దశాబ్దాల కల సాకారం
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:32 PM
ఎంతో కాలంగా క్రీడాప్రాంగణం కోసం ఎదురు చూస్తున్న క్రీడాకారుల కల సాకారమైంది.
పర్చూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : ఎంతో కాలంగా క్రీడాప్రాంగణం కోసం ఎదురు చూస్తున్న క్రీడాకారుల కల సాకారమైంది. పర్చూరులో రూ.2కోట్ల పైచిలుకు నిధులతో ఏర్పాటు చేసిన మినీ స్టేడియం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. గ్రామీణ క్రీడాకారులకు నైపుణ్యాన్ని పెంపొందించి జాతీయస్ధాయిలో తీర్చిద్దాలన్న సంకల్పం తో పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు ప్రత్యేక దృష్టి సారించారు. దీనిలో భాగంగా నియోజక వర్గ కేంద్రంలో క్రీడావికాస కేంద్రం నెలకొల్పేలా నాటి టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రూ.2కోట్ల నిధులలో 2018 జూన్‌లో యార్లగడ్డ ఉమాదేవి, యార్లగడ్డ రామనాథంబాబు అందించిన ప్రాంగణంలో శంకుస్ధాపన చేసి పనులు ప్రారంభించారు. అయితే నిర్మాణ పనులు పూర్తి అయ్యే దశలో 2019లో ఎన్నికలు రావడంతో వైకాపా ప్రభు త్వం అధికారం చేపట్టింది. దీంతో స్టేడియం నిర్మాణం గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. కొద్దిపాటి నిధులు కేటాయించి వినియోగంలోకి తీసుకువచ్చే క్రీడాప్రాంగణం ముళ్లచెట్లు చిల్లచెట్లతో నిరుపయోగం గా మారింది. కోట్లు వెచ్చించి క్రీడాకారుల కోసం నిర్మించిన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం గత ఐదేళ్ల వైసీపీ ప్రాలనలో నిర్లక్ష్యానికి గురైంది. కనీసం ప్రారంభానికి కూడా నోచుకోక నిరుపయోగంగా మారింది. ప్రజాకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడా వికాస కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకువచ్చే విధంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక దృష్టిసారించారు. దీనిలో భాగంగా స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (శాప్) ఆధ్వ ర్యంలో రూ.25లక్షల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో అత్యాధునిక సదుపాయాలతో ప్రాంగణం రూపుదిద్దుకుంది. టార్బాలిన్, విద్యుత్, క్రీడాకారులు వేచి ఉండే గదులతోపాటు, మెరుగైన వసతులు కల్పించే విధంగా స్టేడియాన్ని తీర్చిదిద్దారు.
రేపు ప్రారంభోత్సవం
క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన ఎన్టీ ఆర్ మినీ స్టేడియం పూర్తిస్థాయి నిర్మాణం పూర్తయ్యింది. ఈ నెల 22న స్థానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయనున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఏర్పాట్లుకు సంబంఽధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి.