Share News

రుచిగా.. శుచిగా...!

ABN , Publish Date - Nov 27 , 2025 | 11:00 PM

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆదరణ పెరిగింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన పథకంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. బడులకు వచ్చే పేద విద్యార్థులకు రుచికరంగా, శుచికరంగా నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంది.

రుచిగా.. శుచిగా...!
కొత్తగోళ్లవిడిపిలోని జెడ్‌పీహెచ్‌ఎ్‌సలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులు

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి పెరిగిన ఆదరణ

వైసీపీ హయాంలో విద్యార్థుల సగటు శాతం 80

ప్రజా ప్రభుత్వం వచ్చాక 98 శాతానికి పెరిగిన వైనం

గతంలో అన్నం లావుగా, మెత్తగా ఉండేదంటున్న విద్యార్థులు

ఈ ఏడాది నుంచి సన్న బియ్యంతో ఆహారం వండుతుండడంపై హర్షం

ఎర్రగొండపాలెం రూరల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆదరణ పెరిగింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మధ్యాహ్న భోజన పథకంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. బడులకు వచ్చే పేద విద్యార్థులకు రుచికరంగా, శుచికరంగా నాణ్యమైన భోజనం అందించేలా చర్యలు తీసుకుంది. ఈ ఏడాది నుంచి పాఠశాలలకు సన్నబియ్యం సరఫరా చేస్తోంది. దీంతో పాఠశాలల్లో మధ్యాహ్న బోజనం తినేవారే సంఖ్య గణనీయంగా పెరిగిందని విద్యాశాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి.

ఎర్రగొండపాలెం మండలం వ్యాప్తంగా ప్రాథమిక పాఠశాలలు 49, ప్రాథమికోన్నత పాఠశాలలు 3, ఉన్నత పాఠశాలలు 10 ఉండగా మొత్తం అన్ని పాఠశాలలు కలిపి 62 ఉన్నాయి. వీటిల్లో మొత్తం 6,579 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సగటున 5,346 హాజరు కాగా 5,251 మంది విద్యార్థులు మధ్యాహ్నభోజనానికి హాజరవుతారని అధికారులు తెలిపారు. సన్న బియ్యం సరఫరాకు ముందు మధ్యాహ్న భోజనం తినే విద్యార్థుల 80 శాతం ఉంటే ప్రస్తుతం 98 శాతం ఉందని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు.


జూనియర్‌ కాలేజీలో కూడా 97శాతం

గత వైసీపీ పాలనలో జూనియర్‌ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పథకాన్ని నిలిపివేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరిగి ఆ పథకాన్ని అమలు చేసింది. కళాశాలలో మొత్తం విద్యార్థులు 226కు గాను సగటున 180 హాజరు కాగా 175 మంది 97 శాతం విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

పెరిగిన వంట చార్జీలు

మధ్యాహ్న భోజనం(వంట చేసే) వారి ఇబ్బందులు, పెరిగిన కూరగాయలను దృష్టిలో ఉంచుకోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి చార్జీలు కూడా పెంచడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రజా ప్రభుత్వంలో విద్యార్థులకు మంచి రుచికర, నాణ్యమైన భోజనాలు అందించడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యాశాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Updated Date - Nov 27 , 2025 | 11:00 PM