. దామచర్ల కుటుంబ సభ్యులైన టీడీపీ సీనియర్‌ నాయకుడు దామచర్ల పూర్ణచంద్రరావు, ఆయన సతీమణి విజయలక్ష్మి, దామచర్ల వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు.

పెద్దాయన ఆశయాలు కొనసాగిస్తాం - ఎమ్మెల్యే జనార్దన్‌

మాజీమంత్రి, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు ఆశయాలు కొనసాగిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ పేర్కొన్నారు. ఆంజనేయులు 18వ వర్ధంతి పురస్కరించుకుని సోమవారం ఒంగోలులో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల స్థానిక బాపూజీ మార్కెట్‌ కాంప్లెక్స్‌ వద్ద, పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్‌, ఆంజనేయులు విగ్రహాలకు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయంలోనూ, సమాజ సేవలోనూ తన తాత సేవలు చిరస్మరణీయం అన్నారు. నిగర్వి, నిడారంబరుడుగా మంచి పేరు పొందిన ఆయన స్ఫూర్తి బాట తమ కుటుంబానికి ఆదర్శం అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మేయర్‌ గంగాడ సుజాతతోపాటు పలువురు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - Sep 23 , 2025 | 12:35 AM