అభివృద్ధికి ఆకాంక్ష
ABN , Publish Date - Dec 21 , 2025 | 02:14 AM
కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ఎంపిక చేసిన రంగాల్లో అభివృద్ధికి దేశవ్యాప్తంగా కొన్ని ఆకాంక్షిత మండలాలను (ఆస్పిరేషనల్ బ్లాక్) ఎంపిక చేసింది. అందులో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 15 మండలాలు ఉన్నాయి.
ఆస్పిరేషనల్ బ్లాక్‌గా ఎర్రగొండపాలెం
నీతి అయోగ్ ద్వారా మారుతున్న రూపురేఖలు
రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 15 మండలాలు ఎంపిక
వాటిలో వైపాలెంకు చోటుకల్పించిన కేంద్రం
39 అంశాల్లో అభివృద్ధికి ప్రణాళిక
ఇప్పటికే 6 అంశాల్లో 100 శాతం లక్ష్యసాధన
త్రిపురాంతకం, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ద్వారా ఎంపిక చేసిన రంగాల్లో అభివృద్ధికి దేశవ్యాప్తంగా కొన్ని ఆకాంక్షిత మండలాలను (ఆస్పిరేషనల్ బ్లాక్) ఎంపిక చేసింది. అందులో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 15 మండలాలు ఉన్నాయి. వాటిలో ఎర్రగొండపాలెం మండలానికి చోటు దక్కింది. 2023 జనవరి నుంచి ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా మండలంలో చేపట్టిన పలు కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటివరకు వెనుకబడిన మండలంగా ఉన్న ఎర్రగొండపాలెం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. విద్య, ఆరోగ్యం, పోషణ, వ్యవసాయం, ఉపాధి వంటి కీలకరంగాలపై ప్రత్యేక దృష్టి సారించి పలు ప్రభుత్వ శాఖల సమన్వయంతో చేపట్టిన కార్యక్రమాల వల్ల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి.
6 అంశాల్లో 100 శాతం లక్ష్యసాధన
ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 39 అంశాల్లో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందులో ఇప్పటికే ఎర్రగొండపాలెం మండలంలో 6 అంశాల్లో నూరు శాతం లక్ష్య సాధనకు అధికారులు కృషి చేశారు. ఇప్పటివరకు పలు విషయాల్లో ప్రజలు కనీసం నమోదు చేయించుకోవాలనే అవగాహన కూడా లేదు. కానీ ఈ కార్యక్రమం ద్వారా బీపీ, షుగర్, గర్భిణిల నమోదు అంశాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. దీనివల్ల వారికి కొంత ఆర్థిక భరోసాతోపాటు వైద్య సహాయం అందే అవకాశాలు మెరుగుపడ్డాయి. ఏఎన్‌సీ నమోదు చేసిన గర్భిణుల శాతం పెంపు, హైపర్ టెన్షన్ స్ర్కీనింగ్ చేయించుకునే వ్యక్తుల శాతం, డయాబెటిక్ స్ర్కీనింగ్ చేసిన వ్యక్తులు, ఐసీడీఎస్ ద్వారా పోషకాహారం తీసుకునే గర్భిణుల శాతం, మట్టి నమూనా సేకరణకు లక్ష్యం అనుగుణంగా సాయిల్ హెల్త్ కార్డుల శాతం, రివాల్వింగ్ ఫండ్ పొందేలా స్వయం సహాయక సంఘాల శాతం పెంచడం వంటి వాటిలో నూరుశాతం లక్ష్యం సాధించారు. ఇందుకుగాను ప్రభుత్వం ఈనెల 8న ఒంగోలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో అధికారులు, సిబ్బందికి మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, జిల్లా కలెక్టర్ రాజాబాబు అవార్డులతో సత్కరించారు.
పరిశీలనకు కేంద్ర అధికారి నియామకం
ప్రతి ఆస్పిరేషనల్ బ్లాక్‌లో నిర్వహిస్తున్న కార్యక్రమాల అమలుతీరును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. అందులో భాగంగా ఎర్రగొండపాలెంకు ఐవోఎ్‌ఫఎస్ క్యాడర్ అధికారైన వీరగంధం శ్రీనివాసరావును నియమించింది. ఈయన కేంద్ర పశు సంరక్షణ, పాల ఉత్పత్తుల విభాగం డైరెక్టర్‌గా ఉన్నారు. కొద్దిరోజుల కిందట ఎర్రగొండపాలెం వచ్చిన ఆయన మండలంలోని విద్యా వ్యవస్థ తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే అంగన్‌వాడీ, స్వయం సహాయ సంఘాల తీరుతెన్నులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒంగోలులో కలెక్టర్‌తోపాటు జిల్లా అధికారులతో ఇక్కడ అమలుతీరుపై సమీక్ష నిర్వహించారు.
సాధించిన ర్యాంకుల ఆధారంగా నిధుల మంజూరు
కేంద్రం సూచించిన 39 సూచికల్లో సాధించిన ప్రగతిని ప్రతి మూడు నెలలకోసారి సమీక్షిస్తారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా బ్లాక్‌లలో సాధించిన పురోగతిని బట్టి ర్యాంకులను కేటాయించి వాటి ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.3కోట్ల వరకు నిధులను మంజూరు చేస్తారు. గత మూడునెలల్లో సంపూర్ణతా అభియాన్ సమరోహ్ కార్యక్రమం అమలు ప్రచారం, 6 అంశాల లక్ష్య సాధనకు గాను కేంద్ర ప్రభుత్వం గోల్డ్ మెడల్‌ను ఎర్రగొండపాలెంకు ప్రకటించింది. సాధనకు సహకరించిన సిబ్బందిని సత్కరించేందుకు అవసరమైన కార్యక్రమం ఏర్పాటుకు రూ.5లక్షల ప్రోత్సాహాన్ని అందించింది. ఆస్పిరేషనల్ బ్లాక్ ద్వారా విద్య, ఆరోగ్యం, పోషణ, మౌలిక వసతులు వంటి కీలక రంగాల్లో ప్రభుత్వ అధికారుల సమన్వయం, భాగస్వామ్యం వల్ల అనుకున్న లక్ష్య సాధనతో ఎర్రగొండపాలెం బ్లాక్ ముందుకు వెళ్తోంది. ఇది కేవలం గణాంకాల విజయం కాకుండా ప్రజల జీవన ప్రమాణాల్లో అనుకున్న లక్ష్యం మేరకు మెరుగుదల కావాలని కేంద్రం ఆకాంక్ష.