Share News

ఈ క్రాప్‌ నమోదుకు గడువు పెంపు

ABN , Publish Date - Oct 07 , 2025 | 01:22 AM

ఖరీఫ్‌ ఈ-క్రాప్‌ నమోదుకు ప్రభుత్వం గడువు పొడి గించింది. తొలుత సీజన్‌ ముగిసే సెప్టెంబరు 30 వరకే గడువు ఇచ్చింది. అయితే సగం విస్తీర్ణం వివరాలు కూడా నమోదు కాలేదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండటంతో ఈనెల 25 వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ క్రాప్‌ నమోదుకు గడువు పెంపు
ముండ్లమూరులో ఈ-పంట నమోదును పరిశీలిస్తున్న డీఏవో శ్రీనివాసరావు(ఫైల్‌)

30లోపు ఆర్‌ఎస్‌కేలలో జాబితాలు

ఇప్పటివరకు 48.98శాతం నమోదు

అత్యధికంగా మద్దిపాడులో 80 శాతం

పలు మండలాల్లో వెనుకబాటు

ఒంగోలు, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌ ఈ-క్రాప్‌ నమోదుకు ప్రభుత్వం గడువు పొడి గించింది. తొలుత సీజన్‌ ముగిసే సెప్టెంబరు 30 వరకే గడువు ఇచ్చింది. అయితే సగం విస్తీర్ణం వివరాలు కూడా నమోదు కాలేదు, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే ఉండటంతో ఈనెల 25 వరకు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వపరంగా రైతులకు ఇచ్చే రాయితీలు, ఇతరత్రా అన్ని విషయాల్లోనూ ఈక్రాప్‌ నమోదు ప్రధానమైనదన్న విషయం విదితమే. గతంలో కేవలం పంటల సాగు విస్తీర్ణాన్ని మాత్రమే ఈ క్రాప్‌ నమోదు చేసేవారు. ఈ ఏడాది నుంచి పంటలు సాగు జరిగినా, లేకపోయినా.. ప్రభుత్వ, బీడు భూములు అయినా ఒక్క ఫారెస్టు భూమి మినహా సర్వే నంబరు కేటాయించిన అన్నిరకాలను ఈ పంట నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో నమోదు ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో వెబ్‌ల్యాండ్‌ ప్రకారం మొత్తం 15,36,444 ఎకరాల భూమి ఈ-పంటలో నమోదు చేయాల్సి ఉంది. ఆ మేరకు ప్రభుత్వం నుంచే మండలాల వారీ భూవిస్తీర్ణం వివరాలు వ్యవసాయ శాఖకు అందాయి. అందులో ఇప్పటివరకు 7,40,416 ఎకరాల (48.98శాతం) విస్తీర్ణం వివరాలను అధికారులు నమోదు చేశారు. తొలుత గడువు ఇచ్చిన సెప్టెంబరు ఆఖరు వరకు చూస్తే 45శాతం మాత్రమే నమోదైనట్లు సమాచారం. కొన్ని మండలాల్లో వేగవంతంగా సాగుతున్నా మరికొన్ని మండలాల్లో తీవ్రజాప్యం జరుగుతోంది.

అత్యధికంగా మద్దిపాడు మండలంలో 80.08శాతం నమోదు

అధికార వర్గాల సమాచారాన్ని బట్టి జిల్లాలో అత్యధికంగా మద్దిపాడు మండలంలో 80.08శాతం ఈ-క్రాప్‌ నమోదైంది. అది ఎర్రగొండపాలెంలో 76.50శాతం, గిద్దలూరులో 72.21శాతం, ఎన్‌జీపాడులో 69.98శాతం, త్రిపురాంతకంలో 63.73శాతంగా ఉంది. అత్యల్పంగా దర్శి మండలంలో 33.08శాతం విస్తీర్ణంలో నమోదవగా పుల్లలచెరువులో 33.63శాతం, తాళ్లూరులో 34.84శాతం, తర్లుపాడులో 34.87శాతం, సీఎస్‌పురంలో 35.98శాతం చేశారు. ఈనేపథ్యంలో ఈనెల 25 వరకు ప్రభుత్వం గడువు పెంచింది. ఆ వివరాలను గ్రామస్థాయిలోని రైతు సేవా కేంద్రాలలో ఈనెల 26 నుంచి 30 వరకు ప్రచురించి లోటుపాట్లు ఉంటే సవరిస్తారు. అనంతరం 31న తుది జాబితాలను ప్రచురిస్తారు. పెంచిన సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ-పంట నమోదు ప్రక్రియను సకాలంలో పూర్తిచేయాలని సిబ్బందికి జిల్లా వ్యవసాయశాఖ అధికారి (డీఏవో) సీహెచ్‌.శ్రీనివాసరావు సూచించారు. అలాగే రైతులు కూడా సిబ్బందికి సహకరించాలని కోరారు.

Updated Date - Oct 07 , 2025 | 01:22 AM