లాభాల బాటలో కరివేపాకు సాగు
ABN , Publish Date - Nov 25 , 2025 | 10:13 PM
కరివేపాకు సాగు లాభాలబాట పట్టింది. మండలంలోని పసుపుగల్లు, ముండ్లమూరు, చింతలపూడి, తమ్మలూరు గ్రామాల్లో కిరివేపాకు సాగు చేసిన రైతులు లాభాల బాట పట్టారు.
టన్ను రూ.50వేలకు పలికిన ధర
ముండ్లమూరు, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కరివేపాకు సాగు లాభాలబాట పట్టింది. మండలంలోని పసుపుగల్లు, ముండ్లమూరు, చింతలపూడి, తమ్మలూరు గ్రామాల్లో కిరివేపాకు సాగు చేసిన రైతులు లాభాల బాట పట్టారు. ఈఏడాది మొదట్లో ధర పాతాళానికి పడిపోవటంతో రైతులు నష్టాలు మూట గట్టుకున్నారు. ఇటీవల మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు తూర్పుగోదావరి, పశ్చిమగోదావని, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో కరివేపాకు తోటలు దెబ్బతిన్నాయి. దీంతో కరివేపాకు బాగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కసారిగా టన్ను రూ.40వేల నుంచి రూ.50వేల వరకు పెరిగింది. దీంతో కరివేపాకు సాగుచేసిన రైతులు ముమ్మరంగా అమ్మకాలు చేస్తున్నారు.
గత పది రోజుల నుంచి పసుపుగల్లు, తమ్మలూరు, ఉమామహేశ్వర అగ్రహారం, సింగనపాలెం, ఉల్లగల్లు గ్రామాల రైతులు కరివేపాకును అమ్మకాలు చేస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు పట్టణాలకు చెందిన వ్యాపారస్తులు రైతుల పొలాల వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. మూడు నెలల క్రితం కిలో రెండు రూపాయలకు ధర పలికింది. ఒక్కసారిగా ధరలు పాతాళానికి పడి పోవటంతో అప్పట్లో రైతులు నష్టపోయారు. కొంతమంది రైతులు కరివేపాకు తోటలను దున్నివేశారు. రెండు నెలలు తిరగక ముందే రేటు ఒక్కసారిగా పెరిగింది. ఒక్కో ఎకరానికి ఐదు టన్నుల నుంచి ఆరు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఖర్చులు పోను రైతుకు సరాసరి రూ.రెండు లక్షల వరకు మిగులుతుంది. గత పది సంవత్సరాలుగా ఈ సీజన్‌లో టన్ను రూ.50వేలు పలకటం ఇదే ప్రథమం. ధరను చూసిన రైతులు ఒక్కసారిగా వచ్చే ఏడాది మరింత సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మండలంలోని పసుపుగల్లులో దాదాపు రెండు వందల ఎకరాలకు పైగానే కరివేపాకు సాగు చేశారు. ఒక్కో రైతు రెండు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కరివేపాకు సాగు చేశారు. మొత్తంమీద నష్టాల నుంచి లాభాల బాటలో కరివేపాకు రైతులు పయనిస్తున్నారు.
3
(25దర్శి02)మాట్లాడుతున్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పాపారావు తదితరులు
రైతను రాజుగా చేయటమే ప్రభుత్వ లక్ష్యం
- టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రైతును రాజుగా చేయటమే ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. మండలంలోని పెద్దఉయ్యాలవాడలో మంగళవారం రాత్రి జరిగిన రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి రైతు అభివృద్ధి పథంలో సాగేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ల సారథ్యంలో ప్రజాప్రభుత్వం గతంలో ఎన్నడూలేని విధంగా రాయితీ పథకాలు అమలు చేయటంతో పాటు నగదు ప్రోత్సహకాలను అందజేస్తున్నట్టు చెప్పారు. రైతుల్లో సాంకేతిక పరిజ్ఞాణాన్ని పెంపొందించేందుకు ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తున్నట్టు చెప్పారు. ప్రపంచ మార్కెట్‌లో గిరాకీ లభించే విధంగా నాణ్యమైన ఉత్పత్తులు సాధించేలా ప్రకృతి సేద్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు. నీటి భద్రత సాధించేందుకు జలవనరులను పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను తుచ తప్పకుండా అమలు చేయటమే కాక రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుండటంతో ప్రజాప్రభుత్వం పట్ల అన్నివర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, ఏడీఏ బాలాజీనాయక్, వ్యవసాయాధికారి కె.రాధ, దర్శి మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సుబ్బారావు, టీడీపీ దర్శి పట్టణ అధ్యక్షుడు పుల్లలచెరువు చిన్నా, మండల అధ్యక్షుడు మారెళ్ల వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.