Share News

మృత్యుగుంత

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:23 AM

చెరువులోని నీటి గుంత ఇద్దరు విద్యార్థులను బలి తీసుకుంది. మండలంలోని చిన్నగుడిపాడులో శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటనలో జమ్మిదోర్నాల గ్రామానికి చెందిన పులిగుజ్జు అద్భుత్‌కుమార్‌ (16), పులిగుజ్జు పవన్‌ (14)మృతి చెందారు.

మృత్యుగుంత
అద్భుత్‌కుమార్‌, పవన్‌ మృతదేహాల వద్ద బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు

చెరువులో ఈతకు దిగి ఇద్దరు విద్యార్థుల మృతి

తల్లడిల్లుతున్న రెండు కుటుంబాలు

జమ్మిదోర్నాలలో విషాదం

పెద్దదోర్నాల, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : చెరువులోని నీటి గుంత ఇద్దరు విద్యార్థులను బలి తీసుకుంది. మండలంలోని చిన్నగుడిపాడులో శుక్రవారం జరిగిన ఈ దుర్ఘటనలో జమ్మిదోర్నాల గ్రామానికి చెందిన పులిగుజ్జు అద్భుత్‌కుమార్‌ (16), పులిగుజ్జు పవన్‌ (14)మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జమ్మిదోర్నాల ఎస్సీకాలనీకి చెందిన అద్భుత్‌కుమార్‌ దోర్నాలలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం, పవన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నారు. సెలవులు కావడంతో వారు ఇంటికి వచ్చారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి చిన్నగుడిపాడు చెరువులోని గుంతల్లోకి నీరు చేరిందని తెలుసుకుని అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురు స్నేహితులతో కలిసి మధ్యాహ్నం సమయంలో చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. తొలుత అద్భుత్‌కుమార్‌, పవన్‌ గంతలోకి దిగారు. ఆ వెంటనే లోపలికి జారిపోయారు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో మిగిలిన ముగ్గురూ పరుగెత్తుకుంటూ గ్రామంలోకి వెళ్లి విషయం స్థానికులకు తెలిపారు. కొందరు ఈతగాళ్లు నీటి గుంతలోకి దిగి ఇద్దరు చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్సై మహేష్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి కేసు నమోదు చేశారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. అద్భుత్‌కుమార్‌కు తల్లిదండ్రులు పెద్ద పోలయ్య, మేరిరాణి,తమ్ముడు, చెల్లి ఉన్నారు. పవన్‌ తండ్రి నాలుగేళ్ల క్రితమే చనిపోయాడు. తల్లి రాగట అంధురాలు. తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చేతికంది వచ్చిన కొడుకు కన్నీటిని మిగిల్చాడు

పులిగుజ్జు అద్భుత్‌కుమార్‌ కుటుంబం కూలికి వెళ్తేనే రోజు గడిచేది. తల్లి సమీప గ్రామాల్లో కూలి పనులకు వెళ్తుంది. తండ్రి పెద్ద పోలయ్య శ్రీశైలంలో హమాలీగా పనిచేస్తున్నాడు. అద్భుత్‌కుమార్‌తో పాటు మరో కుమారుడు పవన్‌ దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె గ్రేసియా 6వ తరగతి కస్తూర్బా గురుకుల పాఠశాలలో చదువుతోంది. విషయం తెలుసుకొని శ్రీశైలం నుంచి గ్రామానికి చేరుకున్న తండ్రి విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి చేతికంది వచ్చిన బిడ్డను ఇలా చూస్తాననుకోలేదని రోదించడం అందరినీ కలిచి వేసింది. తల్లి మేరి దుఃఖానికి అవధుల్లేకుండా పోయింది.

నాకు దిక్కెవరూరా....తండ్రీ

నీటిగుంతకు బలైన మరో విద్యార్థి పులిగుజ్జు పవన్‌కు తండ్రి నాలుగేళ్ల క్రితమే మృతిచెందాడు.తల్లి అంధురాలు. ఆమె కూలి పనికి కూడా వెళ్లలేని పరిస్థితి. పవన్‌ చెల్లెలు పావని కస్తూర్బా స్కూలులో 6వ తరగతి చదువుతోంది.తమ్ముడు భరత్‌ గ్రామంలోనే ఎలిమెంటరీ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. ఇంటికి పెద్ద కుమారుడైన పవన్‌ అర్ధంతరంగా చనిపోవడంతో తల్లి రాగట తల్లడిల్లిపోయింది. నీటిగుంతకు బలైయ్యావా కొడుకా... నాకు దిక్కెవరురా తండ్రీ... అంటూ కన్నీరుమున్నీరైంది.

కుటుంబాలను ప్రభుత్వం దత్తత తీసుకోవాలి

చెరువులో అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడ్డ గుంతకు బలైన ఇద్దరు విద్యార్థులు ఇంటికి పెద్ద వారు కావడం గమనార్హం. రెండు కుటుంబాలుకూలి చేస్తేనే పూట గడిచేది. కూటమి ప్రభుత్వం పేదరికాన్ని రూపుమాపేందుకు చేపట్టిన పీ4 ద్వారా ఈ రెండు కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Aug 09 , 2025 | 01:23 AM