కొత్త జిల్లాలపై ముహూర్తం ఖరారు
ABN , Publish Date - Oct 26 , 2025 | 11:25 PM
జిల్లాల పునర్వ్యవస్థీకరణను పూర్తిచేసే ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే జనవరి నాటికే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ఈ అంశంపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమావేశం కాబోతున్నారు. నవంబరు 7వ తేదీ జరగనున్న రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే తొలిసారిగా చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘంతో భేటికానున్నారు.
మార్కాపురం, కందుకూరు, అద్దంకిపై ఇచ్చిన హామీకి అనుగుణంగా నిర్ణయం
రేపు మంత్రివర్గ సబ్‌కమిటీతో సీఎం సమావేశం
7వ తేదీ సమావేశంలో చంద్రబాబు తుదినిర్ణయం
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
జిల్లాల పునర్వ్యవస్థీకరణను పూర్తిచేసే ప్రక్రియను రాష్ట్రప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే జనవరి నాటికే ఈ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా ఈ అంశంపై ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమావేశం కాబోతున్నారు. నవంబరు 7వ తేదీ జరగనున్న రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఈ విషయంపై సమీక్షించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అందులో భాగంగానే తొలిసారిగా చంద్రబాబు మంత్రివర్గ ఉపసంఘంతో భేటికానున్నారు.
గత సాధారణ ఎన్నికలకు ముందు చంద్రబాబుతో పాటు ముఖ్యనేతలు జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీల అమలుతో ముందున్నామని ప్రకటించుకున్న రాష్ట్రప్రభుత్వం ఈ విషయంలోనూ మరో ముందడుగు వేసి జనవరి నాటికి హామీని పూర్తిచేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. అంతేగాక కులగణన ప్రారంభానికి ముందే జిల్లాల పునర్వ్యవస్థీకరణ విషయంలో సాంకేతికంగా ముందుకు పోవాల్సిన అవసరం ఏర్పడిందని కూడా అంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల సీసీఎల్‌ఏ ఉన్నతాధికారులు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాలు, జిల్లా మార్పులపై నివేదిక పంపాలని కోరిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరును, బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాలను ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలో కలిపేందుకు అవసరమైన ప్రతిపాదనలు తీసుకున్నారు.
మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రెడీ
రాష్ట్రమంత్రివర్గ ఉపసంఘం కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాల జిల్లాల చేర్పులు, మార్పులపై ఇప్పటికే ఒక నివేదికను రూపొందించింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, సమాచార శాఖ మంత్రి పార్థసారథి, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ తదితర మంత్రులతో సబ్ కమిటీని గతంలోనే ముఖ్యమంత్రి నియమించారు. వారు ఆయా ప్రతిపాదనలపై పరిశీలన చేసి నివేదికను తయారుచేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికొస్తే ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేష్, పవన్‌కళ్యాణ్ తదితరులు ఇచ్చిన హామీలను కూడా దృష్టిలో ఉంచుకుని ఒక నివేదికను తయారుచేశారు. మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు, అందులో మార్కాపురం, వై.పాలెం, గిద్దలూరు, కనిగిరి, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాలను కలపాలని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నట్లు తెలిసింది. ఇటీవల మార్కాపురం ప్రాంతంలో కొందరు నాయకులు లేవనెత్తిన శ్రీశైలం మండలాన్ని మార్కాపురంలో చేర్చాలనే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం తోసిపుచ్చినట్లు తెలిసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్కాపురం జిల్లా ఏర్పాటే ముఖ్యమని వివాదాల్లోకి వెళ్లి సమస్యను పక్కదారి పట్టించటం సమంజసం కాదని మంత్రివర్గ ఉపసంఘం కూడా భావించినట్లు సమాచారం. ఈ విషయమై మంత్రివర్గ ఉపసంఘంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక కీలకమంత్రి ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఈ ఐదు నియోజకవర్గాలతోనే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారని ప్రస్తుతం తమ పరిశీలనలో కూడా అదే సమంజసమని నిర్ధారణ అయిందని, తదనుగుణంగానే ముందుకు పోతున్నామని చెప్పటం విశేషం. కందుకూరు, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒంగోలు కేంద్రంగా ప్రకాశం జిల్లాలో కలపటం కూడా సమంజసమని గుర్తించినట్లు ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి మంగళవారం సమావేశానికి ఆహ్వానించినందున తమ నివేదికను ఆయనకు సమర్పిస్తామని, తుదినిర్ణయం ఆయన అభిప్రాయానికి అనుగుణంగా మంత్రివర్గ సమావేశంలో తీసుకునే అవకాశం ఉందని కూడా తెలిపారు. రాష్ట్రమంత్రివర్గ సమావేశం 7వ తేదీ జరగనుండటం, ఇప్పటికే మంత్రివర్గ సబ్‌కమిటీ నివేదిక తయారవటంతో పాటు జిల్లాల కలెక్టర్ల నుంచి కూడా ప్రత్యేక నివేదికలను ఉన్నతాధికారులు తెప్పించుకున్నందున మంగళవారం ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్ష, ఆ తర్వాత జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ విషయంలో పూర్తిస్పష్టత అధికారికంగా రావచ్చని భావిస్తున్నారు.