వ్యాపారులపై సైబర్ వల
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:41 PM
రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది.. అత్యవసర చికిత్స చేయించాలి.. గాయపడ్డవారి వద్ద చేతిలో నగదు ఉంది.. ఫోన్‌పేలో డబ్బులు ఉంటే పంపండి అందజేస్తామని పోలీస్ శాఖకు చెందిన ఏఎ్‌సఐ ఆనందరెడ్డి పేరున వ్యాపారులకు ఫోన్ వచ్చింది. అది నమ్మి ఇద్దరు వ్యాపారులు సదరు వ్యక్తి ఫోన్‌పేకు రూ.లక్షా 35వేలు కొట్టి మోసపోయారు.
తాళ్లూరు ఏఎస్సైనంటూ ఫోన్
ప్రమాదంలో ఉన్న మహిళకు వైద్య చికిత్సల కోసం డబ్బులు సాయం
నమ్మి ఫోన్ పే చేసిన వైనం
తాళ్లూరు, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో మహిళ తీవ్రంగా గాయపడింది.. అత్యవసర చికిత్స చేయించాలి.. గాయపడ్డవారి వద్ద చేతిలో నగదు ఉంది.. ఫోన్‌పేలో డబ్బులు ఉంటే పంపండి అందజేస్తామని పోలీస్ శాఖకు చెందిన ఏఎ్‌సఐ ఆనందరెడ్డి పేరున వ్యాపారులకు ఫోన్ వచ్చింది. అది నమ్మి ఇద్దరు వ్యాపారులు సదరు వ్యక్తి ఫోన్‌పేకు రూ.లక్షా 35వేలు కొట్టి మోసపోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకెళ్తే... మూడు రోజుల కిత్రం తాళ్లూరులోని విత్తనాల దుకాణం యజమాని పసుపుగంటి కోటిరెడ్డికి సాయంత్రం సమయంలో 8985776054 నంబర్ ద్వారా ఫోన్ వచ్చింది. తాను తాళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఏఎ్‌సఐనని, పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ తీవ్రంగా గాయపడిందని, అత్యవసర చికిత్సకోసం వారి బంధువులు నగదు తీసుకువస్తున్నారని చెప్పి రూ.65వేలు పంపాలని చెప్పాడు. ఆ ఫోన్ నెంబర్ ట్రూకాలర్‌లో ఏఎస్సై ఆనందరెడ్డి, తాళ్లూరు అని ఉంది. వ్యాపారి కోటిరెడ్డి తన వద్ద అంత డబ్బులేక పోవటంతో స్నేహితుడు మోటార్ల కొట్టు శ్రీనివాసరెడ్డి ఫోన్ ద్వారా ఆ నంబర్‌కు డబ్బులు ఫోన్‌పే చేయించాడు. ఆ తర్వాత అతను నగదు పంపకపోవటంతో ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. దీంతో డబ్బులు పోయాయని నిర్ధారించుకున్నాడు. అలాగే, మరుసటి రోజు అదేనంబర్ నుంచి తాళ్లూరులోని ఎరువుల దుకాణం వ్యాపారి మేడగం నాగిరెడ్డికి ఫోన్ వచ్చింది. రూ.70వేలు ఫోన్‌పే చేస్తే కానిస్టేబుల్ ద్వారా డబ్బులు పంపుతానని చెప్పాడు. వ్యాపారి తన వద్ద డబ్బులు లేకపోవటంతో కొత్తపాలెంకు చెందిన ధాన్యం వ్యాపారి నాగార్జునరెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పి తనకు ఫోన్ వచ్చిన నెంబర్ ఇచ్చాడు. దీంతో కొత్తపాలెం వ్యాపారి ఆ నంబర్‌కు ఫోన్ చేయగా.. అవతలి వ్యక్తి అదే కథ వినిపించాడు. పోలీసు శాఖకు చెందిన వ్యక్తి అని చెప్పినందున వారితో అవసరముంటుందన్న కారణంతో నాగార్జునరెడ్డి తన ఫోన్‌పే ద్వారా రూ.70వేలు పంపాడు. ఆ తర్వాత ఎంత సేపటికీ డబ్బులు పంపకపోవటంతో ఆందోళన చెందాడు. సదరు వ్యాపారులు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి ఆరా తీయగా ఆనందరెడ్డి అనే పేరుగల వ్యక్తి ఏఎస్సైగా లేడని వెల్లడికావటంతో లబోదిబోమన్నారు.