పొద్దుపొద్దునే ప్రమాదం
ABN , Publish Date - Jun 15 , 2025 | 11:18 PM
బొప్పాయి కూలీలతో వెళ్తున్న వాహనం ఎదురు వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, 26 మంది కూలీలు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఎర్రగొండపాలెం మండంలోని జాతీయరహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

కూలీలతో వెళ్తున్న మినీ లారీ టైర్ పంక్చరు
అదుపు తప్పి ఎదురు వస్తున్న మామిడి కాయల వాహనం ఢీ
తెలంగాణాకు చెందిన డ్రైవర్ మృతి
26 మంది కూలీలకు గాయాలు
వారిలో ఐదుగురి పరిస్థితి విషమం
అనకుంట వద్ద ఘటన
ఎర్రగొండపాలెం రూరల్, జూన్ 15 (ఆంధ్రజ్యోతి) : బొప్పాయి కూలీలతో వెళ్తున్న వాహనం ఎదురు వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా, 26 మంది కూలీలు గాయపడ్డారు. ఈ ప్రమాదం ఎర్రగొండపాలెం మండంలోని జాతీయరహదారిపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగొండపాలెం మండలం చెన్నరాయినిపల్లికి చెందిన సుమారు 30 మంది కూలీలు మినీ లారీలో మార్కాపురం సమీపంలోని పలు గ్రామాల్లో బొప్పాయి కాయల కోతకు బయలుదేరారు. జాతీయరహదారిపై కొత్తపల్లి సమీపంలోని అనకుంట వద్ద మినీ లారీ టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి ఎదురుగా తిరుపతి నుంచి గురజాల వైపు మామిడి పండ్ల లోడుతో వస్తున్న లగేజీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాగర్‌కర్నూలు జిల్లా తుడూరు మండలం, చర్ల తిరుమూర్‌పూర్ గ్రామానికి చెందిన షీలా కుమార్‌స్వామి(42) అక్కడికక్కడే వాహనంలో ఇరుక్కొని మృతి చెందారు.
లారీలో ఉన్న కూలీలతోపాటు లగేజీ వాహనం డ్రైవర్‌తో సహా 26 మందికి తీవ్ర, స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను 108 వాహనంలో వైపాలెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురితోపాటు లగేజీ వాహన డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో మార్కాపురం, స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
తీవ్రంగా గాయపడిన వారిలో...
రోడ్డు ప్రమాదంలో గాయపడిన చెన్నరాయినిపల్లికి చెందిన కూలీల్లో కాటినేని చిన్నలత, మేకల రవణమ్మ, నల్లబోతుల ఆదిలక్ష్మమ్మ, నల్లబోతుల పెద్దమలయ్య, నల్లబోతుల తిమ్మయ్య, కాటినేని రత్తాలు, కాటినేని వరలక్ష్మి, మేకల చెన్నమ్మ, వన్నెబోయిన అనిల్, పెద్దబాబు, ఎం ఏసోబు, ఎం దీప్తీ, వీ వెంకటనారాయణ, డీ రమేష్ నాయక్, ఎం లింగయ్య, కే చెన్నకేశవులు, ఎస్ వెంకటరవణ, ఎం శ్రీను, కే చెన్నయ్య, బీ యల్లయ్యతో పాటు లగేజీ వాహన డ్రైవర్, తెలంగాణ రాష్ట్రం మిర్యాల గూడెంకు చెందిన సందీప్, క్లీనర్ గురజాలకు చెందిన షేక్ సైదాకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ చౌడయ్య ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతి చెందిన కుమార్ స్వామికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.