Share News

ప్రకాశంలోనే దర్శి?

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:57 PM

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా అలాగే కొనసాగే అవకాశాలు మెరుగుపడ్డాయి. కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలోకి దర్శిని కలపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ తాజా పరిణామాలను బట్టి చూస్తే ఆ నియోజకవర్గం ప్రకాశంలోనే కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ప్రకాశంలోనే దర్శి?

పరిగణనలోకి సాగునీటి వనరులు, రవాణా సౌకర్యం

అధికారుల నివేదికలో స్పష్టం

తాజాగా నేతల నుంచి అదే విజ్ఞప్తి

తర్జనభర్జన అనంతరం సీఎం నిర్ణయానికి వదిలేసిన సబ్‌ కమిటీ

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్న దర్శి అసెంబ్లీ నియోజకవర్గం జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనంతరం కూడా అలాగే కొనసాగే అవకాశాలు మెరుగుపడ్డాయి. కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలోకి దర్శిని కలపాలన్న ప్రతిపాదన ఉన్నప్పటికీ తాజా పరిణామాలను బట్టి చూస్తే ఆ నియోజకవర్గం ప్రకాశంలోనే కొనసాగే సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశంలో పలు చేర్పులు, మార్పులకు మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సు చేస్తోంది. పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు అవసరమన్న అభిప్రాయానికి వచ్చింది. నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు, బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాలను ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశంలో కలపాలన్న ప్రజల ఆకాంక్షను కూడా సబ్‌కమిటీ గుర్తించింది.

ఆరంభంలో అనుకున్నట్లు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాన్ని కొత్తగా ఏర్పాటయ్యే మార్కాపురం జిల్లాలో చేర్చాలా? లేకా ప్రకాశంలోనే కొనసాగించాలా? అన్న అంశం తెరపైకి వచ్చింది. ప్రజలు, ప్రజాప్రతినిధులతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల అభిప్రాయాలను కూడా నివేదికల రూపంలో ఇవ్వాలని మంత్రివర్గ సబ్‌కమిటీ కోరింది. ఆ ప్రకారం కలెక్టర్‌ నుంచి వెళ్లిన ప్రతిపాదనలో దర్శిని ప్రకాశంలోనే కొనసాగించాల్సిన అవసరం ఉంని పేర్కొన్నారు. మార్కాపురం కేంద్రంగా నాలుగు నియోజకవర్గాలను కలిపి జిల్లాను ఏర్పాటు చేయాలని సూచించారు. తాజాగా దర్శికి చెందిన రాజకీయ నేతలు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి కూడా నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలన్న వినతులు కూడా ప్రభుత్వానికి అందాయి. ఇదే విషయమై ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి ఇటు అధికారులతోపాటు రాష్ట్ర మంత్రులను కలిసి కూడా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి వర్గ ఉపసంఘ చైర్మన్‌ అనగాని సత్యప్రసాద్‌, ఇతర మంత్రులు... జిల్లాతో సంబంధం ఉన్న ఇతర మంత్రులు గొట్టిపాటి రవికుమార్‌, శ్రీబాలవీరాంజనేయస్వామితోపాటు టీడీపీ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడినట్లు తెలిసింది. తదనుగుణంగా వారు మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు జరగాలని సూచిస్తూనే దర్శి విషయంలో తాజాగా వచ్చిన ప్రతిపాదనలు కూడా పరిశీలించాలని కోరినట్లు తెలిసింది.

సాగునీటి వనరులు, రవాణా

రవాణా సౌకర్యం, సాగునీటి వనరులతో ఉన్న సంబంధాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుని దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశంలో ఉంచాలన్న అభిప్రాయానికి ఉపసంఘం సభ్యులు వచ్చినట్లు తెలుస్తోంది. తాళ్లూరు, ముండ్లమూరు మండలాలు పూర్తిగా, దర్శి మండలంలో 90 శాతానికిపైగా గ్రామాలకు రవాణా సౌకర్యం ఒంగోలుకే సులువుగా ఉంది. కురిచేడు మండల కేంద్రం నుంచి నేరుగా అద్దంకికి రహదారి సౌకర్యం ఉంది. దొనకొండ మండలంలోని ఎక్కువ గ్రామాలకు కురిచేడు మండలంలోని కొన్ని గ్రామాలకు మాత్రమే మార్కాపురానికి వెళ్లేందుకు సులువుగా ఉంటుంది. మరోవైపు సాగర్‌ కుడి కాలువ దర్శి నియోజకవర్గం నుంచి సంతనూతలపాడు, ఒంగోలు నియోజకవర్గాల్లోకి ప్రవేశిస్తుంది. కీలకమైన ఓబీసీకి దర్శి బ్రాంచ్‌ కెనాల్‌ నుంచే నీరు రావాలి. ఆ రకంగా చూసినా దర్శి ప్రకాశం జిల్లాలో ఉండడమే సమంజసమన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. తాజాగా అద్దంకిని రెవెన్యూ డివిజన్‌ చేయాలన్న ప్రతిపాదన వచ్చినందున దర్శి నియోజకవర్గం మొత్తాన్ని అద్దంకిలో కలిపి ఆ రెండు నియోజకవర్గాలను ప్రకాశంలో ఉంచాలన్న అధికారుల ప్రతిపాదనను కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

Updated Date - Nov 09 , 2025 | 10:57 PM