Share News

కూలీల బతుకుల్లో చీకట్లు

ABN , Publish Date - May 14 , 2025 | 01:11 AM

పొట్టకూటి కోసం కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగించే కుటుంబాల బతుకులు చీకటయ్యాయి. ఒకే గ్రామంలో రెండు కుటుంబాల్లోని భార్యభర్తలు మృత్యువాతపడ్డారు. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు.

కూలీల బతుకుల్లో చీకట్లు
వినుకొండ వైద్యశాల వద్ద విలపిస్తున్న రమణారెడ్డి కుటుంబసభ్యులు (ఇన్‌సెట్‌లో) రమణారెడ్డి, సుబ్బమ్మ (ఫైల్‌), అంకమ్మ, రామాంజి పెళ్లినాటి ఫొటో

రోడ్డు ప్రమాదంలో రెండు కుటుంబాల్లోని భార్యాభర్తలు మృతి

పల్నాడు జిల్లాలో ఘటన

గడ్డమీదపల్లిలో విషాదం

ఎర్రగొండపాలెం రూరల్‌ మే 13 (ఆంధ్రజ్యోతి) : పొట్టకూటి కోసం కూలి పనులకు ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగించే కుటుంబాల బతుకులు చీకటయ్యాయి. ఒకే గ్రామంలో రెండు కుటుంబాల్లోని భార్యభర్తలు మృత్యువాతపడ్డారు. దీంతో వారి పిల్లలు అనాథలయ్యారు. ఎర్రగొండపాలెం మండలం గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన పలువురు కూలీలు పనుల కోసం పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలో బొప్పాయి కాయలు కోసేందుకు రెండు వాహనాల్లో మంగళవారం ఉదయం గ్రామం నుంచి బయల్దేరారు. అప్పటి వరకు సరదాగా మాట్లాడుకుంటున్న వారి జీవితాల్లోకి ప్రమాదం మంచుకొచ్చింది. వినుకొండ మండలం శివాపురం సమీపంలో జాతీయ రహదారిపై బొలోరోను ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గడ్డమీదపల్లి గ్రామానికి చెందిన పగడాల సుబ్బమ్మ (38), బొట్టు అంకమ్మ (28) అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన పగడాల రమణారెడ్డి (45), బొట్టు రామాంజి (34)ను వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. ఒకే గ్రామానికి చెంది న వీరు నలుగురూ భార్యాభర్తలు కావడం తో విషాదచాయలు అలముకున్నాయి.

అనాథలైన పిల్లలు

బొట్టు అంకమ్మది గడ్డమీదపల్లి స్వగ్రామం. కాగా పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం దాపల్లె గ్రామానికి చెందిన రామాంజితో వివాహమైంది. అయితే అక్కడి నుంచి అంకమ్మ స్వగ్రామానికి కుటుంబంతో సహా వచ్చారు. ఇక్కడే ఇద్దరూ కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆరేళ్ల పవన్‌కుమార్‌, నాలుగు సంవత్సరాల నాగ చైతన్య ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ మృతి చెందడంతో ఆ చిన్నారులు అనాథలుగా మారారు. వారి మృతదేహాలను వినుకొండ నుంచి స్వగ్రామమైన దాపల్లెకు తరలించినట్లు గ్రామస్థులు తెలిపారు. పగడాల రమణారెడ్డి, సుబ్బ మ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దమ్మాయికి వివాహమైంది. కుమారుడు వెంకటరెడ్డి బీఫార్మసీ చదువుతున్నాడు. మరో అమ్మాయి నవిత ఇంటర్‌ పూర్తి చేసింది. తల్లిదండ్రులు మృత్యువాత పడడంతో వారు పెద్ద దిక్కు లేక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. మృతదేహాలను చూసేందుకు గ్రామ ప్రజలు తరలివచ్చారు.

Updated Date - May 14 , 2025 | 01:12 AM